Suryaa.co.in

Features

లైంగిక బానిసత్వ ప్రమాదంలో ఆఫ్ఘన్ మహిళలు

రెండు దశాబ్దాల విరామం తర్వాత తిరిగి ఆఫ్ఘానిస్తాన్ కరడుగట్టిన ఛాందస ఇస్లామిక్ ఉగ్రవాదులైన తాలిబన్ల స్వాధీనం కావడంతో ఎక్కువగా ఆందోళన చెందుతున్నది ఆ దేశంలోనే మహిళలే. తాలిబన్ల పాలనలో తామంతా లైంగిక బానిసలుగా మ్రగ్గవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
గత నెల జూలైలో తాలిబాన్ ఆదేశం స్థానిక మత నాయకులను తాలిబాన్ పోరాట యోధులతో ‘వివాహం’ కొరకు 15 ఏళ్లు పైబడిన బాలికలు, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను అందించమని తాలిబన్లు కోరడం గమనార్హం. దేశంలోనే పెద్ద ప్రాంతాలపై నియంత్రణ సాధించినప్పటి నుండి మొదటగా తాలిబన్లు చేస్తూ వస్తున్నది ఆఫ్ఘన్ మహిళలకు ఒక డిక్టాట్ జారీ చేయడం.
ఆఫ్ఘన్ సేనల నుండి కనీస ప్రతిఘటన, అంతర్జాతీయ ఒత్తిడి లేకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోవడానికి దారితీస్తుంది. ఇప్పుడిప్పుడే ఆఫ్ఘన్ మహిళలు భయకంపితులు కావడం ప్రారంభం అవుతున్నది. జూలై ప్రారంభంలో, బడాఖాన్, తఖర్ ప్రావిన్సులను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబాన్ నాయకులకు హుకుం జారీ చేశారు.
15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలు, 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వితంతువుల జాబితాను తాలిబన్‌ ఉగ్రవాదులతో వివాహం జరిపించడానికి అందించాలని ఆదేశించారు. అటువంటి జాబితాలు ఏమేరకు సిద్ధమయ్యాయి తెలియదు.
ఒకవేళ ఈ బలవంతపు వివాహాలు జరిగితే, మహిళలు, బాలికలను వెంటనే పాకిస్తాన్‌లోని వజీరిస్తాన్‌కు పంపి, అక్కడ వారు తిరిగి విద్యనభ్యసించవలసి వస్తుంది. తద్వారా వారిని ‘ప్రామాణికమైన ఇస్లాం’ మహిళలుగా మార్చుతారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి గత మూడు నెలల్లో తొమ్మిది లక్షల మంది నిర్వాసితులయ్యారు. వెనుతిరిగే వారి పరిస్థితి భయంతో నిండిపోయింది.
ఈ తాలిబాన్ ఆదేశం మున్ముందు ఏమి జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా హెచ్చరిస్తుంది. వారి క్రూరమైన 1996-2001 పాలనలో కఠినమైన రిమైండర్‌గా పనిచేస్తుంది. ఆ సమయంలో మహిళలు నిరంతరం మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యారు, వారికి ఉద్యోగాలు, చదువుకొనే అవకాశాలను పూర్తిగా నిరాకరించారు.
వారు బురఖా ధరింప వలసిందే. ఇంటి నుండి బయటకు వెళ్లడం నిషేదిస్తారు. మగవారి సంరక్షణలో ఉండవలసిందే. మహిళలు, వారి హక్కులపై తాము తమ వైఖరిని మార్చుకున్నామని తాలిబన్లు ఇప్పుడు చెబుతున్నప్పటికీ వేలాది మంది మహిళలను లైంగిక బానిసత్వానికి గురి చేసేందుకు తాలిబాన్ చర్యలు, తాజా ప్రయత్నాలు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
ఇంకా, తాలిబాన్లు 12 సంవత్సరాల వయస్సు దాటిన బాలికల విద్యను తిరస్కరించాలని, మహిళలను ఉపాధి, ఉద్యోగాల నుండి నిషేధించాలని, మహిళలను సంరక్షకుడితో పాటుగా తీసుకురావాల్సిన చట్టాన్ని తిరిగి తీసుకు రావాలనే తమ ఉద్దేశ్యాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ మహిళలు సాధించిన ప్రయోజనాలు, ముఖ్యంగా విద్య, ఉద్యోగం, రాజకీయ భాగస్వామ్యంలో తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని చెప్పవచ్చు.
‘భార్యలను’ అందజేయడం చేయడం అనేది మిలిటెంట్లను తాలిబాన్‌లో చేరడానికి ఉద్దేశించిన వ్యూహం. ఇది లైంగిక బానిసత్వం, వివాహం కాదు. వివాహ ముసుగులో మహిళలను లైంగిక బానిసత్వంలోకి నెట్టడం యుద్ధ నేరం, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం అవుతుంది. జెనీవా కన్వెన్షన్ ఆర్టికల్ 27 ఈ విషయమై ఇలా చెబుతోంది: “ముఖ్యంగా మహిళలకు తమ గౌరవంపై, ప్రత్యేకించి అత్యాచారం, బలవంతపు వ్యభిచారం లేదా మరేదైనా అసభ్యకర దాడులకు వ్యతిరేకంగా రక్షణ కల్పించాలి.”
2008 లో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1820 తీర్మానాన్ని ఆమోదించింది: “అత్యాచారం, ఇతర లైంగిక హింసలు యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు” అని ప్రకటించారు. ఈ తీర్మానం లైంగిక హింసను సమాజంలోని పౌర సభ్యులలో అవమానకరమైన, ఆధిపత్యం, భయాన్ని కలిగించే యుద్ధ ఉద్దేశ్యంగా గుర్తించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే, అరాచకాలను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ఏవిధంగా స్పందిస్తుందనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. నిపుణుల నుండి వచ్చిన సలహాలలో స్థిరమైన శాంతి, తక్షణ కాల్పుల విరమణకు సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. అలాగే, మహిళల హక్కులకు భరోసా – ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగం, జాతీయ చట్టం, అంతర్జాతీయ చట్టంలో పొందుపరచారు. వాటిని తాలిబన్లు ఏమాత్రం గౌరవించి, అమలులో కొనసాగిస్తారా సందేహాస్పదమే.
ప్రస్తుతం, ఆఫ్ఘన్ ప్రభుత్వ బృందంలో నలుగురు మహిళా శాంతి సంధానకర్తలు మాత్రమే ఉన్నారు. తాలిబాన్లలో ఎవరూ లేరు. తాలిబాన్‌లపై ఆంక్షలను ఎత్తివేయడం తప్పనిసరిగా మహిళల హక్కులను కాపాడడానికి వారి నిబద్ధతపై షరతులతో ఉండాలి.
27 ఏండ్ల జరీఫా గఫారీ, 2018లో ఆఫ్ఘనిస్థాన్‌ తొలి మహిళా మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. తన దేశ భవిష్యత్తు బాగా ఉంటుందని మూడు వారాల కిందట ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాలిబన్లు కాబూల్‌ను కూడా ఆక్రయించడంతో తన చావు తప్పదని ఇప్పుడు ఆమె భయాందోళన చెందుతున్నారు.తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. తాలిబన్లు తనలాంటి వారిని కచ్చితంగా చంపుతారని గఫారీ ఆందోళన వ్యక్తం చేశారు.
‘తాలిబన్లు నాలాంటి వ్యక్తుల కోసం వచ్చి చంపుతారు. వారి రాక కోసం నేను ఎదురు చూస్తున్నా. వారు వచ్చే వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. నాకు, నా కుటుంబానికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. అందుకే నేను నా భర్త, కుటుంబంతో కలిసి ఇంట్లో ఉన్నాను. తాలిబన్లు నాలాంటి వారి కోసం వెదికి చంపుతారు. నేను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళలేను. ఏయినా నేను ఎక్కడికి వెళ్లగలను?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE