-కియా ఇండియాకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాం..
-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-రెండేళ్లపాటు కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కియా ఇండియాకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించాం
– కియా ఇండియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున శుభాకాంక్షలు
– రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 13 : పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న ‘కియా మోటార్స్’ కంపెనీ గత నాలుగేళ్లలో 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి & పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, కియా మోటార్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పెనుకొండ వద్దనున్న కియా ఇండియా పరిశ్రమలో 10 లక్షల కార్లు ఉత్పత్తి కావడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడినదని, పెనుకొండ వద్ద 15 వేల కోట్ల పెట్టుబడితో దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పిస్తూ, అందులో 85 శాతం మందికిపైగా స్థానికులకు ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇక్కడ ఏ పరిశ్రమ ఏర్పాటు చేసిన 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలని చట్టం తీసుకురావడం జరిగిందన్నారు.
2023 నాటికి కియా ఇండియాలో 10 లక్షల కార్లు ఉత్పత్తి కావడం జరిగిందన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఏడాదికి సగటున 13 వేల కోట్లు పెట్టబడులు వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఏడాదికి సగటున 13వేల కోట్లు పెట్టబడులు రాగా, గత ప్రభుత్వంలో ఏడాదికి 11 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా నిదానంగా ఉన్నాయని, వ్యాపార పరంగా తగ్గుముఖం పట్టాయని, రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వల్ల వెనుకబడ్డామని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా గత ప్రభుత్వానికన్నా అధికంగా సగటున 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
కియా ఇండియాకు సంబంధించి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని, అవసరమైన భరోసాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పరిశ్రమలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు గాని చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కియా ఇండియా 2019 డిసెంబర్ నుంచి ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత 10 లక్షల కార్లు ప్రొడక్షన్ పూర్తి చేసుకుందన్నారు. కేవలం 47 నెలల కాలంలోనే అత్యంత వేగవంతంగా 10 లక్షల కార్లను తయారుచేసిన కియా సంస్థను అభినందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున కూడా కియా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు.
గడిచిన నాలుగేళ్లలో దాదాపు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కియా ఇండియాకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించామన్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో కూడా సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కియా ఇండియా ప్రతినిధులు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.
కియా ఇండియాకి, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా అందించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చట్టం ఉండగా, 86 శాతం స్థానికులకు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని కియా కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, హైదరాబాద్ – బెంగళూరు కేరిడార్ లో ఓర్వకల్లు వద్ద 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అక్కడ అవసరమైన నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని, 400 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుతో నీటి సరఫరా కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమలు ఏర్పాటు సంబంధించి 30 వేల కోట్ల రూపాయల క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. కియా ఇండియా ఎక్కడికి తరలి వెళ్లదని, ఇలాంటివి అవాస్తవమని, ఇక్కడ అతి తక్కువ సమయంలో 10 లక్షల కార్ల ఉత్పత్తి ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు పరిశ్రమకు అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కియా ఇండియాలో 10 లక్షల కార్లను ఉత్పత్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అతి తక్కువ వ్యవధిలో 10 లక్షల కార్ల ఉత్పత్తి అనేది ఎంతో గొప్ప విషయమన్నారు. కియా పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరమైన సహకారాలు అందిస్తున్నారు. పరిశ్రమ కోసం అవసరమైన భూమి, నీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి & పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ మాట్లాడుతూ కియా ఇండియాలో పది లక్షల కార్ల ఉత్పత్తి అనేది గర్వించదగ్గ విషయమన్నారు. పెనుకొండ నియోజకవర్గం ప్రాంతంలో కియా ఏర్పాటు గొప్ప వరమన్నారు. పరిశ్రమ పరిధిలో సి ఎస్ ఆర్ యాక్టివిటీ కింద మరింత నిధులు ఖర్చు చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో కియా ఇండియా ఎండి & సిఈఓ టె జిన్ పార్క్, చీఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ చోయ్ మూన్‌హీ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ, ప్రొడక్షన్ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకదేశన్, కియా భారతదేశ విజన్ అంబాసిడర్ సోనమ్, పిఆర్ఓ తేజస్వి బండారి, తదితరులు పాల్గొన్నారు.