– అంతర్జాతీయంగా ఎఐతోపాటు డాటాసెంటర్లకూ డిమాండ్
– భారతదేశంలో $64.4 బిలియన్లకు చేరిన జిసిసి ఆదాయం
– విశాఖపట్నంలో ఎన్విడియా సహకారంతో ఎఐ యూనివర్సిటీ
– భవిష్యత్ ఎఐపై రౌండ్ టేబల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
దావోస్ : పెరుగుతున్న ఎఐ మార్కెట్ కు అనుగుణంగా ఎఐ డాటా సెంటర్లకు కూడా రాబోయే రోజుల్లో డిమాండ్ పెరగనుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2030 నాటికి గ్లోబల్ ఎఐ మార్కెట్ 1.6 ట్రిలియన్లకు, 2032కు 2.74 ట్రిలియన్లకు చేరనుందని అంటూ మెకన్సీ అండ్ గార్టర్ నివేదికను ప్రస్తావించారు. షేపింగ్ ద ఫ్యూచర్ నెక్ట్స్ జెన్ ఎఐ – ఇన్నొవేషన్ హబ్, డాటా ఫ్యాక్టరీ అండ్ ఎఐ యూనివర్సిటీ అనే అంశంపై దావోస్ బెల్వడేర్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎన్విడియా గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎఐ నేషన్స్ శిల్పా కొల్హాట్కర్ (వర్చువల్ గా హాజరు), హార్వర్డ్ యూనివర్సిటీ గ్రోత్ ల్యాబ్ విభాగం డైరక్టర్ రిచర్డో హస్మన్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఇండస్ట్రియల్ ఎఐ ప్రొఫెసర్ అండ్ డైరక్టర్ జె లీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ ఫ్రొఫెసర్ సాదీ క్రీజ్ హాజరుకాగా, ఎన్ డిటివి ప్రాఫిట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నీరజ్ షా సంధానకర్తగా వ్యవహరించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2030నాటికి గ్లోబల్ డాటా సెంటర్స్ డిమాండ్ సగటున 19 నుంచి 22శాతంతో 219 గిగావాట్లకు ఉండొవచ్చని తెలిపారు. డాటా సెంటర్ల మార్కెట్ లో 40శాతం వాటాతో నార్త్ అమెరికా (1000 డాటా సెంటర్లు) ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 1మిలియన్ ఎఐ వృత్తినిపుణుల కొరత ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం బెంగుళూరులోని సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో టాప్ ఇన్నొవేషన్ హబ్ గా ఉందని చెప్పారు.
ఎఐలో అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో భారత్ ముందుకెళ్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. జాతీయ ఎఐ వ్యూహానికి అనుగుణంగా ఆర్థిక వృద్ధి, సామాజికాభివృద్ధి కార్యక్రమాల కోసం ఎఐని ఉపయోగించాలన్న లక్ష్యంతో భారత్ పనిచేస్తోంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, వ్యవసాయంతో సహా విభిన్న రంగాల్లో 1600కు పై ప్రస్తుతం ఎఐ స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో మరో నాలుగు మిలియన్ ఐటి నిపుణులతో ఎఐలో అధునాతన ఆవిష్కరణలు రానున్నాయి. గవర్నమెంట్ ఎఐ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారత్ ప్రపంచ వ్యాప్తంగా 46వస్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జిసిసి) 1800 భారత్ లోనే ఉన్నాయి. 2024లో భారతదేశ జిసిసి ఆదాయం $64.6 బిలియన్లకు చేరినట్లు నాస్కామ్ నివేదిక వెల్లడిస్తోంది. భారతదేశ జిసిసి మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు చేరి, దీనిద్వారా 2.5 మిలియన్ల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. దేశంలో 57శాతం సంస్థలు ఎఐని వినియోగిస్తున్నాయి, రాబోయే రెండేళ్లలో ఎఐ వినియోగం మరో 25శాతం పెరిగే అవకాశం ఉంది.
అమరావతిని AI సిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. విశాఖనగరంలో AI విశ్వవిద్యాలయాన్ని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ఇందుకు సంబంధించి మేము NVIDIAతో ఎంఓయు కుదుర్చుకునే పనిలో ఉన్నాం. ఈ విశ్వవిద్యాలయం పరిశోధన దృష్టిని సంభావితం చేయడంలో మాకు సహాయపడుతుంది. ఎపిలో వరల్డ్ క్లాస్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ సంస్థలతో మేం టచ్ లో ఉన్నాం. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ లను రప్పించడంలో మా ముఖ్యమంత్రికి విజయవంతమైన చరిత్ర ఉంది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కి ఐఎస్ బి తెచ్చిన విధానం చంద్రబాబు గారి సామర్థ్యానికి గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 2వేలకు పైగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద టాలెండ్ పూల్ కలిగి ఈఓడిబి స్టేట్ ర్యాంకింగ్స్ లో నిలకడగా టాప్ అచీవర్ గా ఎపి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఎఐ & ఎంఎల్ లో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం. భవిష్యత్తులో విద్యార్థుల్లో ఎఐ నైపుణ్యాలను పెంపొందించడానికి 7నుంచి 9వతరగతి వరకు పాఠశాల పాఠ్యాంశాల్లో ఎఐని ప్రవేశపెట్టబోతున్నాం.
పింఛనుదారుల గుర్తింపు, పెన్షన్‌ల పంపిణీ కోసం AI ఆధారిత రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో ఎఐని వినియోగించి ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన టెక్స్ట్ మెసేజ్ లు పంపడం ద్వారా పంట ఉత్ఫాదకత పెంపుదలకు చర్యలు చేపడుతున్నాం. ఆంధ్రపదేశ్ అత్యాధునిక ఎఐ కటింగ్ ఎడ్జ్ సొల్యూషన్స్ రూపొందించడమేగాక… భవిష్యత్తులో ఎఐ ఆధారిత ఆవిష్కరణలను కొనసాగించేందుకు దీర్ఘకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.