– తెలంగాణలో ఆమెతో కుదరదన్న రేవంత్‌రెడ్డి
– కేసీఆర్‌కు మరో అస్త్రం ఇవ్వవద్దని స్పష్టీకరణ
– గతంలో టీడీపీతో పొత్తును కేసీఆర్ వాడుకున్నారన్న సీనియర్లు
– ఇప్పుడు మళ్లీ షర్మిలను అడ్డుపెట్టుకుంటారన్న విశ్లేషణ
– కోమటిరెడ్డి మినహా షర్మిల రాకపై మిగిలిన నేతల వ్యతిరేకత
– ఏపీకే పంపించాలని అధిష్ఠానానికి నేతల సూచన
-షర్మిలతో ఏపీలో కాంగ్రెస్ కోలుకుంటుందని వివరణ
– కానీ ఏపీకి వెళ్లేందుకు అంగీకరించని షర్మిల
– తెలంగాణలోనే పోటీ చేస్తానని వాదన
– మధ్యేమార్గంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదన
– షర్మిలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇచ్చేందుకు సిద్ధం
– తాజాగా ఢిల్లీలోసోనియాతో షర్మిల భేటీ
– గత వారమే అపాయింట్‌మెంట్ కోరిన షర్మిల
– కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించిన షర్మిల
– కర్నాటక నుంచి రాజ్యసభపై డికె శివకుమార్ హామీ
– ముందు కాంగ్రెస్‌లో కాలుపెట్టాలన్నదే షర్మిల వ్యూహం?
– వచ్చే వారం కాంగ్రెస్‌లో షర్మిల చేరిక?
– ఏపీ నేతలను సంప్రదించని కాంగ్రెస్ హైకమాండ్?
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగమొండిగా పేరున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి-వైఎస్ కుమార్తె షర్మిల.. ఎట్టకేలకు తన పట్టు -పంతం సడలించుకున్నారు. ‘‘వేదిక ఏదైనా వైఎస్ ఆశయసాధనే లక్ష్య’’మంటూ, సరికొత్త రాగం తీసిన ఈ వైఎస్ కోయిల.. చివరాఖరకు కాంగ్రెస్ చెట్టుపై వాలనున్నారు. ఆ మేర కు ఇప్పటివరకూ కొనసాగించిన తన పంతం సడలించుకుని.. ‘హస్త’వాసి అయేందుకు అడుగులు వేస్తున్నారు.
వైఎస్ షర్మిల ఇకపై జాతీయ నేతగా అవతరించనున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఆ హోదా కల్పించనున్నట్లు సమాచారం. తాను పుట్టించిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు, సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే, వచ్చే వారమే ముహుర్తం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
షర్మిల కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైనప్పటికీ, అది ఎప్పుడన్న అంశం పెండింగ్‌లోనే ఉంది. షర్మిల తాను తెలంగాణ కాంగ్రెస్‌లో పనిచేస్తానని నాయకత్వానికి స్పష్టం చేశారు. తనతోపాటు, తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరికొందరు సీనియర్లు మాత్రం, ఆమె ప్రతిపాదనను అంగీకరించలేదు. షర్మిల ఏపీకి చెందిన నేత అయినందున, ఆమె అక్కడే పనిచేయాలని రేవంత్ వర్గం నాయకత్వానికి సూచించింది. ఏపీలో పనిచేస్తే కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటుందని, వైఎస్ బిడ్డగా ఆమెను ఏపీ ప్రజలు ఆదరిస్తారని సూచించారు.
గతంలో టీడీపీతో కాంగ్రెస్ పెట్టుకున్న అంశాన్ని అడ్డుపెట్టుకున్న కేసీఆర్.. ఎన్నికల ప్రచారంలో దానిని ఉపయోగించుకుని, మళ్లీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని రేవంత్ వర్గం నాయకత్వానికి వివరించింది. అప్పుడు కేసీఆర్ టీడీపీని ఆంధ్రా పార్టీ అని, ఆంధ్రావాళ్లకు ఇక్కడేం పని? కొన్ని సీట్ల కోసం ఆంధ్రా పార్టీతో జతకడతారా? థూ.. మీ బతుకుచెడ అంటూ మరోసారి, తెలంగాణ భావోద్వేగం రెచ్చకొట్టిన వైనాన్ని నాయకత్వానికి విశ్లేషించారు.
ఇప్పుడు షర్మిల రూపంలో ఓటమి దశలో ఉన్న బీఆర్‌ఎస్‌కు మరో అస్త్రం అందివ్వవద్దని స్పష్టం చేశారు. అయితే ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ఒకరిద్దరు మినహా, మిగిలిన తెలంగాణ నేతలంతా ఆమె తెలంగాణలో రాకను వ్యతిరేకిస్తున్నారు. దీనితో సహజంగానే పంచాయతీ ఢిల్లీకి చేరింది.
ఇరు వర్గాల వాదన-విశ్లేషణలు విన్న నాయకత్వం.. మధ్యేమార్గాన్ని సూచించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా… షర్మిలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు ఆమె కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
ఆంధ్రా-తెలంగాణ అని కాకుండా, ముందు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి, ఎన్నికల్లో అవసరం బట్టి ఆమె సేవలను వినియోగించుకోవాలని, కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే.. ఆమెను ప్రధానంగా ఏపీలోనే పర్యటించేలా చూడాలన్నది, పార్టీ నాయకత్వం యోచన అంటున్నారు. అన్నపై అస్త్రంగానే ఆమెను సంధించాలన్నది, కాంగ్రెస్ అసలు లక్ష్యమంటున్నారు.
అటు షర్మిల కూడా తన వాస్తవ పరిస్థితిని గ్రహించి, ముందు కాంగ్రెస్‌లో చేరడమే ప్రధాన ంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఏఐసిసి ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపినట్లు, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక ఎక్కువకాలం ఒంటరిపోరాటం చేసే శక్తి లేదని షర్మిలకూ తెలుసని, అందుకే కాంగ్రెస్ ప్రతిపాదనను అంగీకరిచినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా కర్నాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్ ఆమెకు, కర్నాటక నుంచి రాజ్యసభ సీటు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల, ఆమేరకు సోనియాతో చర్చించారు. నిజానికి ఆమెతో భేటీకి, గత వారమే అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆమె భర్త బ్రదర్ అనిల్ ప్రయత్నాలు చేశారని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా షర్మిల వచ్చే వారం కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
అయితే.. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకునే వ్యవహారంలో ఆ పార్టీ నాయకత్వం, ఏపీ నేతలను మాత్రం.. చర్చల ప్రక్రియలో భాగస్వామిని చేయకపోవడమే ఆశ్చర్యం. అసలు నాయకత్వం షర్మిల అంశంలో తమను సంప్రదించడం గానీ, అభిప్రాయాలు అడగటం గానీ చేయడం లేదని వాపోతున్నారు. తాము షర్మిల కాంగ్రెస్ చేరిక వ్యవహారాన్ని మీడియాలోనే చూస్తున్నామంటున్నారు.