( కవిసామ్రాట్ జయంతి)
ఆయన మేటి రచనేమో
రామాయణ కల్పవృక్షం..
ఆయనేమో
సాహితీ మహావృక్షం..
ఆ కలం నుంచి జాలువారిన
వేయిపడగలు
సాక్షాత్తు పాములపర్తినే మెప్పించి అయింది
హిందీలో సహస్రఫణి..
లక్షపుటలైనా రాసి ఉన్న
కవితా చూడామణి..!
విశ్వనాథ సత్యనారాయణ..
లేదట ఆయనకు తెలియని సాహితీప్రక్రియ..
దేనికైనా అక్షరమే
ఆయన ప్రతిక్రియ..
స్వరాజ్య సంగ్రామంలోనూ
చేయ్యేసినాడట పరుషంగా
ఆ అనుభవమూ అక్షరబద్ధమైంది
ఆంధ్ర పౌరుషం గా..
పట్టింది పట్టేయడమే..
తట్టింది రాసెయ్యడమే…!
తెనుంగు సాహితీకులానికి
విశ్వనాథుడే పెద్దదిక్కు..
ఆయనదేమో మధురవాక్కు..
విషయం ఏదైనా
సాహిత్యమే దృక్కు..
లోకాన్ని చూస్తూ ఎగాదిగా
రాసేసినాడు ఎడాపెడా..
కలం విప్పితే తేలాల్సిందే
తాడా..పేడా!
విధం ఏదైనా సమగ్ర ఆవిష్కరణే
కవిసామ్రాట్ లక్షణం…
వాక్కులో..దృక్కులో..
వ్యాసంలో..సమాసంలో..
దర్శనంలో..విమర్శనంలో..
భాష్యంలో..కొండొకచో భేషజంలో..ఇజంలో
భాషణంలో..భూషణంలో…
అన్నిటా విలక్షణమే..!
కవిత ఆయన ఇంటి నెలత
కావ్యం రసరమ్యం..
పద్యకావ్యమైతే
అది మరీ శ్రావ్యం..
విమర్శ సున్నితంగా
గుచ్చే ములుకు..
ప్రయోగం పదునైన పలుకు..
ఇలా అన్ని ప్రక్రియలో నిష్ణాతుడై..విలక్షణుడై..
ఒకనాటికి పద్మవిభూషణుడైన
సాహితీ విరాన్మూర్తి..
అంతేలేని కీర్తి..!
ఆ కలమే కలకలం..
జయించి కాలం..
నిలిచింది కలకాలం..
మెచ్చింది కవికులం..!
కవిసామ్రాట్ విశ్వనాథ వారి
జయంతి సందర్భంగా
అక్షర నీరాజనాలు..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286