* ఎగిరిపోతున్న ఏపీ ఆదాయం
* కర్నాటక పెట్రోల్బంకుల్లోనూ తెలంగాణ వాహనాలు
* పెట్రోల్‌పై ఏపీ-తెలంగాణ వ్యాట్ తగ్గించని ఫలితం
* ఏపీలో మందు రేట్లు, బ్రాండ్లపై తెలంగాణ ప్రభావం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన ఆదాయం పక్క రాష్ట్రాలకు పోతోంది. ఏ రాష్ట్రానికయినా మద్యం, పెట్రోల్ అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరు. మద్యం పూర్తిగా రాష్ట్ర విధానమయితే, పెట్రో అమ్మకాల ఆదాయం కేంద్రం ప్రకటించే విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు విధానాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులయిన తెలంగాణ, కర్నాటకు కాసులు కురిపిస్తూ, ఏపీకి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నాయి. అదెలాగో చూద్దాం.
ఏపీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో బ్రాండెడ్ లిక్కర్ లేకపోవడంతో.. మందుబాబులంతా కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని తెలంగాణ, ఒడిషా, కర్నాటక , తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి తమకు ఇష్టమైన మద్యం తెచ్చుకుంటున్నారు. శని, ఆదివారాల్లో అయితే చాలామంది బృందాలుగా ఏర్పడి రెండురోజులు ఆయా రాష్ట్రాల్లోనే ఉండి, మద్యం తాగి వస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.
ప్రధానంగా.. తెలంగాణ లిక్కర్లో నాణ్యత ఉండటంతోపాటు.. ధర కూడా ఏపీ కంటే 30 శాతం తక్కువగా ఉంది. దీనితో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మందుబాబులు.. గుంటూరు జిల్లా సరిహద్దులోని పొందుగల చెక్‌పోస్టు, నాగార్జునసాగర్ సమీపంలోని విజయపురి సౌత్, కృష్ణా జిల్లా సరిహద్దు లోని గరికపాడు చెక్‌పోస్టు దాటి తెలంగాణకు వెళుతున్నారు. ఏపీలో ఇటీవలి కాలంలో, కొన్ని బ్రాండెడ్ మద్యం కంపెనీలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే 30 శాతం రేట్లు అధికం. దానితో మందుబాబులు సహజంగానే తెలంగాణ వైపు చూస్తున్నారు.
‘‘తెలంగాణలో 100 పైపర్స్ విస్కీ ఫుల్‌బాటిల్ 1910 రూపాయలుంటే ఇక్కడ 2500 రూపాయలకు అమ్ముతున్నారు. తెలంగాణలో చీప్‌లిక్కర్ క్వార్టర్ 90 రూపాయలుంటే, ఇక్కడ 120 రూపాయలకు అమ్ముతున్నారు. తెలంగాణలో మ్యాన్షన్‌హౌస్ క్వార్టర్ బాటిల్ 120 రూపాయలుంటే, ఇక్కడ 200 రూపాయలకు అమ్ముతున్నారు. పైగా తెలంగాణ లిక్కర్‌ను మొలాసిస్తో తయారుచేస్తారు. కాబట్టి నాణ్యత, రుచి బాగుంటుంది. కానీ ఏపీలో నంద్యాల, నందిగామ, శింగరాయకొండ ఫ్యాక్టరీలో ఇష్టమొచ్చిన బ్రాండ్లతో మందు తయారుచేస్తున్నారు. పైగా ఇక్కడ స్పిరిట్‌తో తయారుచేస్తుండటం వల్ల, తెలంగాణ బ్రాండ్స్ మాదిరిగా టేస్ట్ ఉండదు. పైగా ఆరోగ్య సమస్యలొస్తాయని భయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏపీతో పోలిస్తే, తెలంగాణలో రేట్లు 30 శాతం తక్కువ. అందుకే అందరూ అక్కడికే వెళ్లి తాగివస్తున్నారు. లేదా తెచ్చుకుంటున్నారు. ఇవికాకుండా, మిలటరీ మద్యం కూడా ఏపీ రేట్ల కంటే బాటిల్‌కు 50- 100 రూపాయల తక్కువకే బయట దొరుకుతోంది’’ అని గుంటూరుకు చెందిన ఓ బార్ రెండ్ రెస్టారెంట్ యజమాని వివరించారు.
తెలంగాణలో తమకు కావలసిన బ్రాండ్లు ఉంటాయని, అదే తమ దగ్గర ఉన్న ప్రభుత్వ వైన్‌షాపుల్లో అందుబాటులో లభించే బ్రాండ్లు మాత్రమే కొనాల్సి వస్తోందని మందుబాబులు అమ్మకాల తేడాను విశ్లేషిస్తున్నారు. ఏపీలో మందుబాబులు మ్యాన్షన్‌హౌస్ బ్రాందీ, బ్లెండర్స్ప్రైడ్, 100 పైపర్స్ ,బ్లాక్‌డాగ్ విస్కీ ఎక్కువగా తాగుతారని బార్ యజమానులు చెబుతున్నారు.
నిజానికి దీనివల్ల రాష్ట్రానికి రావలసిన ఆదాయం కూడా పోతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతి బాటిల్ అమ్మకంపై వచ్చే ఆదాయమంతా రాష్ట్ర ఖజానాకే వెళుతుంది కాబట్టి, గతంలో ఈ ఆదాయమంతా రాష్ట్రానికే దక్కేది. గతంలో తెలంగాణతో సమానంగా అన్ని బ్రాండ్లు దొరికినందువల్ల, ఎవరూ తెలంగాణ
రాష్ట్రం నుంచి మద్యం తీసుకురావలసిన అవసరం కలిగేది కాదంటున్నారు. ఇప్పుడు తాము పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి వినిపించని విచిత్ర బ్రాండ్లు అమ్ముతుండటం వల్ల, తెలంగాణ నుంచి తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని మందుబాబులు వివరిస్తున్నారు.
ఇక గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు గోవా నుంచి కూడా మద్యం అక్రమ మార్గాల్లో తరలిస్తు, సొమ్ము చేసుకుంటున్నారన్నది ఒక ఆరోపణ. అదే వేరే విషయం.
మద్యం పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పెట్రోలుది ఇంకో వైచిత్రి. కర్నాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సులు, కార్లు, చివరకు టూ వీలర్లు కూడా.. 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని కర్నాటక రాష్ట్రంలోని, వెళ్లి పెట్రోల్-డీజిల్ కొనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం పెట్రోల్-డీజిల్‌పై వ్యాట్ తగ్గించకపోగా, కరోనా కాలంలో అదనంగా ఒక రూపాయి రోడ్ సెస్ కూడా విధించింది. దానివల్ల సుమారు 650 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
కానీ పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పెట్రోల్-డీజిల్‌పై లీటరుకు పది, పదకొండు
రూపాయలు వ్యాట్ తగ్గించింది. దేశంలోని అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాయి. ఫలితంగా అక్కడ రేట్లు తగ్గడంతో ఆంధ్రా సరిహద్దులోని ప్రజలు, కర్నాటకకు వెళ్లి మరీ ఇంధన అవసరాలు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీ-కర్నాటక వైపు ప్రతిరోజూ తిరిగే ప్రైవేటు ట్రావెల్స్‌కు ఇది లాభంగా మారింది.
అయితే దీని ప్రభావం ఒక్క రాష్ట్ర ఖజానాపైనే కాదు. కర్నాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా పెట్రోల్బంకులపైనా పడింది. ఫలితంగా యజమానులు పెట్రోలు బంకులను, స్థలంతో సహా అమ్ముకుంటున్న దుస్థితి కనిపిస్తోంది. అనంతపురం నుంచి బాగేపల్లి, పావగడ, మధుగిరి, బళ్లారి, గౌరిబిదనూరు, విడపనకల్లు, కొడికొండ, ఎగురవపల్లి, చిలమర్తూరు చెక్‌పోస్టులు కర్నాటకకు ఆనుకునే ఉంటాయి.
ప్రధానంగా డి.హీరేహళ్, గుంతకల్, బొమ్మన్హాల్ మండలాల్లో ఉన్న పెట్రోల్బంకులన్నీ అమ్మకాలు లేక మూతబడి కనిపిస్తున్నాయి. కాగా పెట్రోల్ బంకులను కొనుగోలు చేసిన రైతులు, వాటిని గడ్డివాములుగా వాడుకుంటున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
ఇక తెలంగాణకు చెందిన ప్రైవేటు బస్సులు, వాహనాలు కూడా కర్నాటకలోని పెట్రోలు బంకుల వద్ద దర్శన మిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్ తగ్గించకపోవడమే దానికి కారణం. మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతమయిన మంత్రాలయంతోపాటు బీదర్ కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావడంతో, ఆ జిల్లాల ప్రజలు కర్నాటకకు వెళ్లి పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ బస్సులు కూడా, కర్నాటక రాష్ట్రంలో పెట్రోలు కొనుగోలు చేస్తోందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ విధంగా ప్రజలు… ఆంధ్రాలో మద్యం కోసం తెలంగాణకు తరలివెళుతుంటే, ఆంధ్రా-తెలంగాణ ప్రజలు పెట్రోల్-డీజిల్ కోసం కర్నాటకకు వెళుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.