Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు శిష్యులంతా బీజేపీలో చేరి నటిస్తున్నారు

– గోవాలో కేసినోను బ్యాన్ చేయమని సోము వీర్రాజు ఎందుకు అడగడం లేదు
– రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలే కదా

– కేసినోపై పోరాటం చేస్తే బీజేపీని నమ్ముతారు
– సోమును టీడీపీ తడికెలా అడ్డం పెట్టుకుంటోంది
– వాళ్ళ మాటలు నమ్మి మత కలహాలు సృష్టించొద్దు
– గోవా సంస్కృతి హైదరాబాద్ లోని ఫిలింసిటీలో ఉంది
– వాటినైనా ఆపేందుకు సోము వీర్రాజు ప్రయత్నించాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 25: గోవాలో కేసినోను బ్యాన్ చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడో లేక తెలుగుదేశం పార్టీ బీ గ్రూపు అధ్యక్షుడో అర్ధం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన నాయకులను పక్కన వేసుకుని వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలకు చంద్రబాబు ఎజెండాకు అనుకూలంగా సోము వీర్రాజు పనిచేస్తున్నాడన్నారు. సోము వీర్రాజు పదే పదే గోవా కల్చర్ వచ్చిందని అంటున్నాడని, అది అంత వరెస్ట్ కల్చర్ అయినపుడు ఎందుకు వ్యతిరేకించడం లేదని అన్నారు. గోవాలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయన్నారు. వరెస్ట్ కల్చర్ అయినపుడు కేసినోను ఎందుకు బ్యాన్ చేయడం లేదని ప్రశ్నించారు. బ్యాన్ చేయమని ప్రధాని మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. భారతీయ సంస్కృతులను బీజేపీ కాపాడాలని అనుకుంటే ఫ్లైట్ టికెట్లను కొనిపెడతానని, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కేసినోలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మిమ్ములను నమ్ముతారన్నారు. కేసినోలను పెట్టి, వచ్చే డబ్బుతో ప్రభుత్వాలను నడుపుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్కు వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించరన్నారు.

తెలుగుదేశం పార్టీ సోము వీర్రాజును తడికెలా అడ్డం పెట్టుకుంటోందన్నారు. చంద్రబాబు శిష్యులందరూ బీజేపీలో చేరి ఎన్నికల వరకు నటిస్తారని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మి మత కలహాలు సృష్టిద్దామని, గుడివాడ లాంటి ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ అయిపోయి పది రోజులు గడిచిందని, ఇప్పుడు వెళ్ళి ఆ పండుగను ఎలా చేసుకోవాలో సోము వీర్రాజు నేర్పుతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోవన్నారు. తెలుగుదేశం పార్టీ ట్రాప్లో సోము వీర్రాజు పడకుండా బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కేంద్రంలో పాలిస్తున్న పార్టీగా దేశమంతా ఒకే విధానాలు అమలయ్యేలా చూడాలన్నారు. గుడివాడలో ఒక విధంగా, గోవాలో ఇంకో విధంగా, విజయవాడలో, హైదరాబాద్ లో మరో విధంగా చేయొద్దని సూచించారు. సోము వీర్రాజు ఉద్యమాలే చేయాలనుకుంటే గోవా సంస్కృతి హైదరాబాద్ లోని ఫిలింసిటీలో ఉందన్నారు. క్యాబరే, అర్ధనగ్న నృత్యాలను ఆపాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE