Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు చెబుతున్న తప్పుడు మాటలు వింటున్న సోము వీర్రాజు

– కేసినో ఎలా ఉంటుందో గోవా వెళ్ళి చూడండి
– పూర్తిగా దుస్తులు వేసుకుంటే అర్ధనగ్నం అంటారా
– టీడీపీ ఎజెండాను అమలు చేసే పనిలో సోము
– జనసేనతో కలిసి పోటీ చేసినా రాని డిపాజిట్లు
– టీడీపీ ట్రాప్ నుండి సోము వీర్రాజు బయటపడాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 25: చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలను సోము వీర్రాజు వింటున్నాడని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తప్పుబట్టారు. మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. సోము వీర్రాజుతో పాటే తాను కూడా చిన్ననాటి నుండే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే ఏంటో చూపిస్తానని సోము వీర్రాజు చెబుతూనే ఉన్నాడన్నారు. ఆయనకు ఇంకో 50 లేక 100 ఏళ్ళు కావాలో అర్ధం కావడం లేదన్నారు. బీజేపీ అంటే ఏంటో మాకు చూపించాల్సిన అవసరం లేదని, చంద్రబాబుకు ముందు చూపించాలని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు సోము వీర్రాజు బీజేపీ అంటే ఏంటో ఎన్నికల తర్వాత చంద్రబాబుకు చూపిస్తానని చెప్పాడన్నారు. చంద్రబాబును వదిలేసి ఆయనతో రాజీపడి బీజేపీ పోటీ చేసిన రెండు చోట్ల డిపాజిట్లను కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకుందన్నారు.

సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత జనసేనతో కలిసినా కూడా రాలేదన్నారు. డిపాజిట్లు తెచ్చుకునే పనిలో సోము వీర్రాజు ఉండాలని, బీజేపీ అంటే ఏంటో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చూపించనక్కర్లేదని చెప్పారు. కేసినో ఎలా ఉంటుందో గోవా వెళ్ళి చూస్తే సోము వీర్రాజుకు తెలుస్తుందన్నారు. గోవాలో కేసినో చూడాలంటే సోము వీర్రాజుకు రెడ్ కార్పెట్ వేసి చూపిస్తారన్నారు. అక్కడ ఎటువంటి గేమ్స్ ఆడతారు, డ్యాన్స్లు ఎలా చేస్తారో చూడవచ్చన్నారు. ఇక్కడ పూర్తిగా దుస్తులు వేసుకుని నృత్యం చేస్తే అర్ధనగ్న ప్రదర్శనలుగా వీళ్ళకు కన్పిస్తున్నాయన్నారు. గుండాట ఆడుతుంటే దాన్ని కేసినోగా చిత్రీకరిస్తున్నారని, దిక్కుమాలిన టీడీపీ ట్రాప్లో బీజేపీ పడుతోందన్నారు. టీడీపీతో కలిసి పనిచేయడం వల్ల బీజేపీ సర్వనాశనం అయిపోయిందని సోము వీర్రాజు గతంలో చెప్పాడన్నారు.

సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత టీడీపీ నుండి వచ్చిన నాయకులతో కలిసి ఆ పార్టీ ఎజెండాను అమలు చేయడం వల్ల జనసేనతో కలిసి పోటీ చేసినా డిపాజిట్లు పోగొట్టుకుంటున్నారన్నారు. తెలుగుదేశం వల్ల నష్టపోయామని చెబుతూనే సిగ్గులేకుండా అదే పార్టీకి అద్దెకిచ్చి టీడీపీ బీ టీంగా పనిచేస్తున్నాడన్నారు. టీడీపీ ట్రాప్ నుండి బయటపడితేనే బీజేపీని, సోము వీర్రాజును రక్షించే పరిస్థితి ఉంటుందన్నారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. కర్నూలు, కడప వెళ్ళి ఇస్లామిక్ టెరరిస్ట్లకు సీఎం జగన్మోహనరెడ్డి ఆర్ధికసాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరిపోయిన దానిలో పెట్రోల్ పోయడం, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సహకరిస్తారని అన్నారు. సోము వీర్రాజు హావభావాలు అంతా బాగుంటాయని, బుద్ధి మార్చుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు.

LEAVE A RESPONSE