నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రతి వారం డివిజన్ లో పర్యటనలు చేస్తా 21వ డివిజన్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
రానున్న రోజులు అన్నీ ఆంధ్రప్రదశ్లోని ప్రజలకు మంచి రోజులేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. విదేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరయ్యారు. అనంతరం కృష్ణలంకకు చెందిన గజ్జవరపు ఏసుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సొంత నిధులు రూ.25 వేలతో కొనుగోలు చేసిన చెవిటి మిషన్ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ వారంలో ఒక రోజు నియోజకవర్గంలోని ఒక డివిజన్లో సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న సమస్యలను తెల్సుకుని వారం రోజుల పాటుగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి ఆ వారంలోనే పరిష్కారం అయ్యేలా కొత్త విధానాన్ని ప్రారంభించామని చెప్పారు. నియోజకవర్గంలోని సమస్య స్థాయిని బట్టి మున్సిపల్ కమీషనర్, మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయికి ఆ సమస్య తీవ్రతను తీసుకువెళ్ళి పరిష్కరించేలా చూస్తామని చెప్పారు.
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో పర్యటించి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి డివిజన్లోనూ ఇదే విధంగా చేస్తామని చెప్పారు. మన నియోజకవర్గంలో అమలు అవుతున్న ఈ విధానాన్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అమలు చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ఇచ్చారని చెప్పారు. ఆ విధానంలో భాగంగానే ఇప్పుడు కృష్ణలంక 21వ డివిజన్లో సమావేశం నిర్వహించామని చెప్పారు.
ఇక్కడ ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిధులు ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. విదేశాల నుంచి ఎంతో మంది మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారంతో పాటుగా ప్రజా సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలవుతాయని చెప్పారు. త్వరలో మంచి రోజులు రానున్నాయని, ప్రతి రోజూ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో వేములపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, కేశనం భావన్నారాయణ, వేజర్ల రంగారావు, పుప్పాల సుబ్బారావు, పైడి ఈశ్వరరావు, తాడివాయి సత్యనారాయణ, కోడూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.