Suryaa.co.in

Andhra Pradesh

సీఎంకు సిగ్గుందా?

-మోదీ నాయకత్వాన్ని బలపరచండి
-కేంద్ర నిధులతో స్టిక్కర్లు వేసుకోవడానికి సిగ్గులేదా?
-రాష్ట్రంలో పాలన అంతా కేంద్ర నిధులతోనే
– విజయనగరం చార్జిషీట్‌ సభలో బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు

బిజెపి ఆధ్వర్యంలో, స్థానిక నాయకులు మరిశర్ల రామారావు నాయుడు – పూడి జగదీష్ నాయకత్వంలో, ప్రజా చార్ట్ సీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది..ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై స్థానిక నాయకులు మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై, బెల్లం రైతుల సమస్యలపై, గ్రీన్ అంబాసిడర్స్ సమస్యలపై, మరికొన్ని ఇతర సమస్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజుకు వినతి పత్రాలు సమర్పించారు.

సీఎం జగన్‌కు సిగ్గులేదని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రం డబ్బులిస్తుంటే వాటికి తన స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర పాలన అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే సాగుతోందని, రాష్ట్ర ఖజానా నుంచి నయాపైసా కూడా ఇవ్వని దిక్కుమాలిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను, పార్టీ అధిష్టానానికి వివరించానని చెప్పారు. ఈ విషయంలో నాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని చెప్పారు.

విజయనగరం జిల్లా అధ్యక్షురాలు పావని మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చామన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని, దిశ చట్టం వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని విమర్శించారు.

బాడంగి మండలం బిజెపి నాయకుడు పూడి జగదీష్ ఆధ్వర్యంలో, 115 మందికి పైగా వైసిపి కార్యకర్తలు బిజెపిలో చేరారు.బాడంగి మండలం నుంచి మాజీ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కుమారుడు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు తమ్ముడు,వాసిరెడ్డి జగదీష్ (తాతాజీ )బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు ఏకరు పెట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

బిజెపి జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, స్థానిక నాయకులు మరిశర్ల రామారావు నాయుడు, పూడి జగదీష్, పెద్దింటి మనోజ్ కుమార్, మరి కొంతమంది కలిసి బొబ్బిలి ఇన్స్పెక్టర్ ఎం నాగేశ్వరరావుకు ప్రజల యొక్క సమస్యలను తెలియజేస్తూ, వినతిపత్రాన్ని అందించారు.

LEAVE A RESPONSE