Suryaa.co.in

Andhra Pradesh

జగన్ హయాంలో బీసీలకు అన్నింటా న్యాయం

– టీడీపీకి బీసీలు అంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే.
-బీసీలకు రాజ్యాధికారం దక్కుతున్న సమయంలో బాబు మళ్ళీ టక్కరి వేషాలు
– బీసీల్లో 139 కులాలు ఉన్నాయని టీడీపీ ఏనాడైనా గుర్తించిందా?
– బీసీ సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రెస్‌మీట్‌

అచ్చెన్నాయుడు మాటల్లోనే… బీసీల ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసిన ప్రబుద్ధుల్లో వీరందరూ ఉన్నారు. ఆ సందర్భంలోనే బీసీలను మీరు దగా చేసి, వంచించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి, ఆయన పార్టీని లాక్కుని, ఆయన మరణించినప్పుడు ప్రవర్తించిన తీరు… బీసీల మనోభావాలను దెబ్బతీశామని మీకు అప్పుడు తెలియదా?

బీసీలకు రాజ్యాధికారం అని అంటున్నారు… కనీసం ఈ రాష్ట్రంలో బీసీల్లో 139 కులాలు ఉన్నాయని, ఆ కులాలకు సంబంధించిన సామాజిక స్థితిగతులమీద ఏనాడు అయినా అధ్యయనం చేశారా?. కేవలం ఎన్నికల సమయంలో కులాల మధ్య విభజన చేసి, వాటి మధ్య చిచ్చుపెట్టి, ఐక్యతగా ఉన్న బీసీల్లో రాగద్వేషాలు పెంచి మీరు రాజకీయలబ్ధి పొందలేదా? మీకు బీసీలు అంటే ఇద్దరు ముగ్గురు నాయకులే. టీడీపీలో బీసీలు అంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే.

బీసీలంటే వాస్తవాన్ని ఈ సమాజానికి చూపించింది జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాల జీవన ప్రమాణాల మీద ఎన్నికలకు ముందే మా పార్టీ జంగా కృష్ణమూర్తిగారి ఆధ్వర్యంలో ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో వివిధ ప్రాంతాలకు చెందిన బీసీ వర్గీయులైన నాయకుల్ని భాగస్వామ్యుల్ని చేసి, బీసీల అభ్యున్నతికి, వారిని అభివృద్ధి పధంలో నిలపాలంటే ఏం చేయాలి, వారి వెనుకబాటుతనానికి ప్రధాన కారణాలు ఏంటి? అధ్యయనం చేయడం జరిగింది.

చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒకరిని చూసి నేర్చుకోవాల్సిందే. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వ్యవసాయం దండుగ అన్నారు. ఆ నోటీతోనే వ్యవసాయం పండుగ అనేలా నాగలి ఎత్తి నడిపించారు వైయస్సార్‌గారు. ఇవాళ జగన్‌గారు కూడా సమాజంలో బీసీలు కూడా అందరితో పాటు సమానమైన రాజ్యాధికారం పొందాలనేలా కృషి చేస్తుంటే.. ఇవాళ బీసీల జపం చేయాల్సిన అవసరం మీకు కలిగిందంటే అది జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ఘనతే.

బీసీలు టీడీపీని వదిలి వెళ్లిపోయినట్లు ఇప్పటికే మీకు అర్ధమైంది. 2019 ఎ‍న్నికల్లో మా పార్టీకి 151 సీట్లు వచ్చినప్పుడు మీరు గమనించలేదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు ఉనికిని కోల్పోయారు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా కుప్పకూలిపోయి మళ్లీ తన కుయుక్తులతో నాటకాన్ని ప్రారంభించారు.మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే.. కేవలం బీసీలను మోసగించాలని లక్ష్యమే తప్ప పేదవాడి జీవితంలో మంచి చేయాలని లక్ష్యం మీకు లేదు. మీ మోసాలకు 2019 ఎన్నికల్లో ప్రజలంతా తెలుసుకోబట్టే మీరు, మీ పార్టీ కుప్పకూలిపోయింది.

ఇవాళ బీసీలు చంద్రబాబు నాయుడు దగ్గరకు రారని తెలిసినా, మళ్లీ బీసీ నాయకుల్ని ప్రయోగిస్తున్నారు. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల జీవన స్థితిగతుల గురించి సరైన సమాచారం ఇచ్చారా? ఒకవేళ మీరు ఇస్తే ఆయన చేయలేదా? అనేది ఒకసారి ఆలోచించాలి.బీసీ కార్పొరేషన్‌లో చిన్న లోన్‌ కావాలంటే మీ చుట్టూ, అధికారుల చుట్టూ వందసార్లు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. వస్తుందో రాదో తెలియని రుణం కోసం.. మార్జినల్‌ మనీ కోసం అప్పు చేయాలి. ఆ చేసిన అప్పుకు వడ్డీతో సహా మీరిచ్చిన డబ్బు సరిపోనటువంటి పరిస్థితులు అధ్యయనం చేసినవారికే తెలుస్తాయి.

జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవన్నీ ఆలోచించారు కాబట్టే..పేదరికమనే రోగంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ ద్వారా ముఖ్యమంత్రి టూ కామన్‌ మేన్‌కు నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్న గొప్ప పరిపాలన సాగుతోంది. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబును ఇంకెవరు విశ్వసిస్తారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో బాబు ఆలోచించుకోవాలి.

ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలు రాజ్యాధికారం దిశగా నడుస్తున్నారు. రాష్ట్ర కార్పోరేషన్లు 201 ఉంటే అందులో 111మంది బీసీలు ఉంటే, 50శాతం మంది మహిళలు ఉన్నారు. అలాగే డైరెక్టర్లు సమారుగా 1156మంది ఉంటే, 862మంది బీసీలు ఉన్నారు. బీసీ కార్పోరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్లు నేమ్‌ప్లేట్స్‌ వేసుకుని వాహనాల్లో తిరుగుతూ ఉంటే మీకు కంగారు పుడుతుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యులైన బీసీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.

జిల్లా పరిషత్‌లో ఎక్స్‌ అఫిషియో మెంబర్స్‌గా ఉండటం, ప్రొటోకాల్స్‌ అనుభవిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా బీసీల దండు కదులుతోంది. జగన్‌గారి పాలన పక్షాన నడుస్తోంది. బీసీల్లో మీరు ఉనికి కోల్పోయారనే భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.ఇవే కాకుండా మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో 32మంది ఉంటే… వారిలో 18మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఉన్నారు. రాజ్యసభకు నాలుగు స్థానాలు ఖాళీలు వస్తే 50శాతం బీసీలను ఎంపిక చేశారు.

మీ హయాంలో ఎప్పుడైనా ఇలా చేశారా చంద్రబాబు? మీరు కేవలం పదవులు ఒకరికి ఇచ్చి, పని మరొకరితో చేయించుకునేవాళ్లు, పనిచేసేవాడిని పనివాడిగానే చూడాలనే మీ సంస్కృతికి, పని వాడికి పని కల్పించే ఆ వర్గాలను సమాజంలో గొప్పగా చూపించాలనే తపన మా నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది.

మీడియా ద్వారా బీసీ సంఘాలన్నింటికీ, వర్గీయులందరికీ ఒకటే విజ్ఞప్తి. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పాలనలో లక్షా 20వేల కోట్లు నేరుగా డీబీటీ, ద్వారా పంచితే అందులో రూ.62వేల కోట్లు బీసీలకు చేరింది. ఇది బీసీల రాజ్యం కాదా అని అడుగుతున్నాం?
బీసీలకు రాజ్యాధికారం దక్కుతున్న తరుణంలో మళ్లీ మన దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు మారో వేషంలో ప్రయాణం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఆయన మళ్లీ ప్రయోగిస్తుంది కూడా బలైపోయిన మనవాళ్లనే.

గతంలో మత్స్యకారులు చిన్న సమస్యను చంద్రబాబుకు విన్నవించుకునేందుకు వెళ్తే… వారిని తోలు తీస్తామని చెప్పారు. నాయి బ్రాహ్మణులను సెక్రటేరియట్‌కు ఎవరు రానిచ్చారంటూ మాట్లాడారు. అంత హీనంగా చూసే పరిస్థితిని, తోకలు కత్తిరిస్తాను అన్న మాటలను మనం గుర్తుచేసుకున్నట్లు అయితే చంద్రబాబు మనసులో ఏముందో… బయట ఏం మాట్లాడతారో తేలిపోయింది. పదవి కోల్పోయాక చంద్రబాబుకు ప్రజలు గుర్తొచ్చారు? పదవిలో ఉండగా జనాల గురించి కానీ, బీసీల గురించి కూడా ఆలోచించని ఆయన.. ఇవాళ బీసీల జీవన ప్రమాణాలపై అధ్యయన కమిటీని వేస్తామని చెప్పడం చూస్తే… గతంలో మీరు బీసీలకు చేసిందేమీ లేదని స్పష్టం అయింది.

పేదరికం అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు వర్గాల ప్రజలు సమాజంలో అందరికీ దూరంగా ఉన్నారంటే, వారికి సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలంటే వారికి కావాల్సింది ప్రధానమైనది విద్య అని, పేదరికం మీద పేదవాళ్లు గెలవాలంటే వారి చేతిలో ఆయుధమే విద్య అని నాటి పూలే, బీఆర్‌ అంబేడ్కర్‌ ఇచ్చిన సందేశాలను తూ.చ తప్పకుండా జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమలు చేస్తున్నారు. అందులో భాగమే నాడు-నేడు కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా వారి భవిష్యత్‌ బాగుంటుందే ఉద్దేశంతో వాటిని అమలు చేస్తున్నారు. పిల్లలు ఆకలితో ఉంటే విద్య సరిగా ఎక్కదేమో అని గోరుముద్ద దగ్గర నుంచి పాఠ్యపుస్తకాలు నుంచి విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరకూ అందిస్తున్నారు.

చంద్రబాబు బీసీలను ఎలా అణగదొక్కారో అనేదానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టారు. దాని ద్వారా గీత కార్మికుడు, కమ్మరి, నేత కార్మికుడు కొడుకు లబ్ధి పొందారు. తెలివి ఉండి, డబ్బు లేక చదువుకు దూరం అయినవాళ్లంతా ఈ పథకం ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వాళ్లు సమాజంలో అందరితో పాటు సమానంగా జీవిస్తున్నారు.

అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.35వేలు శ్లాబ్‌ పెట్టి, కాలేజీలను ఫీజులు పెంచుకోమని మీ నారాయణ, చైతన్య ద్వారా విద్యను వ్యాపారం చేసేస్తే… తల్లిదండ్రులు ఆ ఫీజులు కట్టలేక అప్పులపాలయ్యారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే పూర్తిగా ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి సక్రమంగా చదువుకుని బీసీల అనే భావన నుంచి సమాజంలో సమానమే అనేలా ఎదుగుతుంటే చంద్రబాబు మళ్లీ కొత్త నాటకానికి తెరతీసి, గారడీ చేస్తున్నాడు. బీసీలు అంతా సంక్రాంతి పండుగ చేసుకుంటున్న తరుణంలో ఓ టక్కరి అచ్చెన్నాయుడుతో పిచ్చి మాటలు మాట్లాడిపిస్తున్నారు. వాస్తవాలను తెరమరుగు చేసి భ్రమలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు.

బీసీ ల సంక్షేమం పై ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు పాలనలో బీసీలకు జరిగింది ఏమిటి? నాటి చంద్రబాబు పాలనలో బీసీలకు జరిగేందేంటనే దానిపై డిబేట్‌కు మేము రెడీ. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బీసీలు రాజ్యాధికారంలో భాగస్వామ్యలుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కనిపిస్తున్నారు. దాన్ని చూసి వణికిపోయి చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి.

జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పుడో చెప్పారు… బీసీలు అంటే వెనుకబడిన కులాల కాదు, వెన్నెముక కులాలు అని. భారతదేశ సంస్కృతిని సంరక్షించేటువంటి గొప్ప సంపద బీసీలని, మనిషి అవసరాలను తీర్చేవాడే బలహీనవర్గీయుడు అని చెప్పారు. మీరు బీసీలను ఎప్పుడూ వెనకే పెట్టారు. అదే జగన్‌ గారు బీసీలను ముందువరుసలో నడిపిస్తున్నారు. బీసీల అభివృద్ధి, అభ్యున్నతికి కృషి చేసే విషయంలో చంద్రబాబు ఎన్నడూ జగన్‌ మోహన్‌ రెడ్డికి సాటిరాడని స్పష్టం చెబుతున్నాం.

LEAVE A RESPONSE