-సంపద సృష్టితోనే ఉద్యోగ విప్లవం
– జగన్ తీరుతో పెట్టుబడులు వెనక్కు
– ఉద్యోగాల కోసం పోరాడే యువతపై రేప్ కేసులు పెడుతున్నారు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులు, నిరుద్యోగుల, మహిళలు, యువత ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులతో గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు.. జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు చంద్రబాబు దృష్టి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశా, ప్రతిపక్ష నేతగా ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డిలా ఎవరూ బాధ్యతారిహిత్యంగా వ్యహరించలేదు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరగుతున్నాయి. నేను మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకేసారి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశాను. ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహించాము. టీడీపీ హాయంలో నిరుద్యోగులను అన్ని విధాలా ఆదుకున్నాం. రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రములు రావాలి. అందుకే ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. దీంతో వేలాది ఉద్యోగాలు వచ్చాయి. విదేశాల్లో మన యువత బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. జగన్ తీరుతో రాష్ట్రంలో ప్రజలకు పనుల్లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ బూటకం. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం అసత్యాలు చెప్తోంది. హైదరాబాద్, చెన్నై, ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు.
అన్ని రంగాల్లో అక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిని నిలపేయడంతో పరిశ్రమలు రాలేదు. దీంతో వేలాది ఉద్యోగాలు పోయాయి. 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందం చేసుకున్నాం. 30 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల అన్నీ వెనక్కు వెళ్లాయి. పెట్టుబడిదారులు రావాలంటే భయపడుతున్నారు. ఈ ప్రభావం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనంతపురం కియా వంటి పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చాం. జగన్ కు బాధ్యత లేదు. ఉద్యమాలు చేసేవాళ్లను అరెస్టు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ రేటు 3.6 నుండి 16 శాతానికి పెరిగింది. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న యువతపై రేప్ కేసులు పెడుతున్నారు. బెయిల్ రాకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో యువత ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్లకు నెలకు జీతం రావడం లేదు. సంపద సృష్టి ద్వారా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. నిరుద్యోగ యువతకు టీడీపీ ఎప్పుడూ అండగా వుంటుంది. నిరుద్యోగుల సమస్యపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రభుత్వంపై యువత బయట పోరాటం చేయాలి..మేము చట్టసభల్లో పోరాడతాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, కిలారు నాగశ్రవణ్, అశోక్ యాదవ్, ఆర్.టి. మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
జాబ్ కేలండర్ తో యువతను జగన్ మోసం చేశారు : లెనిన్ బాబు, ఏఐవైఎఫ్
జాబ్ కేలండర్ తో నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారు. ఎస్సై, డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల్లో యువతకు తీవ్రమైన అన్యాయం చేశారు. 2.35లక్షల ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తామంటేనే యువత జగన్ కు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగాలు రాలేదని యువత మనస్తాపం చెంది 300 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది : సిద్విక్, నిరుద్యోగి
నాలుగేళ్ల నుండి గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నా. అధికారంలోకి రాగానే ఉద్యోగ ఖాళీలన్నింటినీ జగన్ భర్తీ చేస్తానని మాట ఇచ్చారు. గ్రూప్ 1, 2 కు 36 ఉద్యోగాలే ఇచ్చారు. జగన్ విడుదల చేసింది జాబ్ కేలండర్ కాదు..నీచమైన కేలండర్. 30 లక్షల మంది నిరుద్యోగులను జగన్ మోసం చేశారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది.
మూడేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు : సూర్యారావు, డివైఎఫ్ఐ
జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదు. ప్రైమరీ స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల టీచర్ పోస్టులు తగ్గే అవకాశం వుంటుంది. పోలీస్ ఉద్యోగాలు ఏటా 6,500 ఇస్తామని ముఖ్యమంత్రి, హోంమంత్రి చెప్పారు. 450 పోస్టుల మాత్రమే ప్రకటించారు. తినీతినక కోచింగ్ తీసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడంలేదు.
వాలంటీర్లను కూడా ఉద్యోగులగా చూపిస్తున్నారు : మహేశ్, ఏపీఎస్ జేఏసీ.
వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులని, ఉద్యోగులు కాదని చెప్పి ఇప్పుడ వాళ్లను కూడా ఉద్యోగులు జాబితాలో చూపించి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారిని కూడా కొత్తగా నియమించిన ఉద్యోగులుగా చూపిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తిలో ఉంది. దీక్ష చేయాలన్నా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. నిరుద్యోగుల తరపును అసెంబ్లీలో వాయిదా తీర్మాణం పెట్టాలి.
జాబ్ కేలండర్ పై జగన్ స్పందించడం లేదు: రవిచంద్ర, పీ.డీ.ఎస్.యూ
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ పై జగన్ అసలు స్పందించడం లేదు. ఆందోళనలకు పిలుపినిస్తే హౌస్ అరెస్టులు, రెండు రోజుల ముందే అరెస్టు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆందోళలను చేశాక అరెస్టు చేసి వదలిపెట్టే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం యువతను భయపెడుతోంది. ప్రభుత్వం ఈ ఐదేళ్లలో 13 వేల పోస్టులు మాత్రమే ఇస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా చెప్పారు. బీసీ, ఈబీసీలకు చెందిన వారి వయో పరిమితి పెంచకపోవడం వల్ల నష్టపోతున్నారు.