– పబ్లిక్ పల్స్ పట్టిన ఎన్డీయే
– అన్ని సర్వేలూ కూటమి వైపే
– ఎన్డీఏ కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు?
– 50-60 స్థానాలు వైసీపీకి?
– ఎన్డీఏ కూటమికి 18-20 ఎంపీ సీట్లు?
– వైసీపీకి 5 నుంచి 8 సీట్లు?
– బీజేపీ పోటీ చేసే స్ధానాల్లో ఒకటి మినహా అన్నీ వైసీపీవేనా?
– మారిన మహిళా ఓటర్ల మనోగతం
– వైసీపీ నుంచి కూటమి వైపు
– ఎన్డీయే వైపు వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు
– వైసీపీ నుంచి పక్కకు జరుగుతున్న రెడ్లు
– ఎన్డీయే వైపు బ్రాహ్మణ, వైశ్య, కమ్మ,కాపుల చూపు
– పట్టణ-గ్రామీణ మహిళా ఓటర్ల గందరగోళం
– పథకాలపై మొగ్గుచూపుతూనే ధరలపై పెదవి విరుపు
– మాలల్లో 60 శాతం వైసీపీ వైపే
– మాదిగల్లో 80 శాతం కూటమికి
– బీసీలలో 60 శాతం కూటమి వైపే
– టీడీపీ,జనసేన వైపు 70 శాతం ముస్లింలు
– క్రైస్తవ, దళిత క్రైస్తవుల్లో 60 శాతం వైసీపీ వైపే
– క్రైస్తవ, దళిత క్రైస్తవ, ముస్లిం ఓట్లను చీల్చనున్న కాంగ్రెస్
– కాంగ్రెస్‌కు 5 నుంచి 10 శాతం పెరగనున్న ఓటు బ్యాంకు
– పట్టణాల్లో వైసీపీపై 80 శాతం వ్యతిరేకత
– పల్లెల్లో సర్కారుపై 50 శాతం అసంతృప్తి
– ఏపీలో కూటమిదే సర్కారని తేల్చిన సర్వే సంస్థలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో గెలుపెవరిది? ఇదీ.. ఇకనుంచి మొదలయ్యే బెట్టింగు. వైసీపీ గెలుస్తుందా? ఎన్డీయే కూటమి గెలుస్తుందా? ఎన్డీయేక యితే వందకు ఎంత? వైసీపీకయితే ఎంత? ఇలాంటి బెట్టింగురాయుళ్లు ఇక మీదట కౌంటింగ్ వరకూ మీకు దర్శనమిస్తుంటారు. అయితే.. పలు ప్రతిష్టాత్మక జాతీయ సర్వే సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ, ఏపీలో ఎన్డీయే కూటమి వైపే మొగ్గుచూపుతున్నాయి. అందులో కొన్ని సంస్థల సర్వే ఫలితాలు.. కూటమి వైపు ఏకపక్షంగా ఉండగా, మరికొన్ని వైసీపీకి గౌరవప్రదమైన స్థానాలివ్వడం విశేషం. ఒకటి, రెండు వర్గాలు మినహా, మిగిలిన అన్ని వర్గాలూ వైసీపీ ప్రభుత్వ పాలనపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నాయని సర్వేలు తేల్చాయి.
ముఖ్యంగా మహిళలు… ఎక్కువమంది వైసీపీ వైపు మొగ్గుచూపిస్తున్నట్లు అనిపించినప్పటికీ, పెరిగిన ధరలపై అంతకంటే ఎక్కువ అసంతృప్తితో ఉన్నట్లు కనిపించడం విశేషం. గత ఐదేళ్ల క్రితం నాటి రేట్లతో పోలిస్తే, ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు 100 శాతం పెరిగాయన్న అసంతృప్తి, గ్రామీణ-పట్టణ మహిళల్లో కనిపించింది. మొత్తంగా.. ఏపీలో చంద్రబాబునాయుడు సారథ్యంలో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందన్నది 11 లబ్దప్రతిష్ట సర్వే సంస్థల సారాంశం.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అమరావతి గద్దె ఎన్డీయే కూటమికే దక్కబోతోందని జాతీయ సర్వే-మీడియా సంస్థలు ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ ముక్కు మొహం లేనివి కాదు. లెటర్‌హెడ్ కంపెనీలుకానే కావు. ఆఫీసులలో కూర్చుని ఏవో కాకిలెక్కలు వేసి, తర్వాత కలర్ ఇంకులతో టేబుళ్లు, గ్రాఫిక్కులు వేసి బిల్డప్పులిచ్చే అమాంబాపతు కంపెనీలు అసలే కావు. అన్నీ లబ్ధప్రతిష్ఠ కంపెనీలే. ఇప్పటికి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను అవి ముందస్తుగా తేల్చినవే.
ఇప్పుడు చాలా లెటర్ హెడ్ సర్వే కంపెనీలు.. ఒక కంపెనీతో డీల్ చెడిపోవడంతో అధికార పార్టీ భుజానెక్కిన కంపెనీలన్నీ, వైసీపీ విజయం సాధిస్తాయని చెబుతున్నాయి. అయితే వాటికి ఉన్న యంత్రాంగం, విశ్లేషణకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం-పరికరాలు బహు త క్కువ. ఇక ఇంట్లో కూర్చుని, విశ్లేషకుల అవతారమెత్తి, అధికార పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పే ‘ఏకలింగ జనరలిస్టులు’ చెప్పే జోస్యాలకు కొదవలేదు.
ఇక ఏపీ ఎన్డీయేదేనని ఇప్పటికే 11 జాతీయ సర్వే సంస్థలతోపాటు, జాతీయ మీడియా కూడా కుండబద్దలు కొట్టాయి. ప్రతిష్టాత్మక ఇండియాటుడే ఎన్డీయే కూటమికి 17, వైసీపీకి 8 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది. అదే వరసలో.. సీఎన్‌ఎన్ న్యూస్ 18-7,t ఇండియాటీవీ 17-8, ఏబీపీ న్యూస్ 20-5, న్యూస్ ఎక్స్ 18-7, జన్మత్‌పోల్స్ 17-8, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ 23-2, పుపీల్స్‌రైట్ 23-2, పయనీర్ పోల్ 18-7, ఇండియూ న్యూస్ 18-7, జీ న్యూస్ 17-8 వస్తాయని వెల్లడించాయి. ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి నికరంగా 18, వైసీపీకి 8 సీట్లు వస్తాయని పేర్కొనడం విశేషం. దీన్నిబట్టి ఎన్డీఏ కూటమికి 115 నుంచి 125 స్థానాలు, 50-60 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశాలున్నట్లు స్పష్టమవుతుంది.
ఇక ఇటీవల శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వేలో.. వైసీపీ 41.5 శాతం, కూటమి 53.5 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 21, కూటమి 136 స్థానాలు సాధిస్తాయని, 18 సీట్లలో పోటాపోటీ ఉంటుందని వెల్లడించింది. పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి 2, కూటమికి 20 స్థానాలు వస్తాయని, 3 స్థానాల్లో పోటా పోటీ ఉంటుందని వివరించింది.
కాగా బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ స్థానాల్లో 5 సీట్లు.. 10 అసెంబ్లీ స్థానాల్లో 4-5 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. ఈ స్థానాల్లో టీడీపీ-బీజేపీ ఓట్ల బదిలీ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్ధులకు జనంలో పెద్దగా పట్టులేకపోవడం, వైసీపీకి క లసివచ్చే పరిణామం అంటున్నారు. విష్ణుకుమార్‌రాజు, సుజనాచౌదరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, బొజ్జా రోషన్న మినహా మిగిలిన స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవచ్చంటున్నారు.
ఎంపీ స్థానాల్లో బీజేపీ రాజమండ్రి సీటు బలంగా ఉన్నప్పటికీ, అక్కడ అనపర్తి సీటు టీడీపీకి కేటాయించకపోతే, అది కూడా గెలవడం కష్టమంటున్నారు. ఇక పోటీ ఉన్న అనకాపల్లిలో బీసీ వెలమల సంఖ్య ఎక్కువగా ఉండటం, వైసీపీ అభ్యర్ధి కూడా అదే కులానికి చెందిన వాడవడంతో, అక్కడ ఫలితం వైసీపీవైపే మొగ్గు చూపించవచ్చని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్ధి సీఎం రమేష్ ఓసీ వెలమ-వైసీపీ అభ్యర్ధి ముత్యాలనాయుడు బీసీ వెలమ అన్న విషయం తెలిసిందే.
జనసేనకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో, 12-15 సీట్లు వైసీపీ విజయం సాధించవచ్చు. అలాగే కాకినాడ సీటు వైసీపీ కైవసం చేసుకోవచ్చంటున్నారు. ఇక్కడ టీడీపీ-జనసేన ఓట్లు పూర్తి స్థాయిలో బదిలీ అవుతున్నప్పటికీ, జనసేన అభ్యర్ధులు బలహీనులు కావడం వైసీపీకి ప్లస్‌పాయింటని చెబుతున్నారు. ఏతావాతా బీజేపీ-జనసేనకు కేటాయించిన 31 సీట్లలో.. వైసీపీ 15 నుంచి 20 సీట్లు గెలవచ్చంటున్నారు.
ఇక ఎన్డీయే కూటమికి బ్రాహ్మణ,వైశ్య, కమ్మ, క్షత్రియ వర్గాల్లో 90 శాతం మద్దతునిస్తున్నారు. ఈ ప్రభావం పార్లమెంటు ఫలితంపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాపుల్లో 60-70 శాతం వరకూ కూటమికి మద్దతుగా ఉన్నారు. రెడ్లలో ప్రాంతానికో రకంగా మద్దతు కనిపిస్తోంది. సీమలో 60 శాతం రెడ్లు వైసీపీకి మద్దతునిస్తుండగా.. నెల్లూరు నుంచి పల్నాడు జిల్లా మాచర్ల వరకూ ఉన్న నెల్లూరు, ప్రకాశం, గుంటూరుజిల్లాల్లో 70 శాతం రెడ్లు టీడీపీ, 30 శాతం వైసీపీకి మద్దతునిస్తున్నట్లు కనిపిస్తోంది. వాలంటీరు వ్యవస్థతో రెడ్డివర్గం పలుకుబడి పలచబడిందన్న అసంతృప్తే దానికి కారణమంటున్నారు.
ఎస్సీలలో మాలవర్గం 60 శాతం వైసీపీ వైపు ఉండగా, మాదిగలలో 80 శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. క్రైస్తవ-దళిత క్రైస్తవుల్లో 60 శాతం వైసీపీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అందులో ఎంత శాతం ఓట్లు చీలుస్తుందో చూడాలి. ఈసారి కాంగ్రెస్ 5 నుంచి 10 శాతం వరకూ ఓట్ల శాతం పెంచుకోవచ్చంటున్నారు. బీసీలలో 60-70 శాతం కూటమిని సమర్ధిస్తుండగా, ముస్లింలు బీజేపీ పోటీ చేసే స్థానాల్లో ఒకలా, టీడీపీ-జనసేన పోటీ చేసే స్థానాల్లో మరో వైఖరి ప్రదర్శిస్తున్నారు.
టీడీపీ-జనసేన పోటీ చేసే స్థానాల్లో 70 శాతం మంది ముస్లింలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతుండగా, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ముస్లిం అభ్యర్ధులను నిలబెడితే, ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
కాగా పట్టణాల్లో వైసీపీపై 80 శాతం వ్యతిరేకత కనిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ అసంతృప్తి 50 శాతం వరకూ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా మహిళలు తొలిరోజుల్లో వైసీపీ వైపేమొగ్గు చూపారు. దానికి కారణం సంక్షేమ పథకాలు, నేరుగా వారి అకౌంట్లలో జమకావడమే. అయితే విపక్షాలు ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరిట వెయ్యి రూపాయలిచ్చి, పదివేల రూపాయలు దోచుకుంటోందంటూ చేసిన ప్రచారం, మహిళలపై బాగాపనిచేసింది. దానికితోడు గత ఐదేళ్ల క్రితం నాటి నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు వందశాతం పెరిగాయి.
విద్యుత్ బిల్లులు విపరీతంగా రావడం, చెత్తపన్ను వంటివన్నీ నేరుగా మహిళలపై ప్రభావితం చేసేవే. ఆ కారణంతో మహిళల్లో కొంతకాలం వరకూ వైసీపీపై ఉన్న సానుకూలత, ఇప్పుడు వ్యతిరేకంగా మారింది. అయినప్పటికీ 30-35 శాతం మహిళలు వైసీపీ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక నిరుద్యోగ యువత 60-70 శాతం, కూటమి వైపు చూస్తోంది.కూటమివస్తే పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వస్తాయని విశ్వసిస్తోంది. కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సి వస్తోందన్న అసంతృప్తి వారిలో బాగా ఉంది. ఈ అసంతృప్తి ఉత్తరాంధ్ర-ఉభయగోదావరి-గుంటూరు-కృష్ణాజిల్లాలో బాగా ఎక్కువగా కనిపిస్తోంది.