– ఇచ్చిన నిధులన్నీ పక్కదారి
– జనసేనతో కలసి పోటీ చేస్తాం
– పొత్తులు పార్టీ నిర్ణయిస్తుంది
– ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పురందీశ్వరి
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చలవేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారిపట్టిస్తూ, తన స్టిక్కర్లు వేసుకుంటోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రోడ్లకు నయాపైసా ఖర్చు పెట్టలేదని, అవి కూడా
కేంద్రం ఇచ్చినవేనని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ జనసేన తమకు మిత్రపక్షమని, వచ్చే ఎన్నికల్లో కలసి వెళతామన్నారు. పొత్తులపై పార్టీ పెద్దలు చూసుకుంటారనని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆమె జగన్ సర్కారుపై విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణాలకు లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు 12 వేల రూపాయలు ఇస్తానన్న జగన్ హామీని రైతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. విశాఖలో ఎంపి కుటుంబానికే రక్షణ లేదని విమర్శించారు, పోలవరం నిర్మాణ జాప్యంలో కేంద్రం తప్పు లేదన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక, నాసిరకం మద్యం భూ కబ్జాలు, సెటిల్మెంట్ల రాజ్యం నడుస్తోందని పురందీశ్వరి ఆరోపించారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ర్టానికి మంచిభాష మాట్లాడే అధ్యక్షురాలు దొరికిందని అభినందించారు. త్వరలో సౌత్ గేట్లు పగలకొట్టబోతున్నామని వ్యాఖ్యానించారు. కో ఇన్చార్జి సునీల్ దియోధర్, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపి సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.