Suryaa.co.in

Telangana

కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులంతా నాస్తికులే

– మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖుడిని తెలంగాణలో అడుగు పెట్టనీయం
– వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణ ను నిర్మిద్దాం
– వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లోని మంత్రులంతా నాస్తికులే. స్వార్థం కోసం కేసీఆర్ యాగాలు చేస్తడు. ఆయన తనయుడు మాత్రం దుర్గాదేవి, సీతాదేవి అమ్మవార్లను, శ్రీరామచంద్రుడిని అవమానపరుస్తున్న మూర్ఖుడు మునావర్ ఫారూఖీ వంటి వారిని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నడు. దేశవ్యాప్తంగా ఆ మూర్ఖుడి కార్యక్రమాలను నిషేధిస్తే… సీఎం తనయుడు మాత్రం అతడిని ఆహ్వానిస్తూ సభలు పెట్టాలని చెప్పడం సిగ్గుచేటు. ఫారూఖీ వంటి మూర్ఖుడికి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని అడ్డుకుని తీరాలి.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘సుపరిపాలన దినోత్సవం’ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.మనోహర్ రెడ్డి, సీనియర్ నేత పేరాల శేఖర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సహా నేతలంతా వాజ్ పేయి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి జీవిత చరిత్రపై బీజేవైఎం రూపొందించిన డాక్యుమెంటరీ(ఏవీ)ని సెమినార్ లో నేతలంతా తిలకించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ…..

‘‘ దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నియంత, కుటుంబ, అరాచక పాలనతో దేశాన్ని పట్టి పీడించారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలకు ‘సుపరిపాలన’ అంటే ఏమిటో చూపించిన మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి. పార్టీ జెండాను నమ్ముకుని 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి వాజ్ పేయి. డబ్బుల్లేకపోయినా కార్యకర్తలను, పార్టీ సిద్ధాంతాలను మాత్రమే నమ్ముకుని 50 ఏళ్లు ఎంపీగా, 5 సార్లు జాతీయ అధ్యక్షులుగా, 3 సార్లు ప్రధానిగా కొనసాగి దేశానికి సుపరిపాలన అందించిన మహా నాయకుడు. నరేంద్రమోదీ సైతం వాజ్ పేయి బాటలోనే నడుస్తూ పార్టీ సిద్దాంతాలు, కార్యకర్తలను నమ్ముకుని పనిచేస్తూ రెండుసార్లు ప్రధాని అయ్యి దేశాన్ని అభివ్రుద్ధి పథంలో నడిపిస్తున్నారు. నేటి తరం నాయకులు, కార్యకర్తలు వీరిని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’’అని పేర్కొన్నారు.

‘‘అద్వానీ, వాజ్ పేయి అత్యంత స్నేహపూర్వక సంబంధాలు అందరికీ ఆదర్శం. గులాబీ చెట్టుకు పూలు-ముళ్ల మాదిరిగా వాజ్ పేయి-అద్వానీ స్నేహ బంధాలుండేవి. పూలు సుగంధాన్ని వెదజల్లితే…ఆ పూలకు రక్షణ కవచం ముల్లు. ఈ రెండింటి తల్లి ‘చెట్టు వేరు’ మాదిరిగానే అద్వానీ-వాజ్ పేయిది ఎవరూ విడదయలేని బంధం.’’అని తెలిపారు.

‘‘అణు పరీక్షలు నిర్వహించి భారత్ సత్తా చాటిన నేత వాజ్ పేయి. కార్గిల్ యుద్దంలో విజయం సాధించి పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టారు. భారత్ తో విదేశీ సంబంధాలను మెరుగు పర్చిన నాయకుడు వాజ్ పేయి.దుష్ట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం బీజేపీపై అనేక విమర్శలు చేసినప్పటికీ… నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటామని ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు నెరిపిన నాయకుడు వాజ్ పేయి. ఐక్య రాజ్యసమితిలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రసంగించిన గొప్ప నేత వాజ్ పేయి’’అని స్మరించుకున్నారు.

‘‘టెలిఫోన్ వ్యవస్థను పేద వాడి వరకు చేర్చి అతి తక్కువ ధరకే సెల్ ఫోన్ సెవలు అందించిన మహా నాయకుడు వాజ్ పేయి. ప్రధాని అవాస్ యోజన ఇండ్ల నిర్మాణానికి ఆద్యుడు వాజ్ పేయి. ఆయన స్పూర్తితోనే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శక్తవంతమైన భారత్ నిర్మాణమవుతోంది’’అని తెలిపారు.
‘‘ఒకప్పుడు విదేశీ ప్రతినిధులకు తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. కానీ నేడు విదేశీ ప్రతినిధులకు భగవద్గీత, శ్రీరాముడి ప్రతిమలను అందిస్తూ కొత్త ఒరవడిని స్రుష్టించిన నేత నరేంద్ర మోదీ’’అని పేర్కొన్నారు.

‘‘దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడ్ని అవమానించిన మూర్ఖుడు మునావర్ ఫారూఖీని సీఎం తనయుడు రాష్ట్రానికి ఆహ్వానించి సభలు పెట్టాలని చెప్పడం సిగ్గుచేటు. కేసీఆర్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా నాస్తికులే. కేసీఆర్ తన స్వార్ధం కోసం యాగాలు చేస్తడు. రాష్ట్రాన్ని ఏలుతూ భయంకరమైన హిందువుగా చెప్పుకునే కేసీఆర్ తొలుత నాస్తికుడైన కొడుకు ను కట్టడి చేయాలి’’అని సూచించారు.

‘‘ మునావర్ ఫారూఖీ వంటి మూర్ఖులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదు. యువ మోర్చా నేతలు అలాంటి మూర్ఖుడు తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలి. వాజ్ పేయి స్పూర్తితో శక్తివంతమైన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపైనా ఉంది’’అని పిలుపునిచ్చారు.
అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ… ‘‘వాజ్ పేయి జయంతిని పండుగలా నిర్వహించుకుంటూ వారి జ్ఝాపకాలను నెమరవేసుకోవడం ఆనందంగా ఉంది. నేటి తరానికి, భావి తరాలకు వాజ్ పేయి చరిత్రను వివరించాల్సిన అవసరం ఉంది. వాజ్ పేయి చాలా అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు’’ అని కొనియాడారు.

‘‘వాజ్ పేయికి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వ్యక్తిగతంగా సేవ చేసే అవకాశం నాకు దక్కింది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రోక్రాన్ అణు పరీక్షలు, పొదుపు సంఘాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం, ఎవరూ ఊహించని విధంగా జాతీయ రహదారుల నిర్మాణం వంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహించారు. కార్గిల్ యుద్దంలో వాజ్ పేయి పోషించిన పాత్ర మరువలేనివి. వైరుధ్యమున్న 24 పార్టీలతో కలిసి అద్భుత పాలన అందించిన మహానేత వాజ్ పేయి. మహోన్నత పరిపాలనాదక్షుడు’’అని పేర్కొన్నారు.

‘‘వాజ్ పేయి ఉపన్యాసం కోసం ఇతర పార్టీల నేతలు కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఉదాహరణలున్నాయి. మంచి కవి. అలాంటి మహానేత మనకు స్పూర్తిదాతగా ఉండటం మనం అద్రుష్టవంతులం. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా సుపరిపాలన అందించిన ఘనత వాజ్ పేయి ప్రభుత్వానిదే’’అని తెలిపారు.

‘‘వాజ్ పేయి ఆశయ సాధన కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. వాజ్ పేయి ప్రారంభించిన కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నవ శకానికి నాంది పలుకుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం. వాజ్ పేయి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన సిద్దాంతాలను మనసా వాచా నమ్ముతూ పేదలకు సేవ చేయడమే వాజ్ పేయికి అందించే ఘన నివాళి’’అని వివరించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాట్లాడుతూ…‘‘వాజ్ పేయి ఆదర్శాలను నమ్మి పార్టీలో చేరాను. వాజ్ పేయి, అద్వానీ నాటిన బీజేపీ అనే విత్తనం నేడు మహా వ్రుక్షమై అద్భుతమైన ఫలాలను అందిస్తోంది. ‘వా’ అంటే వాస్తవాల అభివ్రుద్ధి, ’జ’ అంటే జన సంక్షేమ, ‘పే’ పేదల అభ్యున్నతి, ‘యి’ అంటే యిరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు’’అని అభివర్ణించారు.

‘‘నరేంద్ర మోదీ ప్రభుత్వం వాజ్ పేయి అడుగు జాడల్లో నడుస్తూ అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తోంది. బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనపై అవిశ్రాంతంగా పోరాడుతున్నాం. 2023లో బీజేపీ అధికారంలో వచ్చేందుకు క్రుషి చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, మోసాల ప్రభుత్వం. కేసీఆర్ పాలన కనుమరుగై పోవాలి. ప్రజలు ఆ పాలనను పాతాళంలోకి తొక్కాలి. బీజేపీ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పడాలి’’అని పేర్కొన్నారు.

తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘బీజేపీది సుశ్సాసన పాలన. కేసీఆర్ ది దుశ్సాసన పాలన. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అందుకు భిన్నంగా కుటుంబ –అవినీతి- నియంత పాలన కొనసాగిస్తున్నారు. బంగారు తెలంగాణ బ్యాచ్ తో అరాచక పాలన చేస్తూ దోచుకుంటున్న కేసీఆర్. జనం టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయారు.

రాహుల్ గాంధీ వంటి సారథ్యంలో మతి స్థిమితం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ ను జనం అసహ్యించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజా తెలంగాణ రావాలంటే…. అమరుల ఆశయాలు సాధించాలంటే బీజేపీతోనే సాధ్యం’’అని పేర్కొన్నారు.ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వాజ్ పేయి సేవలను స్మరిస్తూనే ఆయన స్పూర్తితో నరేంద్రమోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.

LEAVE A RESPONSE