Suryaa.co.in

Andhra Pradesh

మైనార్టీ నిధులను మళ్లించేస్తున్న వైసీపీకి మైనారిటీలంతా గుణపాఠం చెప్పాలి

( MA. షరీఫ్ , ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్)

ఊహ తెలిసినప్పటి నుంచి నేను అన్న ఎన్టీఆర్ అభిమానిని. అన్నగారి సినిమాలు చూస్తూ పెరిగా. ఆ అభిమానమే నన్ను రాజకీయల వైపు ఆకర్షించింది. రాజకీయ నేతగా తీర్చిదిద్దింది. 1982లో నర్సాపురంలో 11 మందిమి కలిసి పార్టీ పెట్టాం. అన్న ఎన్టీఆర్ పై ఉన్న అచెంచలమైన అభిమానమే 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చింది. రామారావు సినీరంగంలో తిరుగులేని కథానాయకుడిగా రాణించారు. 60 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఆ వయసులో ఎన్టీఆర్ కి సినిమాలు లేక రాజకీయాల్లోకి రాలేదు. మా సినిమాల్లో నటించమని ఎందరో నిర్మాతలు అన్నగారికి బ్లాంక్ చెక్ ఇచ్చేవారు. వాటన్నింటినీ వదులుకుని కేవలం ప్రజాసేవ కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను సరిచేయాలని ఆయన భావించారు. పేదల జీవితాలను బాగు చేసేందుకు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ఇందిరాగాంధీని ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు. కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు. ప్రపంచంలోనే ఆంధ్రులను తిరుగులేని శక్తిగా మార్చడంలో అన్న ఎన్టీఆర్ నాటిన బీజాన్ని చంద్రబాబు గారు మహా వృక్షంగా మార్చారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది.

తెలుగుదేశం ఒక లౌకిక పార్టీ. మత సామరస్యం కాపాడే పార్టీ. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ పాతబస్తీలో తరచూ మత ఘర్షణలు జరిగేవి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మత ఘర్షణలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించారు. 40 ఏళ్లుగా టీడీపీ చరిత్ర చూడండి. కుల, మత, ప్రాంత విబేధాలు లేకుండా అందరూ జీవించేలా పాలన అందించిన ఘనత తెలుగుదేశానిదే. ముస్లిం ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు వారికి అభివృద్ది చేసిందేలేదు.

1985 లో మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేశారు . జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేశారు. కక్షపూరితంగా పథకాలను నిలుపుదల చేశారు. మైనార్టీ నిధులను మళ్లించేస్తున్న వైసీపీకి మైనారిటీలంతా గుణపాఠం చెప్పాలి. నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన అన్న ఎన్టీఆర్ కు, నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిన చంద్రబాబుకి సదా రుణపడి ఉంటాను.

LEAVE A RESPONSE