Suryaa.co.in

Entertainment

యుగపురుషుడు ఎన్టీఆర్

తెలుగుతల్లి కన్నబిడ్డ తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆత్మాభిమానమే ఊపిరిగా,తెలుగుజాతి ఆత్మగౌరవమే జీవనముగా సాటిలేని మహానాయకునివై కీర్తి పొందిన అరుణ కిరణమా,పేద జీవితాలకు పెన్నిధివై ఆడపడచుల బ్రతుకుల్లో ఆశాజ్యోతివై,వెలుగొందిన మానవతారా ప్రతి ఆత్మలో నిలిచిన జీవన ధారా,అన్యాయాన్ని ఎదురించి విద్రోహుల,దోపిడిదారుల గుండెల్లో బాణమై బడుగుల కోసం పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి నూతన ఆశయాలకు మార్గదర్శివై,దేశ ప్రగతికే సారధివై మచ్చలేని మహాత్ముని అడుగుజాడల్లో మెలిగావు. నీ ఆశయాలు సాధించుటకై నీ అడుగుజాడల్లో పయనించి నీ ఆశయాలకు జీవం పోస్తాం.

చీకట్లో వెలిగించిన దీపంలాగా తెలుగుదేశానికి జీవం పోసి కుటిల రాజకీయాలకు సమాధి కట్టావు. ఆనాటి నుండి ఈ నాటి వరకు ఈ దీపం వెలుగులు విరజిమ్ముతూనేఉంది. అస్తవ్యస్త సామాజిక అద్వాన్న పరిస్థితుల మద్య, పాప పంకిల రాజకీయ పద్మవ్యూహాల మద్య అనంతమైన అవినీతి,అక్రమాల ఆగడాల మద్య, ప్రగతి కోరి,ప్రజా సంక్షేమం కోరి ఆధరణ లేని అన్నదాతల అవస్థల మద్య, నిష్కలమైన శ్రమజీవుల రెక్కల కష్టాల మద్య త్రాగేందుకు నీరులేని,అడిగేందుకు నోరులేని అభాగ్యుల కడగండ్ల మద్య తెలుగుదేశం అనే వెలుగుదీపాన్ని వెలిగించావు నందమూరి తారకరామా!

తెలుగు చలనచిత్ర రంగంలో మూడు దశాబ్దాలకుపైగా మకుటంలేని మహారాజుగా వెలుగొంది శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా విభిన్న పాత్రల పోషణతో తెలుగువారి ప్రత్యక్ష దైవంగా వెలుగొందిన మహాకళాకారుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. కృష్ణా జిల్లా పామర్లు మండలం నిమ్మకూరు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబం లో జన్మించిన నందమూరి తారకరామారావు సినిమా రంగంలో 300 లకు పైగా సినిమాలలో నటించి విశ్వ విఖ్యాత నట సార్వబౌమునిగా, తెలుగు చలన చిత్ర రంగంలో మకుటం లేని మహా మహారాజుగా ఎదిగిన ఎన్‌టి‌ఆర్.

1960 లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలో వెంకటేశ్వరుడిగా రామారావు నటనకు ప్రజలు హారతులు పట్టారు. కలియుగ ప్రత్యక్షదైవం తారకరాముడు రూపంలో తెరపై సాక్షాత్కరించింది అని భక్తజనం పులకించి పోయింది. ఈ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్ల దగ్గర హుండీలు పెట్టి మరీ ప్రజలు ఆ తారకరాముడికి, ఆ రూపంలో శ్రీనివాసుడికి కానుకలు సమర్పించుకొనేవారు. తిరుపతి వెంకన్న ను దర్శించుకున్న ప్రతి భక్తుడు మద్రాసు వెళ్ళి రామన్న ను దర్శించుకుంటే కానీ ఆ వెంకటేశుడి మొక్కు తీరదు అని ప్రతి తెలుగు వాడు భావించాడు.

పాతాళభైరవి, చండీరాణి సినిమాలతో జానపద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ జయసింహ, జయం మనదే చిత్రాలతో జానపద సినిమాల హీరో అంటే ఎన్టీఆర్ అనేలా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. జానపద హిరోలకుండే దేనికైనా తెగించే తెగువ, కొండలనైనా పిండి చేయగల శక్తిసామర్ధ్యాలు. సామాన్య ప్రజల పట్ల ఉండే శ్రద్దాసక్తులు. రాజకుమారుడు అయినా, పేదవాడైనా ఎప్పుడూ ప్రజల పక్షం వహించే నాయకత్వ లక్షణాలు అన్నీ తారకరాముడిలో ప్రజలకు కన్పించాయి.

1962 లోనే వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం గుండమ్మ కథ, ఇప్పటికీ ఈ సినిమా టి.వి.ల్లో వస్తుంటే అందరూ కన్నార్పకుండా చూస్తూనే ఉంటారు. ఇందులో రామారావు పండించిన హాస్యం, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అప్పటివరకు ఇల్లరికమేతెలిసిన వారికి అల్లుడిరకం అనే కొత్త బంధుత్వాన్ని కూడా ఈ సినిమా సృష్టించింది. “ లేచింది ! నిద్రలేచింది మహిళాలోకం ! దద్దరిల్లింది పురుష ప్రపంచం “ అంటూ మహిళాశక్తిని చూపించింది. అప్పటి సమాజంలో మహిళలపట్ల ఉన్న కొద్దిపాటి చిన్నచూపును ఈ సినిమా ద్వారా ఎండగట్టాడు. అదే సంవత్సరం వచ్చిన మరో చిత్రం రక్తసంబంధం ద్వారా అన్నా చెల్లెల్ల అనుబంధం ఎంత గొప్పదో తెలియచెప్పి, తెలుగువారందరికీ అన్న అయ్యాడు. ప్రతిక్షణం చెల్లెలు కోసం పరితపించే అన్నగా ఎన్టీఆర్ నటన అనితరసాధ్యం. ఇప్పటికీ అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ఇంతకన్నా గొప్ప సినిమా మరొకటి లేదు.

1961లో విడుదలైన యన్.ఎ.టి వారి సీతారామకళ్యాణం సినిమాలో మరోసారి లంకేశ్వరుడి గా నటించాడు. కైలాసనాధుని దర్శనానికి వెళ్ళిన రావణబ్రహ్మను , నందీశ్వరుడు అడ్డుకొనే సన్నివేశంలో తన ప్రేవులు త్రెంచి రుద్రవీణ మ్రోగించే సన్నివేశంలో రామారావు నటన అమోఘం. ఈ సినిమా కి దర్శకుడిగా ఎవరి పేరు కనిపించదు కానీ దర్శకత్వం వహించింది రామారావే. ఈ సినిమాలోని “శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి ….. “ పాట తెలియని తెలుగు వాడు ఎవరూ లేరు. ఇప్పటికీ ఈ పాట తెలుగునేలంతా మారు మ్రోగుతూనే ఉంటుంది.

1982 మార్చి 21న రామకృష్ణా స్టూడియోలో ఎన్టీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 35 ఏళ్ల తన సినీ జీవితం గురించి, ప్రజల ఆదరాభిమానాల గురించి చెప్పారు. వారి రుణాన్ని తీర్చుకునేందుకే ప్రజాసేవా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త సినిమాలను ఒప్పుకోవడంలేదని ప్రకటించారు. కళాకారుడిగా సంపాదించిన దానితో పూర్తి సంతృప్తితో ఉన్నానంటూ కుటుంబ సభ్యులందరికీ ఆస్తిపాస్తులను పంచి ఇచ్చేశానన్నారు. ఇకపై ఏ బాదరబందీ లేదంటూ పూర్తికాలం ప్రజాసేవకే కేటాయించనున్నట్లు తెలిపారు.

1989లో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాను ప్రారంభించారు. జూన్ 19న జరిగిన ప్రారంభోత్సవానికి జాతీయ పార్టీల నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ వీ పీ సింగ్, దేవీలాల్, అరిఫ్ మహమ్మద్ ఖాన్, కాంగ్రెస్ (ఎస్) నేత కే పీ ఉన్నికృష్ణన్, దినేష్ గోస్వామి, డీఎంకే నేతలు కరుణానిధి, మురసోలిమారన్, అస్సాం ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంత తదితరులు హాజరయ్యారు. పురాణాలలో, చరిత్రలో ఖ్యాతి కెక్కిన మహానుభావులను తెరకెక్కించి, ఆ పాత్రల ద్వారా సమాజాభివృద్దిని, సంఘసంస్కారాణాభిలాషను అభిలషించిన మహానీయుడు శ్రీ నందమూరి తారకరామారావు, అందుకే ప్రజల పాలిట దైవాంశ సంభూతుడయ్యాడు. 1949 నుంచి 1982 వరకూ 33 ఏళ్లలో 292 సినిమాల్లో ఎన్‌టీఆర్ నటించారు. అందులో 274 తెలుగు సినిమాలైతే 15 సినిమాలు తమిళం, మూడు సినిమాలు హిందీవి ఉన్నాయి.

1949లో ‘మ‌న‌దేశం’ చిత్రంతోటే ఎన్టీఆర్ న‌టునిగా తెరంగేట్రం చేశారు.స్వాతంత్ర్యం రాక‌ముందు జ‌రిగే క‌థాంశంతో ఆ సినిమా తీశారుఎన్టీఆర్ తొలి సినిమాకు తీసుకున్న పారితోషికం మాత్రం కేవలం 200 రూపాయలు కావడం గమనార్హం. మన దేశం సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నారు. ఇప్పుడు ఈ మొత్తం తక్కువే అయినా ఈ సినిమా షూటింగ్ జరిగే సమయానికి ఈ మొత్తం ఎక్కువ మొత్తమే అని చెప్పవచ్చు.

1977లో విడుదలైన అడవిరాముడు సినిమా సృష్టించిన సంచలనం అంతా, ఇంతా కాదు అప్పటి రికార్డలనన్నిటినీ తిరగరాసింది. 1980 లో విడుదలైన సర్దార్ పాపారాయుడు మరోసారి సంచలనం సృష్టించింది. స్వాతంత్ర సమరయోధులం అని చెప్పుకుంటూ, నిజమైన వీరులని పక్కకు తోసేసి, తమను తాము సంఘ సంస్కర్తలుగా చెప్పుకొనే వారు చేసే అవినీతి భాగోతాలను తెరపై చూపించింది.1982లో వెంటవెంటనే వచ్చిన జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి సినిమాలతో ఎన్టీఆర్ ఇమేజ్ ఎవరెస్ట్ ని తాకింది.

న్యాయం కోసం ఎవరినీ లెక్కచేయని జస్టిస్ గా ఎన్టీఆర్ నటనకు ప్రజలు నీరాజనం పట్టారు. నా దేశం సినిమాలో తెలుగు జాతి ప్రశస్తి గురించి మాట్లాడినా, కాలినడకన నుంచి కారులోకి మారిన మనిషి తన పాత రోజులు మరిచిపోకూడదు అని తను ఎక్కడఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేనెప్పుడూ సామాన్యుడినే అని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ పలికే ప్రతి పదం సగటు ప్రజల మనసుకలో ఉన్నమాటలే.

ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుద్దాం,అదే ఎన్టీఆర్ కు మనం అర్పించే నిజమైన ఘన నివాళి.

– తాడికొండ సాయి కృష్ణ
నందమూరి తారకరామారావుగారి అభిమాని
9866365222

LEAVE A RESPONSE