రాజధాని మార్పుపై జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఇచ్చిన ప్రకటనలన్నీ కోర్టు ధిక్కరణే
500 కోట్ల ప్రజాధనంతో ఋషికొండపై ముఖ్యమంత్రి నివాస , కార్యాలయాల సముదాయం నిర్మాణం
జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత?, ఆయన చెల్లించే ఆదాయ పన్ను ఎంత?
ఓ పేదవాడికి ఇన్ని ప్యాలెస్ లు ఉంటాయా?? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఋషికొండ కు గుండు కొట్టి నిర్మించిన అక్రమ భవన సముదాయంలోకి జగన్మోహన్ రెడ్డి తన మకాం మార్చితే అడ్డంగా దొరికిపోతారు. రిషి కొండపై పర్యాటక భవనాలను నిర్మిస్తున్నామని కోర్టు కు చెప్పి, నివాస సముదాయం, కార్యాలయాలను నిర్మించడం కచ్చితంగా కోర్టును తప్పుదారి పట్టించడమే అవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు .
దీనితో జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తప్పవని హెచ్చరించారు.హైకోర్టు ఈ కేసును కొట్టి వేసినప్పటికీ, రిషికొండపై భవన నిర్మాణాలకు సంబంధించిన ఉల్లంఘనలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు . సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మిలిటరీ రెడ్డి, మంత్రులు ఇచ్చిన ప్రకటనలన్నీ కోర్టుదిక్కరణే అవుతాయి.
రాజధాని కేసును డిసెంబర్లో వింటామని న్యాయస్థానం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు భయపడే డిసెంబర్ లో ఋషికొండపై నిర్మించిన భవనంలోకి మకాం మారుస్తామని చెప్పి ఉంటారేమో?!. లేదంటే రాక్షస గురువైన శుక్రాచార్యులు లాంటివారు ఎవరైనా డిసెంబర్లో మంచి ముహూర్తాన్ని సూచించి ఉంటారేమోనని అపహాస్యం చేశారు. రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వెలువడే అవకాశం లేదు. ముఖ్యమంత్రి రిషి కొండపై నిర్మించిన భవన సముదాయంలో మహా అయితే మూడు నెలల పాటు కాపురం ఉంటారేమోనని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నంకు తన మకాం మార్చడానికి ముఖ్యమంత్రి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణం రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఒకరకంగా పేర్కొని, నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన సదస్సులో మరొక రకంగా చెప్పారు.. ఇలా ద్వంద వైఖరిని అవలంబించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
తరచూ పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని చెప్పే… జగన్మోహన్ రెడ్డి లాంటి పేదవారి ఆస్తులు ఎంత?, ఆయన చెల్లించే ఆస్తి పన్ను ఎంత?, రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలలో ఆయనకున్న ప్యాలెస్ లు ఎన్ని??… లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి పేదవాడ అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
బాత్ టబ్ ఖరీదు 25 లక్షల రూపాయలట…!
ఋషికొండపై నిర్మించిన భవన సముదాయంలో బాతు టబ్ ఖరీదు 25 లక్షల రూపాయలని తెలిసిందని రఘు రామ కృష్ణంరాజు వెల్లడించారు. ఈ భవన నిర్మాణ సముదాయం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారు. ఒక్కొక్క చదరపు అడుగు కోసం సుమారు 25 వేల నుంచి 26 వేల రూపాయలకు వరకు ఖర్చు చేశారు. ఒక్క కమోడ్ ధర నే అక్షరాల 10 లక్షల రూపాయలట. ఒక్క టాయిలెట్ కు రెండు లక్షల రూపాయలు వేసుకున్న… ఒక పేదవాడి గృహ నిర్మాణం అని పేర్కొన్న ఆయన, కమోడు ధరలో పేదవారి కోసం ఐదు జగనన్న గృహ నిర్మాణాలను చేపట్టవచ్చునని అన్నారు.
బాత్ టబ్ కోసం వెచ్చించిన 25 లక్షల రూపాయల ఖర్చులో పన్నెండు న్నర జగనన్న గృహాల నిర్మాణం సాధ్యమై ఉండేది . ఇప్పటివరకు ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో రాష్ట్రంలోను , ఇతర రాష్ట్రాలలోనూ ప్యాలెస్ లను నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి… ఇప్పుడు ఏకంగా ప్రజాధనంతోనే ఋషికొండపై ప్యాలెస్ ను నిర్మించుకున్నారు.. అధికారంలో నుంచి దిగిపోయే లో గానే ఈ ప్యాలెస్ ను తన వందిమాగాదుల పేరిట లీజు ద్వారా పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాదులోని లోటస్ పాండ్ ప్యాలెస్, బెంగుళూరు లోని ప్యాలెస్, ఇడుపులపాయలోని ప్యాలెస్ ఇప్పటికే పూర్తయిన ప్యాలెస్ ల తో పాటు, ఇంకా కట్టబోయే ఎన్నో విశాలమైన ప్యాలెస్లలో ఎంతమంది
నివసిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల గృహాలను నిర్మించామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కట్టింది ఒకటి, రెండు కాలనీలు మాత్రమే. ఆ ఒకటి, రెండు కాలనీలలో మంచినీటి సరఫరా కోసం కనీసం ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించకపోవడం దారుణం.
గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించిన మూడు లక్షల గృహాలను నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పేదలకు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు పంపిణీ చేయలేదు . కానీ తనకోసం ప్రజాధనంతో రుషికొండ పై నిర్మించుకున్న విశాలమైన భవనంలో మాత్రం అందమైన ఉద్యానవనాలు, సరస్సులు ఉండేలా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ విషయాన్ని మూడు నెలల క్రితమే నేను చెప్పాను. ఋషికొండపై నిర్మిస్తున్నది జగన్మోహన్ రెడ్డి నివాస, కార్యాలయ సముదాయమని స్పష్టంగా చెప్పాను … కానీ అవన్నీ పర్యాటకశాఖ భవనాలను చెప్పి కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. ఇలా అఫిడవిట్ ఇచ్చినవారు కచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదు. గతంలో ఋషికొండపై పిచ్చుక గూళ్ళ లాంటి కాటేజీలు ఉండగా … వాటి స్థానంలోనే నూతన నిర్మాణాలను చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు మార్గ నిర్దేశం చేసింది.
రెండు ఎకరాలలో నూతన నిర్మాణాలను చేపట్టాలని చెబితే, ఏకంగా 60 ఎకరాలలో నిర్మాణానికి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుమతులు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్, టూరిజం శాఖ అధికారులు జగన్మోహన్ రెడ్డి కి వంత పాడుతున్నారని, అందుకే ఋషికొండపై అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. రుషి కొండ పై రెండు ఎకరాలలో నిర్మాణం చేపట్టమని చెప్పగా, 9 ఎకరాలలో నిర్మాణాలను చేపట్టినట్లుగా అంగీకరించారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై కేసు దాఖలు చేసిన తర్వాత ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు మారారు కానీ, ఇప్పటివరకు తీర్పు వెలువడ లేదు.
ఋషికొండపై ఉల్లంఘనలను పరిశీలించడానికి పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయగా, స్పష్టమైన ఉల్లంఘనలను కమిటీ సభ్యులు గుర్తించడం జరిగింది. ఋషికొండపై తనతో పాటు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేస్తే… సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. పర్యాటక శాఖ భవనాలలో 25 లక్షల రూపాయల విలువ చేసే బాత్ టాబ్ ఏర్పాటు చేస్తారా?, మౌర్య హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్ లోనే కేవలం ఆరు నుంచి ఏడు లక్షల విలువ చేసే బాత్ టాబ్ ఏర్పాటు చేస్తారు. అటువంటిది పర్యాటక శాఖ భవనాలలో అంత ఖరీదైన బాత్ టబ్ ఏర్పాటు చేశారంటే… ఎవరి కోసమో స్పష్టం అవుతూనే ఉంది.
సోమరాజు లాగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి
గడపగడపకు జగనన్న కార్యక్రమంలో భాగంగా మీ ఇంటి వద్దకు వచ్చే వైకాపా ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను మంత్రి వనితను సోమరాజు ప్రశ్నించినట్లుగానే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. మద్యం వినియోగం, గతంలోని , ప్రస్తుత మద్యానికి నాణ్యతలో ఉన్న తేడా, ధరల వ్యత్యాసానికి సంబంధించి టిడిపి నాయకులు కూడా కరపత్రాలను ముద్రించి, ఇంటింటికి పంచాలని సూచించారు. రాష్ట్రంలోని జనాభాలో 33 శాతం మంది మద్యపానం సేవిస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి వెల్లడించారు.
రాష్ట్రంలో జనాభాలోని 50 శాతం మందిగా ఉన్న మహిళలు మద్యం సేవించే అవకాశం లేదు. మగవారిలోనూ ఒక్క శాతం ప్రజలు అసలే మద్యం సేవించారని అనుకుంటే, మిగిలిన 49 శాతం జనాభాలో ఎగువ మధ్యతరగతి వర్గాలు, సంపన్న వర్గాల వారు రాష్ట్రంలో లభించే నాణ్యత లేని మద్యాన్ని సేవించరు.. తెల్ల రేషన్ కార్డు దారులు, జగనన్న పథకాల లబ్ధిదారులు మాత్రమే రాష్ట్రంలో లభించే నాసిరకం మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక క్వార్టర్ తాగిన ఏడాదికి వారు మద్యం పై 54 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.
జగనన్న ఆ కుటుంబాలకు ఆసరా ద్వారా 15000, పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఉంటే అమ్మ ఒడి ద్వారా 13 వేల రూపాయలను అంటే మొత్తంగా 28 వేల రూపాయలను లబ్ధి చేకూర్చుతుంటే… ఆ కుటుంబాల వద్ద నుంచి 30 వేల రూపాయలను మద్యం రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 8సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ప్రజలపై ఆ చార్జీల రూపంలో మోపిన భారం మొత్తం ఎంత… జగనన్న చెత్త పన్ను ఎలాగో ఉండనే ఉంది. ఇంటి ఆస్తి విలువలు తగ్గిపోయినా, ఏడాదికి 15 నుంచి 20 శాతం ఆస్తి పన్నును పెంచుతూ పోతున్నారు.. ఈ లెక్కలన్నీ ప్రజలు రెడీ చేసుకుని, తమ ఇంటి వద్దకు జగనన్న లెక్కలు తీసుకుని వచ్చే వైకాపా ఎమ్మెల్యేలను, నాయకులను ప్రశ్నించాలని రఘురామకృష్ణం రాజు కోరారు .
ఈ సందర్భంగా గోదావరి జిల్లాకు చెందిన పి పి శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిని వ్యంగ్యంగా విమర్శిస్తూ చేసిన పోస్టును రఘురామ కృష్ణంరాజు చదివి వినిపించారు. అప్పు లేని మంగళవారం లేదు. పరదా లేని పర్యటన లేదు. ప్రతిపక్ష నేతల గృహనిర్బంధం తప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కు తన మకాం మారిస్తే ఉత్తరాంధ్రలో వస్తాయనుకుంటున్న ఒకటి, రెండు స్థానాలు కూడా మా పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఉభయగోదావరి జిల్లాలలో 34 స్థానాల మాదిరిగానే, ఉత్తరాంధ్రలోను 34 స్థానాలు ప్రతిపక్ష పార్టీ కూటమి ఖాతాలో జమ కావడం ఖాయం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సందర్భంగా న్యాయస్థానాలలో జరుగుతున్న ఆలస్యాన్ని సున్నితంగా ఎత్తిచూపుతూ పి పి శాస్త్రి రాసిన వ్యాఖ్యలను ఆయన చదివి వినిపించారు.
కోర్టులలో పిటీషన్లు పెండింగ్లో ఉండగానే సిఐడి చీఫ్, రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ వంటి వారు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి, న్యాయస్థానాలలో వెలువడనున్న తీర్పుల గురించి చెప్పినప్పటికీ, కోర్టులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కానీ స్కిల్ కేసులో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి టీవీ చర్చలలో ఆయన కు అనుకూలంగా మాట్లాడితే మాత్రం కేసులు నమోదు చేస్తున్న విధానాన్ని పి పి శాస్త్రి చక్కగా వివరించారన్నారు.
చంద్రబాబు నాయుడు వైద్య నివేదిక తీరు విడ్డూరం
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు అధికారులు విడుదల చేసిన వైద్య నివేదిక విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. డిహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకు సాల్ట్స్ , సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కిడ్నీ సంబంధిత పరీక్షలు చేసి వాటి వివరాలను వెల్లడించాల్సి ఉండగా… రక్తపోటు, ఆక్సిజన్, బీపీ తదితర వివరాలు వెల్లడించడం ఏమిటని ప్రశ్నించారు. చెమటపడితే దురద రాదా… దురద వస్తే గోక్కోరా? గోక్కుంటే దద్దులు రావా అంటూ కొంతమంది పనికిమాలిన వారు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది.
పెద్దాయన 73 కేజీల బరువు ఉంటారని నాకు తెలుసు. జైలు కు వచ్చినప్పుడు 66 కేజీల బరువు ఉన్నారని, ఇప్పుడు మరొక కేజీ బరువు పెరిగారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అతి తక్కువ కాలవ్యవధిలో అనూహ్యంగా 5 కేజీల బరువు తగ్గడం అనేది ప్రమాదకరం. కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు ని ఆసుపత్రికి తరలించాల్సింది పోయి, ఉద్దేశపూర్వకంగా జైలు అధికారులు అనారోగ్య సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
వైద్యులు చంద్రబాబు నాయుడును చల్లటి ప్రదేశంలో ఉంచాలని సూచించినప్పటికీ, రెండు రోజులపాటు ఆలస్యం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి. చివరకు ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలతో టవర్ ఏసీ ని ఏర్పాటు చేశారట. చంద్రబాబు నాయుడు కి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు సూచించారు. రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పై చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటీషన్ పై వాదనలు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాదనలు ముగియనున్నాయి.
వాయిదాలు లేవని చెప్పిన తర్వాత ఈ కేసును వాయిదా వేస్తే బాగుండదు. తప్పకుండా మంగళవారం వాదనలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని కూడా ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. మంగళవారం వాదనలు పూర్తయిన తర్వాత బుధవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. తీర్పు ఆలస్యమైతే ఇంట్రీమ్ ఆర్డర్ ను కోరవచ్చు. బుధవారం లేదంటే గురువారం నాడు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలవుతారని నా ప్రగాఢ విశ్వాసం అని రఘురామకృష్ణంరాజు తెలిపారు.