Suryaa.co.in

Andhra Pradesh

పెట్టుబడులు పెట్టిన ఆ ముగ్గురు ప్రమోటర్లంతా ఒకే సామాజిక వర్గం…

ప్రమోటర్లలో అరబిందో రెడ్డి, షిరిడీసాయి ఎలక్ట్రానిక్స్ సంస్థ
షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంస్థ వార్షిక టర్నోవర్ 300 నుంచి 400 కోట్ల రూపాయలు మాత్రమే
ఆ మూడువేల ఎకరాల భూమి ఎలాట్‌మెంట్‌కోసమేనా?
జగన్మోహన్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా పులివెందులలో నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్
జగన్మోహన్ రెడ్డిలో పిట్టలదొరను చూడలేదు.ఒక కమలహాసన్, ఎంజీఆర్ ను మాత్రమే చూశా
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏకపాత్రాభినయం బాగుంది
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

లక్షా ఇరవై ఆరువేల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చిన ముగ్గురు ప్రమోటర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ముగ్గురు ప్రమోటర్లు కలిసి పెట్టనున్న పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రికమండేషన్ తో ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు . ఐ నో సోల్ కంపెనీ పేరిట రాష్ట్రంలో 43 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లుతెలిపారు. ఈ సంస్థ కు సంబంధించిన వివరాలు పబ్లిక్ డో మైన్ లో అందుబాటులో లేవన్నారు.

తాను ఆరా తీయగా అరబిందో రెడ్డి ప్రమోటరని , షిరిడీసాయి ఎలక్ట్రానిక్స్ సంస్థ మరొక ప్రమోటరని తెలిసిందన్నారు. రెండు మూడు వేల ఎకరాల భూమిని అలాట్ చేయించుకుని పెట్టుకోవడానికి కొన్ని పేర్లను మా ప్రభుత్వ పెద్దలు తెరపైకి తెచ్చారా? అన్న అనుమానాలు లేకపోలేదన్నారు. హైడ్రో ప్రాజెక్టులను ముఖ్యమంత్రి తో పాటు 30 కేసుల్లో ఏ టు గా ఉన్న విజయసాయి రెడ్డి వియ్యంకుడు అయినా, అరబిందో ఫార్మా యాజమాని పెట్టుబడులు పెట్టనున్నారని చెబుతున్నారన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో సంస్థ మందుల తయారీ నుంచి మొదలుకొని, సారా వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం, నిర్మాణరంగం, పోర్ట్, ఎస్ ఈ జడ్ లలో ప్రవేశించిందన్నారు. శిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి 41 వేల కోట్ల రూపాయలతో హైడ్రో ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి కి చెందిన షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంస్థ వార్షిక టర్నోవర్ 300 నుంచి 400 కోట్ల రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. దానిలో 30 నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే లాభాలు ఉంటాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా పులివెందులలో నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన బినామీగా పెట్టుబడులను పెడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

గ్రీన్ కో ఆరువేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడుతుండగా, ఎంపీ బాలశౌరికి చెందిన కంపెనీ 150 కోట్ల రూపాయలతో ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టుబడులను పెట్టనుందన్నారు. వీరిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేది ఎంతమందో తెలియదని వ్యాఖ్యానించారు. గతంలో కాకినాడ ప్రాంతంలో దివి లేబరేటరీస్ ఏర్పాటును ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పుడు కాకినాడ ఎస్ఇ జెడ్ లో అరబిందో ఫార్మా ఏర్పాటు చేస్తున్న కంపెనీని టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాపోతున్నారని చురకలు అంటించారు. గతంలో వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఏమిటో తెలియదు కానీ, దివి లేబరేటరీస్ ఏర్పాటును అడ్డుకున్నారన్నారు. ఏ టు వియ్యంకుడైన అరబిందో ఫార్మా యజమాని, రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పెడతారా? అన్న అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు.

మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించి, ఉత్పత్తిని చేపడుతున్న కంపెనీలు ఎన్నో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కంపెనీలను, మన ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించినట్లుగా చెప్పుకోవడం భావదారిద్రమే అవుతుందన్నారు. పిట్టల దొర కబుర్లు ఆపాలని, ఈ మాటలు తాను అనడం లేదని ప్రజలు అంటున్నారని… తాను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిలో పిట్టలదొరను చూడలేదని, ఒక కమలహాసన్, ఎంజీఆర్ ను మాత్రమే చూశానని చురకలు అంటించారు.

అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గెంటివేసి, ప్రజలను అమాయకులుగా భావించి , తాను చెప్పిన అబద్దాలను నమ్ముతారన్న ఉద్దేశ్యం తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా ఏకపాత్రాభినయం బాగుందని. మా పార్టీ అధ్యక్షుడైన, ముఖ్యమంత్రి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారోననే , కుతూహలంతో తాను ఆరా తీశానని చెప్పారు. పిట్టలదొర మాటలు ఎవరు నమ్ముతారని పలువురు పేర్కొనడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందన్నారు.

ఎంతో ఆర్ధత, సాంద్రతతో మా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే, ప్రజలు…పిట్టలదొర మాటలనడం పట్ల తాను ఎంతో కలత చెందానని చెప్పారు. పిట్టల దొరకు సంబంధించిన సినిమా దృశ్యాలు చూశాక… భలే చెప్పారు రా బాబు.. అనుకున్నానని అన్నారు. మా ముఖ్యమంత్రి మాటలు అచ్చంగా పిట్టలదొరను పోలినట్టే ఉన్నాయని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… 52,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు, తానే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు.

రెండు లక్షల మంది తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బందిని, తిరిగి వారి సేవలను కొనసాగించేందుకు పొడిగించినందుకుగాను వారికి కూడా తానే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తుంటే, ఉద్యోగ నియామకాలు చేపట్టవలసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కరకు రాని గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి, పోలీస్ కానిస్టేబుల్, ఉపాధ్యాయ నియామకాలను నిలిపివేశారన్నారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేపట్టినప్పుడు తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని చెప్పి, ఒక్కరిని కూడా క్రమబద్ధీకరించిన పాపాన పోలేదన్నారు.

గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చే బదులుగా నిరుద్యోగులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, వారు హర్షించే వారన్నారు. ఉపాధ్యాయులకు రెండేళ్లపాటు పదవీ కాలాన్ని పొడిగించే బదులు, పదవీ విరమణ చేసిన వారికి రావలసిన బెనిఫిట్స్ అందజేసి ఉంటే, వారి స్థానాలలో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం లభించి ఉండేదన్నారు . ఉపాధ్యాయులు అడగకపోయినా రెండేళ్ల పదవీ కాలాన్ని పొడిగించారని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ముఖ్యమంత్రి చెబుతూనే, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పెద్దగా పరిశ్రమలు రాలేదని, రోడ్డున తిరిగే వారికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటు, బూటు వేయించి పారిశ్రామికవేత్తలని చెప్పి సంతకాలను చేయించారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు అర్ధరహితమని ఆయన మండిపడ్డారు . చంద్రబాబు నాయుడు హయాంలో కియా సంస్థ, అపోలో టైర్స్, విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, హీరో, ఈసూజ్, సెల్కాన్, అశోక్ లేలాండ్, హెచ్ సి ఎల్ టెక్నాలజీ, విశాఖలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. లులూ గ్రూప్ ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తన్ని తరిమేయడం జరిగిందని, అలాగే గతంలో అదాని డాటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరినప్పటికీ, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీల్ కుదిరాకే ఓకే చెప్పడం జరిగిందన్నారు.

స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు?
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును కోరుతూ టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి దాఖలు చేసిన పిటీషన్, కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం అర్థరహితమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల ఆరు నెలల కాల వ్యవధి కావస్తున్నదని, అయినా ఇప్పటివరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో విజయభాస్కర్ రెడ్డి హయాంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగించారన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నూ, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయలేదని చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తే, నిధులకు సంబంధించిన నివేదికను సమర్పిస్తుందని, దానిపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు. దీనితో నిధులు కొట్టేయడానికి వీలు లేకుండా పోతుందన్నారు.

రాజధాని గురించి అద్భుతంగా చెప్పి… ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?
ప్రతిపక్షనేతగా రాజధాని నిర్మాణం గురించి అద్భుతంగా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక చేసిందేమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఎందుకీ పలాయనవాదం అంటూ నిలదీశారు. గతంలో మీరు చెప్పింది విశ్వసించడం వల్లే ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. వాషింగ్టన్ డీసీ లాంటి అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుందామని, యూఫోరియా సృష్టించుకుందామని, తెలంగాణకు హైదరాబాద్ నగరం మాదిరిగా, ఆంధ్రప్రదేశ్ కు ఆదాయాన్ని సృష్టించే గ్రోత్ ఇంజన్ వంటి నగరాన్ని నిర్మించుకుందామన్న జగన్మోహన్ రెడ్డి, రాజధాని నిర్మాణానికి ఇప్పుడు ఎందుకని
ఆటంకాలను సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని మహానగరాలలో లంగ్స్ స్పేస్ లేకుండా పోయిందని, లంగ్స్ స్పేస్ కలిగిన నగర నిర్మాణానికి కృషి చేద్దామన్న జగన్మోహన్ రెడ్డి, కాలుష్యమయమైన విశాఖపట్నం నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేయాలని ఎందుకు భావిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఋషికొండను గుండు కొట్టేసినట్లుగా కొట్టేసి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని, ఇక విశాఖలో లంగ్స్ స్పేస్ కు చోటు ఎక్కడ ఉందని నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు బయటి వారు ఎవరూ రావడం లేదని , పెట్టుబడులను పెడతానన్న ఆ ముగ్గురు రెడ్లు ఎంతవరకు పెడతారో తెలియదన్నారు. రాష్ట్రంలో ఫిజికల్ గా పెట్టిన పరిశ్రమలు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తా
హైకోర్టు తీర్పును ధిక్కరించి తనను వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన ఏపీ సి ఐ డి అధికారులపై, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనతో పాటు మరో ఇద్దరు సహా నిందితులను కలిపి విచారించడానికి మాత్రమే స్వయంగా హాజరు కావాలంటూ, హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆయన ఈ సందర్భంగా చదివి వినిపించారు. అయినా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE