సీట్ల సర్దుబాటు కూడా జరిగింది
నిన్న మోదీ మాటలతో బీజేపీ, బీఆర్ఎస్ బంధం నిజమని స్పష్టమైంది
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన
ఎంఐఎం ఎటువైపో తేల్చుకోవాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కుదిరిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. బీఆరెస్ 7 స్థానాల్లో బీజేపీ 9 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో పోటీ చేసే వీలుగా సీట్ల పంపకం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బీఆరెస్ బీజేపీ ఫెవికాల్ బంధం గురించి నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ ను గెలిపించేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సిందన్నారు రేవంత్ రెడ్డి.
బీఆరెస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆరెస్ దోపిడీలో బీజేపీ కి వాటాలు వెళుతున్నాయి కాబట్టే మోదీ చర్యలు తీసుకోవడం లేదు కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ కు మద్దతుపై ఎంఐఎం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ, బీఆరెస్ ఒక్కటే… అవిభక్త కవలలు మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ…అని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి అసద్ ఎలా మద్దతు ఇస్తారు అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది.. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆరెస్ తోనా? బీజేపీ, బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా స్పష్టం చేయలన్నారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి నిధులు అంటే దోపిడీ సొమ్ము … నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు..ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే..మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి? బీఆరెస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. నిన్నటి మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోదీ అని స్పష్టత వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.
బండారం బయటపడిందనే కాంగ్రెస్ పై బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. వాళ్లిద్దరూ కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
ప్రజల దృష్టిని మరల్చడానికే నాపై హరీష్ రావు ఆరోపణలు
ప్రజల దృష్టిని మరల్చడానికే నాపై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళు జైలుకెళ్లే టైం వచ్చిందనే నాపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. కొడంగల్ లో పదేళ్లు నేను చేసిన అభివృద్ధి.. ఐదేళ్లలో వాళ్లు చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని సవాలు విసిరారు. కోస్గి, కొడంగల్, మద్దూరులో ఆసుపత్రులు తీసుకొస్తే వాటిని వాళ్లు ఇప్పటికీ పూర్తి చేయలేదు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బస్ డిపో కోసం 5 ఎకరాలు మేం కొని ఇచ్చామన్నారు.. బిల్లా రంగాలు ఇద్దరూ కొడంగల్ రావాలి.. కొడంగల్ అభివృద్ధి పై చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.