Suryaa.co.in

Andhra Pradesh

బీసీల సంక్షేమానికి, విద్యార్థుల భవితకు కూటమి ప్రభుత్వం పెద్దపీట

•మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు.. డీఎస్సీ కోచింగ్ సెంటర్లపై తాను తొలి సంతకాలు
•చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చిన్నారులు రాణించాలి
•పిల్లలకు అండగా తాము ఉన్నామన్న భరోసా తల్లిదండ్రులు కల్పించాలి
•రాష్ట్రంలో 107 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు.. స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యేక శిక్షణ
•జ్యోతిబా & సావిత్రిబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం సంతోషకరం
– బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత

అమరావతి, అక్టోబరు 9: ఎన్డీయే ప్రభుత్వానికి బీసీలే బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారని, అందుకే బీసీల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవితకు సైతం కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ బీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో జ్యోతిబా & సావిత్రిబాయి పూలే ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రానికి కూడా నివేదించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతి కోసం సమగ్ర ప్రణాళికల తయారీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 2014-2019 తమ ప్రభుత్వ హయాంలో ఆదరణ, విదేశీవిద్య, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో పథకాలను అమలు చేసి బీసీలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పనకు కృషి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 107 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే వాటిలో 105 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఏపీ సచివాలయ బీసీ ఉద్యోగుల పిల్లలకు జ్యోతిబా & సావిత్రిబాయి పూలే పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తే.. బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తాను బీసీ కోచింగ్ సెంటర్లపై తొలి సంతకం చేయడం జరిగిందన్నారు.

సివిల్స్, బ్యాంక్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాల్లో బీసీ భవన్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మార్కుల విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురాకుండా.. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా రాణించేలా చర్యలు తీసుకోవాలి.

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన పిల్లలు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరేలా తీర్చిదిద్దాలి. ఈరోజు అవార్డు గ్రహీతలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇస్తున్న రూ.3 వేల ఆర్థిక ప్రోత్సాహానికి అదనంగా, తాను మరో రూ.వెయ్యి అందిస్తున్నానని మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.

అనంతరం.. టెన్త్, ఇంటర్ లో విశేష ప్రతిభ కనబర్చిన చిన్నారులకు జ్యోతిబా & సావిత్రిబాయి పూలే ప్రతిభా పురస్కారాలను మంత్రి సవిత చేతులమీదుగా స్వయంగా అందజేశారు. అవార్డుతో పాటు మెమెంటో, రూ.4వేల నగదు, మెరిట్ సర్టిఫికెట్ లను విద్యార్థులకు అందించారు. తల్లిదండ్రులు, చిన్నారులతో కలిసి ఫొటోలు దిగి వారిని మరింత ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయ బీసీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE