Suryaa.co.in

Entertainment

అల్లు..హాస్యపుజల్లు..!

మనిషి సామరస్యం..
జీవితం మొత్తం హాస్యం..
పంచె..కోటు..బూటు..
తొడిగిన కమేడియన్..
రావు గోపాలరావుకు
అసలు సిసలైన కామ్రేడియన్..
కనిపిస్తే చాలు
ధియేటర్లు గొల్లు
ఆయన పేరే అల్లు..
తెలుగు తెరపై
నవ్వుల సంతకం…
నటనే ఆయన లోకం..!

చిరునవ్వుల జైత్రయాత్ర..
వెయ్యి సినిమాల అక్షయపాత్ర
నవ్వించడంలో జీనియస్
అప్పుడప్పుడు కాస్త సీరియస్..
ఎన్నని చెప్పాలి..
అందాలరాముుడులో తీతా
ముత్యాలముగ్గులో కోతా..
మాయాబజార్ లో గిల్పం కోరిన శర్మా..
ఏదో ఒకటి వాగి
కైకాలతో తిట్లు తిన్న ఖర్మా..!

శంకరాభరణంలో వకీలుగా
శాస్త్రిగారి మిత్రుడిగా..
నీ అభినయం..
మేమేం చెప్పినా
మద్యదల్లి నీవు
బందు మాట్టాడ
హేత్తి నల్వా నే…
ఉన్నాడా లోపల
అన్నప్పుడు నీ విరుపు..
ఆ సినిమా మొత్తానికే
ఓ మెరుపు!
అందుకే..అందుకే..
ఆ కళాఖండం
సూపర్ డూపర్ హిట్టుతో
విశ్వనాథుడయ్యాడు కళాతపస్వి..
సోమయాజులేమో చిరయశస్వి..
బాలసుబ్రమణ్యం గానప్రపూర్ణ..
వీరందరితో పాటు
నీ ఉనికితోనే
ఆ సినిమా పరిపూర్ణ!
చివరిలో మిత్రుడి సన్మానసభలో ప్రసంగం
నీ అభినయ ఉత్తుంగతరంగం..!

ఒక తరాన్ని
శివరావు నవ్విస్తే
మరో తరాన్ని
రేలంగి అలరిస్తే
ఇంకో తరాన్ని
రాజబాబు శాసిస్తే
ప్రస్తుత తరాన్ని
బ్రహ్మానందం కుమ్మేస్తే..
నాలుగు తరాలను నవ్వుల తీరాలు చేర్చిన రామలింగయ్యా..
నిన్ను చూస్తేనే
కడుపు పొంగయ్యా..
హాస్యానికి విలనీని జోడించి
అయిదు దశాబ్దాల పాటు
అభిమానులను ఓలలాడించి
తెలుగు సినిమా అంటే
ఓ హీరో..ఓ హీరోయిన్
ఓ విలన్..
ఓ ఇద్దరు
కేరెక్టర్ ఆర్టిస్టులు…
ఆపై అల్లు
ఉంటేనే త్రిల్లు..
కామెడీకి నువ్వు నిర్వచనం
వెయ్యిన్నిమూడు
సినిమాల బహువచనం..!

విశిష్ట నటుడు
అల్లు రామలింగయ్య
శత జయంతి
(01.10.1922)
సందర్భంగా
నివాళి అర్పిస్తూ

ఇ.సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE