– జగన్ వాక్కును నిజం చేసిన తథాస్తు దేవతలు
– ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే!
రాజకీయాల్లో కొన్నిసార్లు విధి ఆడే వింత నాటకాలు ఊహకు అందవు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తరచూ ఒక మాట అనేవారు.. “దేవుడి స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది” అని. ఇప్పుడు అమరావతి విషయంలో సరిగ్గా అదే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలానికే అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత రాబోతోంది!
జూన్ 2, 2024: అసలైన మలుపు ఇదే!
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు జూన్ 2, 2024తో ముగిసింది. జగన్ ముఖ్యమంత్రిగా జూన్ 4వ తేదీ వరకు కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం.. హైదరాబాద్ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే అంటే జూన్ 2 నుంచే అమరావతిని అధికారిక రాజధానిగా నోటిఫై చేయాలని కోరింది.
దీని అర్థం ఏంటంటే.. జగన్ ఇంకా సీఎం కుర్చీలో ఉండగానే, ఆయన వ్యతిరేకించిన అమరావతి చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా రికార్డుల్లోకి ఎక్కుతోంది.
ఢిల్లీలో చకచకా కదులుతున్న ఫైళ్లు: కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఈ ప్రక్రియపై కసరత్తు ముమ్మరం చేసింది. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.
కేబినెట్ నోట్ సిద్ధం: హోంశాఖ ఇప్పటికే కేబినెట్ నోట్ తయారు చేస్తోంది.
కేంద్ర శాఖల గ్రీన్ సిగ్నల్: ఇప్పటికే పలు కీలక మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలను తెలిపాయి. పట్టణాభివృద్ధి, న్యాయ శాఖల నుంచి తుది అనుమతులు రాగానే కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర పడనుంది.
బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు: ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ అధికారిక బిల్లు వచ్చే అవకాశం ఉంది.
జగన్ విషం కక్కినా.. ‘తథాస్తు’ అన్న కాలం!
జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని స్మశానంతో పోల్చారు, వరదలు వచ్చే ప్రాంతం అని విషం కక్కారు. ఇటీవలే మళ్లీ “సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని”, “కృష్ణా రివర్ బేసిన్లో రాజధాని ఏంటి?” అంటూ అమరావతిపై తన సహజ వైఖరితో తీవ్రమైన విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి రోజుల్లోనే అమరావతి ‘రాజధాని’గా చట్టబద్ధం కావడం విశేషం.
రాజధానిని మార్చాలని చూసిన వ్యక్తి అధికారంలో ఉండగానే, అదే రాజధాని అని అధికారికంగా మారడం.. ఆ మార్పు జరిగిన 48 గంటల్లోనే జగన్ను అదే అమరావతి కుర్చీ నుండి కూలదొయ్యడం.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం – దీన్నే అంటారు “కాలం ఇచ్చే తీర్పు” అని! జగన్ ‘రివర్స్’ పాలనలోకి కాలమే రివర్స్ వెళ్లి, దేశంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రా రాజధానిగా అమరావతికి పట్టాభిషేకం చేస్తూ రాజముద్ర వేయిస్తోంది.