Suryaa.co.in

Andhra Pradesh

రెట్టించిన ఉత్సాహంతో.. అమరావతి రైతుల మలివిడత పాదయాత్ర

60 రోజుల పాటు జరిగే పాదయాత్ర
900 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర
12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర
యాత్రలో ముందుభాగాన ఆ తిరుమలేశుడు భూదేవి, శ్రీదేవి సమేతునిగా రథం
అమరావతి రైతుల పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. 12న వేకువజామున 5 గంటలకు ప్రారంభం
వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
– 9 గంటలకు రథానికి జెండా ఊపి యాత్ర ప్రారంభం
– తొలి రోజు వెంకటపాలెం నుంచి మంగళగిరికి చేరుకోనున్న యాత్ర

అమరావతి రైతుల రెండో విడత మహాపాదయాత్రకు సర్వం సిద్ధమైంది. రాజధానిలోని తితిదే వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అరసవెల్లి సూర్యదేవుని సన్నిధి వరకూ జరిగే యాత్ర కోసం రైతులు, రైతుకూలీలు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే యాత్ర 60రోజుల పాటు జరగనుంది.

తమకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లటంతో పాటు.. అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యంగా పాదయాత్ర జరుగుతుందని రైతులు చెబుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు సర్కారుపై మలి విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 5image గంటలకు తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రకు సంకల్పం చేస్తారు. ఉదయం 6గంటల 3 నిమిషాలకు పండితులు నిర్ణయించిన సుముహుర్తాన రైతుల తొలి అడుగులు వేయనున్నారు.

అయితే రైతులంతా ఎక్కువమంది వెంకటపాలెంలో కలుస్తారు. అక్కడినుంచి అరసవెల్లికి రాజధాని రైతుల యాత్ర సాగనుంది. యాత్రలో ముందుభాగాన ఆ తిరుమలేశుడు భూదేవి, శ్రీదేవి సమేతునిగా రథంలో కొలువుదీరనున్నారు. అలాగే సూర్యదేవుని విగ్రహాన్ని రథం ముందుభాగంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ చిత్రపటంతో దళిత ఐకాస, ఆ వెంటనే మహిళలు, వారి తర్వాత రైతులు, రైతు కూలీలు అనుసరిస్తారు.

మొదటి రోజున వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకొంటుంది. మంగళగిరిలోని కల్యాణ మండపాల్లో రైతులు రాత్రి బస చేయనున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర 9రోజుల పాటు జరగనుంది. 60 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 9 సెలవు దినాలుంటాయి.నవంబర్ 11న పాదయాత్ర ముగియనుంది. మొత్తం 900 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది.

గుంటూరుతో పాటు కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కలిసేలా పాదయాత్రకు రూపకల్పం చేశారు.మార్గమధ్యలో మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుని రైతులు అరసవెల్లి చేరుకుంటారు. 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుంది. అమరావతిపై హైకోర్టు తీర్పుని అమలు చేయని ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని రైతులు చెబుతున్నారు.

హైకోర్టు నిర్దేశించిన నియమావళిని అనుసరిస్తూ రైతులు పాదయాత్ర చేయనున్నారు.గతంలో పోలీసులు పలుచోట్ల అడ్డుకోవటం, అధికార పార్టీ నేతల ఇబ్బందులకు గురి చేయటంతో రైతులు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు లేవు కాబట్టి.. వసతి పరంగా ఇబ్బంది లేకుండా అన్నిచోట్ల కళ్యాణమండపాల్ని ముందుగానే బుక్ చేసుకున్నారు.

ఎక్కడైనా వసతి సమస్య తలెత్తినా.. సమీపంలోని ఫంక్షన్ హాళ్లకు చేరుకునేలా రవాణాకర్యాలను కూడా సిద్ధం చేసుకున్నారు. మొదటి విడత పాదయాత్రలో ఆదివారం నాడు విరామం ఇచ్చారు. ఈ సారి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సంఘీభావం తెలిపే ఉద్యోగాలు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, ఎన్ఆర్ఐల కోసం ఆదివారాలు కూడా పాదయాత్ర కొనసాగించనున్నారు.

తెలుగుదేశం, భాజపా, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించాయి. మొదటిరోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృష్ణాయపాలెంలో రైతుల పాదయాత్రలో పాల్గొంటారు.తెదేపా, జనసేన, భాజపా, వామపక్షాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా రైతుల వెంట నడుస్తారు.పాదయాత్రపై అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను రైతులు సహేతుకంగా తిప్పికొడుతున్నారు.

ఏ ప్రాంత అభివృద్ధికీ తాము వ్యతిరేకం కాదని,.. అమరావతి కోసం భూములిచ్చాం కాబట్టి… అక్కడ రాజధాని నిర్మాణం జరగాలని స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర సజావుగా సాగేందుకు ఇప్పటికే కమిటీల పేరుతో పని విభజన జరిగింది.తాగునీరు, ఆహారం, రవాణా, రథం నిర్వహణ, ఫైనాన్స్ కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు.మొదటి పాదయాత్రలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

LEAVE A RESPONSE