హైద‌రాబాద్ సంస్థానంపై వీడియో విడుద‌ల చేసిన కిష‌న్ రెడ్డి

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా కొంత కాలం పాటు హైద‌రాబాద్ నిజాం పాల‌న‌లోనే కొన‌సాగిన సంగతి తెలిసిందే. నిజాం పాల‌న నుంచి హైద‌రాబాద్‌కు విముక్తి క‌ల్పించి… హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త దేశంలో క‌లిపే దిశ‌గా నాటి భార‌త ప్ర‌భుత్వం ప్రత్యేక క‌స‌ర‌త్తు చేసింది. భార‌త తొలి ఉప ప్ర‌ధాని స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ మంత్రాంగంతో నిజాం న‌వాబు హైద‌రాబాద్ సంస్థానాన్ని భార‌త్‌లో విలీనం చేసేందుకు అంగీక‌రించారు. ఈ అరుదైన ఘ‌ట్టాన్నే ఇప్పుడు కొంద‌రు విలీన దినోత్స‌వ‌మంటే… మ‌రికొంద‌రు విమోచ‌న దినం అంటున్నారు.

ఏటా సెప్టెంబ‌ర్ 17న హైద‌రాబాద్ విమోచ‌న దినం పేరిట బీజేపీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఈ కార్య‌క్ర‌మాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో విలీనానికి ముందు హైద‌రాబాద్ సంస్థానం ఎలా ఉండేద‌న్న విష‌యంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి సోమ‌వారం ఓ చిన్న‌పాటి వీడియో విడుద‌ల చేశారు.

భార‌త దేశంలో విలీనానికి ముందు హైద‌రాబాద్ సంస్థానంలో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ప‌లు జిల్లాలు ఉండేవ‌ని కిష‌న్ రెడ్డి ఆ వీడియోలో తెలిపారు. ఆ జిల్లాల్లో మ‌హారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్‌, బీద్‌, హింగోలీ, జాల్నా, లాతూర్‌, నాందేడ్‌, ఉస్మానాబాద్, ప‌ర్బ‌ణీల‌తో పాటు కర్ణాట‌కకు చెందిన బీద‌ర్, గుల్బ‌ర్గా, కొప్ప‌ల్, రాయ‌చూర్ జిల్లాలు హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగంగా ఉండేవ‌ని ఆయ‌న తెలిపారు.

Leave a Reply