Suryaa.co.in

Andhra Pradesh

భాష మార్చుకోవోయి… బడుద్ధాయ్‌

-లోకేష్‌కు అంబటి రాంబాబు హితవు
-లోకేష్‌ పిచ్చి వేషాలు, పిల్ల వేషాలు వేయొద్దు
-మాట అదుపులో పెట్టుకో. అరేయ్, తురేయ్‌ అంటే ఊర్కోం
-నీవు నోరు జారితే, మేము 10సార్లు నోరు జారుతాం
-మంత్రి అంబటి రాంబాబు హెచ్చరిక

-సద్విమర్శలు చేస్తే ఎదుర్కోవడానికి మేము సిద్ధం
-అంతే తప్ప, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊర్కునేది లేదు
-ఎక్కడా గెలవని బడుద్ధాయివి నీవు. తుక్కుగా ఓడిపోయావు
-నేను రెండుసార్లు గెల్చాను. ఆ విషయం గుర్తుంచుకో
-స్పష్టం చేసిన జల వనరుల శాఖ మంత్రి అంబటి

-ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ ఉపేక్షించబోదు
-ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదు చేశారు
-పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తూ సాగుతోంది
-ఎవరు తప్పు చేసినా సీఎం క్షమించబోరు
-పార్టీ వారైనా సరే, నిష్పాక్షిక దర్యాప్తు కోరుతారు
-ఇప్పుడూ అదే జరుగుతోంది. అయినా విమర్శలు
-ఇష్టానుసారం మాట్లాడుతున్న నారా లోకేష్‌
-మేము ఏమైనా అంటే మీడియా ముందు ఏడుస్తారు
-అందుకే సంయమనం పాటిస్తున్నాం
-ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

తాడేపల్లి:ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:
ఎవ్వరినీ వెనకుసుకురాం:
ఒక ఘటన జరిగింది. మీ అందరికీ తెలుసు. అనంతబాబు. వైయస్సార్‌సీపీ నాయకుడు. ఆ ప్రాంతంలో పార్టీలో కీలకమైన పాత్ర పోషించాడు. దాన్ని గుర్తించే జగన్‌, ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. అనంతబాబు తన డ్రైవర్‌ను చంపాడని ఆరోపణలు వచ్చాయి. డ్రైవర్‌ సుబ్రమణ్యం తల్లి, అనంతబాబు మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ప్రాథమిక సాక్ష్యాధారాల మేరకు ఆయన మీద 302 కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అనంతబాబు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ. అయినా తప్పు చేశాడన్న భావన కలిగినప్పుడు, చట్ట ప్రకారం ఆయనను శిక్షించాల్సిందే అని సీఎంగారు చెప్పారు. ఆయన దావోస్‌లో ఉన్నప్పటికీ ఈ విషయం మీద స్పష్టం చేశారు. అయినా ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. నిజానికి దీన్ని అభినందించాల్సి ఉంది. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. మేము ఎక్కడా ఎవరిని వెనకేసుకు రాలేదు.

లోకేష్‌ ఒక మొద్దబ్బాయి:
ఈ ఉదయం లోకేష్‌ ఏదేదో మాట్లాడారు. ఆయన ఉద్యమం చేస్తాడట. ఏ ఉద్యమాలు చేసి ఇంత మహానాయకుడివయ్యావా?
జగన్‌గారు తన మీద 14 కేసులు పెట్టారని, ఏం పీకుతారని లోకేష్‌ అన్నాడు. అసలు ఏముందని నీ దగ్గర పీకడానికి.నీవు ఒక మొద్దబ్బాయివి. మాట్లాడడం రాదు. ఇవాళ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు.

‘పండిత’ పుత్ర పరమ శుంఠ:
పండిత పుత్ర పరమశుంఠ. అది కూడా మా వాళ్లు ఒప్పుకోరు. మరి చంద్రబాబు పండితుడా అని అడుగుతారు. ఔను చంద్రబాబు పండితుడే.
అధికారం లాక్కోవడంలోనూ, మోసాలు చేయడంలో, వెన్నుపోటు పొడవడంలోనూ, డబ్బులు పంచడంలోనూ, సీట్లు కొనడంలోనూ, సీట్లు అమ్మడంలోనూ చంద్రబాబు పండితుడే. అలాంటి పండిత పుత్రుడు పరమశుంఠ అయిన నీవు ఇవాళ ఏదేదో ఏకవచనంతో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. పొట్టకోస్తే అక్షర ముక్క రాదు.
అక్కడ ఎక్కడో అమెరికాలో చదివాడట. అసలు చదివాడో లేకపోతే, స్విమ్మింగ్‌పూల్‌లో అమ్మాయిలతో బీర్‌ బాటిళ్లతో ఎంజాయ్‌ చేశాడో తెలియదు.

నీకసలు బుద్ది ఉందా?:
నన్ను గంట, అర గంట అంటాడు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? బడుద్ధాయివి నీవు. ఏమిటి గంట. అరగంట. నేను ఏమైనా తిరిగి అన్నాననుకో.. నీవు, మీ అమ్మ, మీ నాన్న మీడియాను పిల్చి వారి ముందు బోరుమని ఏడుస్తారు. అంతటితో ఆగరు. మళ్లీ ఎన్టీఆర్‌ కుటుంబం దగ్గరికి పోయి, నీ మేనమామలు, మీ అమ్మ సోదరీమణులతో మీడియా ముందు మాట్లాడించి నా మీద పడి ఏడుస్తారు.

ఒళ్లు తగ్గింది. బుర్ర పెరగలేదు:
అసలు నీవు టెన్త్‌ క్లాస్‌ అయినా పాస్‌ అయ్యావా? అంటే కనీసం ఒక్క ఎన్నికలో అయినా గెల్చావా. మంగళగిరిలో పోటీ చేస్తే పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టారు. ఏమిటా నీ మాటలు. ఏం పీకారు. వాడెవడు. వీడెవడు. ఒరేయ్‌. అరేయ్‌. తురేయ్‌. ఈ భాష మాట్లాడుతున్నావు. ఒళ్లు తగ్గింది కానీ బుర్ర పెరగలేదు. ఏం పోయే కాలం వచ్చింది. కాస్త మంచిగా మాట్లాడడం ఇప్పుడైనా నేర్చుకుంటే మంచిది.

వాళ్లేమనుకుంటున్నారో తెలుసా?:
అసలు నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విన్నావా. వారి సంగతి పక్కన పెట్టు. నువ్వు పొద్దున మాట్లాడుతుంటే నీ వెనక నిలబడిన మీ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసా.. ఏం మాట్లాడుతున్నాడురా ఈయన. మా పార్టీకి పట్టిన శని ఈయన. చంద్రబాబు తర్వాత ఈయన వారసుడని ప్రకటించిన తర్వాత మా పార్టీ మంట కలిసి పోతోంది అని లబోదిబో మంటున్నారు.

దమ్ముంటే గెల్చి చూపు:
ఎమ్మెల్సీని చేసి, ఏకంగా మంత్రిని చేశారు. పాలించే అవకాశం కల్పిస్తే, ఇష్టం వచ్చినట్లు పరిపాలించి, పప్పు అన్న పేరు సార్థకం చేసుకుని, మంగళగిరిలో తుక్కుతుక్కగా ఓడిపోయిన నీవు, ఇవాళ నా గురించి మాట్లాడుతున్నావు. నేను రెండుసార్లు గెల్చాను. ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచించు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊర్కోవడానికి ౖవైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, మా పార్టీ నాయకులు కానీ సిద్దంగా లేరు.
నీకు దమ్ముంటే ఒక్కసారి అయినా గెల్చి చూపు.

పోలవరంపై ఆనాడు ఏమన్నారు?:
మంత్రిగారికి టీఎంసీ అంటే తెలియదు అన్నావు. మరి నీకు తెలుసా.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆరోజు మీ నాన్న, అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. 2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు పోతామన్నారు. ఆ కోతలు కోసి ఏం చేశారు మీరు? మరి ప్రాజెక్టును పూర్తి చేశారా? అలాంటి బడుద్దాయిలు మీరు.
ఇక ఉమామహేశ్వరరావు అంటాడు, ఈ మంత్రికి ఏం తెలియదని. తాను 100సార్లు ప్రాజెక్టు దగ్గరికి పోయానని. పోయి ఏం చేశారయ్యా మీరు? చంద్రబాబు ప్రతి సోమవారం ప్రాజెక్టు దగ్గరకు పోయి వచ్చాడు. ఏం సాధించాడు? సింగడు అద్దంకి వెళ్లాడు. వచ్చాడు. ఏం సాధించాడు. అదీ అంతే.

ఆ పాపం మీది కాదా?:
ఏం చేశారు మీరు? ఆ నవయుగ దగ్గర. ఆ ట్రాన్స్‌ట్రాయ్‌ దగ్గర సంచులు మోసిన సన్నాసివి నీవు. ఇవాళ మాట్లాడుతున్నావా? 2018లో నీళ్లిస్తామని చెప్పిన మీరు ఆ పని చేయలేకపోయారు. కానీ మేము ఎప్పుడు నీరిస్తామో చెప్పాలా. చెబుతాం. తొందర ఏముంది?
మీరు చేసిన తప్పుడు పని వల్ల, మీరు చేసిన అశాస్త్రీయ పని వల్ల పోలవరం పనులు కుంటు పడ్డాయి. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నది. దీనికి కారణం ఎవ్వరు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాల వల్లనే ఆ డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్నది. ఏం చేయాలో ఇప్పుడు అర్ధం కావడం లేదు. మొన్న వెదిరే శ్రీరామ్‌తో సహా, సీడబ్ల్యూసీ నిపుణులు వచ్చి చూశారు. కానీ ఏం చేయాలో అర్దం కావడం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా గతంలో అలా జరగలేదు.

మీ దగ్గర సమాధానం లేదు:
దీనికి సమాధానం చెప్పమంటే, చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు పప్పు లోకేష్‌. సంచులు మోసిన సన్నాసి దేవినేని ఉమామహేశ్వరరావు. మీకు నిజంగా దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. ఏదేదో మాట్లాడుతున్నారు.

అది మీ వల్ల కాదు:
బడుద్ధాయిలు. బుద్ధి లేదు. సీఎంగారు గద్దె దిగాలి అంటున్నారు. జగన్‌గారు దిగిపోతే ఎక్కాలని మీరనుకుంటున్నారు. నీవల్ల, చంద్రబాబు వల్ల, తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ.. అందరూ కట్టకట్టుకుని వచ్చినా జగన్‌గారిని ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్‌గారు నిజాయితీతో, చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. తప్పు చేసింది తన పార్టీ నాయకులైనా క్షమించడం లేదు. ఆయన ఏనాడూ ధర్మం తప్పలేదు. అలాంటి నేతపై ఇష్టం వచ్చినట్లు లోకేష్‌ మాట్లాడుతున్నాడు.

ఫ్రస్టేషన్‌లో లోకేష్‌:
లోకేష్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. తనపై 14 కేసులున్నాయని విమర్శిస్తున్నాడు. కానీ గతంలో నామీద, కన్నబాబు మీద కూడా హెరిటేజ్‌ కంపెనీ కేసులు పెట్టింది. చంద్రబాబు ఆదేశాల మేరకు వారు కేసులు పెట్టారు. నేనూ అనగలను. ఏం పీకారని. ఏదైనా ఉంటే కోర్టుల్లో తేల్చుకోవాలి. అంతేకానీ అలా మాట్లాడతావా.
నీకు బుద్ది ఉందా. రాజకీయాల్లో పనికొస్తావా. నిన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ముందు పెట్టిన మీ నాన్న, ఇప్పుడు తానే రోడ్ల మీద తిరుగుతూ, తానే సీఎం అంటున్నాడు.

మీ పార్టీ వారే అంటున్నారు:
ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి పట్టిన శని అని స్వయంగా మీ పార్టీ వారే అంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆరో ఎవరో రావాలని వారే అనుకుంటున్నారు. జగన్‌గారిని ఎదుర్కోవడం లోకేష్‌ వల్ల కాదని టీడీపీ వారే చెబుతున్నారు.

నోరు జారితే ఊర్కోం:
ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ గెలవని ప్రబుద్ధుడు. రాజకీయంగా విమర్శిస్తే తప్పులేదు. ఆ విమర్శలు ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. అరేయ్, తురేయ్‌. అర గంట. గంట. ఇలాంటి మాటలు మాట్లాడితే ఊర్కోబోము. నీవు నోరు జారితే, మేము 10సార్లు నోరు జారుతాం.
మీరు సద్విమర్శలు చేస్తే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప, ఒకదానికి మరో సమాధానం.ఇలాంటి పిచ్చి వేషాలు, పిల్ల వేషాలు వేయొద్దని లోకేష్‌ను హెచ్చరిస్తున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అనంతబాబు మీద ఇప్పటికే 302 సెక్షన్‌తో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు పెట్టారు. ఆతణ్ని అరెస్టు చేశారు. తప్పు చేస్తే, మా పార్టీలో ఎవరినీ రక్షించబోము. ఎక్కడా మేము జోక్యం చేసుకోబోము. గతంలో టీడీపీ హయాంలో కేఈ కృష్ణమూర్తి కొడుకు తప్పు చేస్తే, ఎలా కాపాడారో చూశాం. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు.
నేను మరోసారి చెబుతున్నాను. జగన్‌గారిది సుపరిపాలన. అవినీతికి తావులేని పాలన. పారదర్శకంగా పథకాల అమలు. వివక్షకు తావు లేకుండా పథకాల అమలు.
మొన్న చంద్రబాబు మందుబాటిళ్లు చూపి, ఏది మంచిదో కాదో చెబుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన నీవు ఏ మందు ఏమిటన్నది సర్టిఫై చేస్తావా? బూమ్‌ బూమ్‌ బీర్‌ నీవు తెచ్చిందే కదా? మద్యాన్ని ప్రభుత్వమే అమ్మడం వల్ల ఎక్కడా అక్రమాలు జరగడం లేదు.
నిజానికి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? అలాగే సోము వీర్రాజు కూడా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలరా? అదే మేము అమలు చేస్తున్న పథకాల గురించి ఘనంగా చెప్పగలం. అందుకే ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియక.. ఊళ్లు తిరుగుతున్న చంద్రబాబు ఒకటే ఏడుపే ఏడుపు. ఇక తండ్రీ కొడుకులకు మిగిలింది ఏడుపే ఏడుపు.. అని మంత్రి శ్రీ అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE