Suryaa.co.in

Andhra Pradesh

రామోజీ, ఎల్లో మీడియా ఆరాటమే తప్ప..రాజకీయంగా బాబు బతకడు

– ఎత్తిపోతున్నాయ్.. అంటూ ఈనాడు విషం.. జూన్ లోనే నీళ్ళు ఇస్తుంటే రామోజీకి కనిపించదు
– డోనేకల్లు లిఫ్టు పథకం 1989లో ప్రారంభించి, అదే ఏడాది మూతపడితే దానికి జగన్ కారణమా..!?
– చంద్రబాబు హయాంలో, అంతకుముందు మూలనపడిన ప్రాజెక్టులన్నింటికీ జగన్ కారణమా రామోజీ…?
– వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉందన్న ఈనాడు రాతలు పచ్చి అబద్ధాలు, ఇది రామోజీ అబద్ధం
– ఈనాడు, ఎల్లో మీడియా అబద్ధాలు రాసినంత మాత్రాన.. ప్రజలు జగన్ కి దూరం కారు
– ఎవర్నో అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్న ఎల్లో మీడియా ప్రజలకు దూరమవుతోంది
– ఎన్నికలొస్తున్నాయని చంద్రబాబు పగటి కలలు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
– దుర్మార్గమైన రాజకీయాలు చేసిన పచ్చి మోసగాడు చంద్రబాబు
– జగన్ పరిపాలనలో ప్రతి గడపలో ఆనందం.. ప్రతి ఒక్కరిలో ఆనందం
– ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా.. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి
– చంద్రబాబు, దేవినేని ఉమాల అజ్ఞానం, తొందరపాటు చర్యల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది… రెండు, మూడు నెలల్లో పరిష్కారం
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే:
ముందుగానే సాగునీరు.. రైతులకు ఇది శుభపరిణామం
తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రైతులకు ఒక శుభవార్త అందించింది. చాలా ముందుగానే వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధాన కారణం వివిధ జలాశయాల్లో నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల, 1- రైతులకు త్వరగా నీళ్లు ఇవ్వడం వల్ల మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది. 2- తుఫానులు వచ్చే సమయానికే పండించిన పంటలను ఇంటికి చేర్చుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. రైతాంగం ఇందుకు సిద్ధంగా ఉండాలని పదే పదే రైతులకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటివరకూ గోదావరి, కృష్ణా డెల్టా, పెన్నా బేసిన్‌ లకు జులై, ఆగస్ట్‌లో నీళ్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు గోదావరి డెల్టాకు జూన్‌1న, కృష్ణా డెల్టాకు, పెన్నా బేసిన్‌కు జూన్‌ 10న నీళ్లు ఇచ్చేలా, నాగార్జున సాగర్ (ఎన్‌ఎస్పీ)కి జులై 15న నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతాంగం కాస్త ముందుగా మేల్కొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మాది రైతు ప్రభుత్వం.. 34 శాతం జీడీపీ వ్యవసాయంపైనే
– దానితో పాటు రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సమీకరించి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. మన రాష్ట్రంలో 34 శాతం జీడీపీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. దానికి తగ్గట్టుగా వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేస్తే అంత బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఫలితాలు వస్తాయని నమ్మిన ప్రభుత్వం మాది. మాది రైతు ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశాలను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి, రేపటితో అవి పూర్తవుతాయి. నీళ్లు విడుదల అయ్యేలోపే కాలువలను మరమ్మతులు చేసి, కాల్వల ద్వారా వ్యవసాయానికి నీటిని సక్రమంగా అందించేలా ఈఈ, ఎస్‌ఈలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి త్వరలో పూర్తి అవుతాయి. మొత్తంగా తీసుకుంటే ఇది శుభపరిణామంగా చెప్పుకోవాలి. ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇందుకు రెండు అంశాలు ప్రధానంగా చెప్పుకోవాలి. 1. ప్రభుత్వం చిత్తశుద్ధి. 2. జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉండటం. ఈ రెండింటి వల్ల రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. ఈ మహత్తర కార్యక్రమానికి రైతాంగం అంతా సిద్ధంగా ఉండాలి.

డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాబే బాధ్యత వహించాలి
రెండో విషయానికి వస్తే.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వల్ల పనులు కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. డయాఫ్రం వాల్‌ను ఏవిధంగా నిర్మించాలనే దానిపైనా, మరోవైపు వరద ఉద్ధృతి వల్ల డయాఫ్రం వాల్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటం, వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరం. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్లే ఇదంతా జరిగింది. దీనిపై జలశక్తి అడ్వైజర్‌ శ్రీరామ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీకి సంబంధించిన నిపుణులు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే కంక్లూజన్‌కు వచ్చి రీడిజైన్‌ చేసి ఆ గుంతలు పూడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

– డయాఫ్రం వాల్‌పై ఇప్పటికి కూడా సందిగ్ధత కొనసాగుతోంది. డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతిందా? లేదా అని తెలుసుకునే టెక్నాలజీ లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న సంఘటనలు చూడలేదు. తొలిసారిగా డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు, అప్పటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమావ అజ్ఞానం, తొందరపాటు చర్యలు, నిర్ణయాల వల్లే నూటికి నూరుపాళ్లు దెబ్బతిన్నది. దీనికి బాధ్యత వహించాల్సింది నారా చంద్రబాబు నాయుడు. డయాఫ్రం వాల్‌పై రెండు, మూడు నెలల్లోనూ కంక్లూజన్‌కు వస్తుందని భావిస్తున్నాం. దాని తర్వాత డయాఫ్రం వాల్‌ నిర్మాణమో లేక రిపేర్‌ చేసిన తర్వాత ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్లింగ్‌ డ్యామ్‌ను పూర్తి చేసి అనంతరం రైతులకు నీళ్లు అందిస్తాం. అది సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేస్తాం.

*ఎత్తిపోతున్నాయ్ అంటూ రామోజీ విషం కక్కాడు*
మూడో అంశానికి వస్తే… ఈనాడు దినపత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదనో, డ్యామ్‌ల గురించి సక్రమంగా పట్టించుకోవడం లేదనో, పోలవరం గురించి పట్టించుకోవడం లేదనో, పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు పోతే దాని ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదనో… ఇలా విషం కక్కాలనే ప్రయత్నం రామోజీరావు, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నారు. చిత్రమేమిటంటే.. ‘ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు’ అంటూ ఈనాడు పత్రిక ఈరోజు పెద్ద బ్యానర్ వార్త రాశారు. దానిలో సారాంశం ఏంటంటే.. రాష్ట్రంలో 250కి పైగా ఎత్తిపోతల పథకాలు, నిర్వహణ, నిధులు లేక దెబ్బతినిపోయాయని, దానికి కారణం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనేలా మామీద విషం చిమ్మే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఏ పత్రిక అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు ఆదరిస్తారు తప్ప, పక్షపాత ధోరణితో ఎవరినో అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో పనిచేసే పత్రికలు, మీడియా ప్రజలకు దూరం అవుతాయనేది గమనించాలి.

– ఇందుకు సంబంధించి ప్రభుత్వంపై ఎలా విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారంటే… మన రాష్ట్రంలో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి సుమారుగా 2వందల లక్షల ఎకరాలు ఉంది. ఇరిగేషన్‌ ద్వారా ఒక లక్షా 4వేల ఎకరాలను సాగు చేస్తున్నాం. ఇంకా 94లక్షల 63వేల ఎకరాలు వర్షాధారంగా పండుతోంది. జలయజ్ఞం కింద వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనేక ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అందులో 31 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని పెద్ద ప్రయత్నం చేపట్టారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీముల ద్వారా సుమారు 8లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. వీటికి సంబంధించి సుమారుగా 1032 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం వాటిని ఎస్టిమేట్‌ చేసి, నిర్మాణం చేసి ఆయుకట్టులో ఉన్న రైతాంగాన్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసి, వారికి ఆ నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. వాళ్లు నీటి తీరువాపై ఎకరానికి ఇంతని వసూలు చేసి, దానితో నిర్వహణ చేపడతారు. కరెంట్‌ బిల్లులు మాత్రం ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటిల్లో కొన్నిచోట్ల సరైన నాయకత్వం లేక కొన్ని ఎత్తిపోతల పథకాలు దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్నవాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. నిర్వహణ లోపం వల్ల కొన్ని కుంటుపడుతున్న మాట వాస్తవం.

జగన్ అధికారంలోకి వచ్చాకే ఎత్తిపోయాయా?
అయితే రాష్ట్రంలో 250 ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదని ఈనాడు రామోజీ రాశారు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డి అని రాశారు. ఈనాడు, ఎల్లో మీడియా, రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నాం. 250 స్కీములలో నిర్వహణ లోపాలు నిన్న, మొన్ననో, లేక జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాయా..? అని సూటిగా అడుగుతున్నాం. డోనేకల్లు ఎత్తిపోతల పథకం నిర్వహణా లోపం, నిర్వహణలో చొరవ లేకపోవడం వల్ల 1989లో ప్రారంభించి, అదే ఏడాదిలోనే మూతపడిందని రాశారు. 1989లో మూతపడిన దానికి జగన్‌ మోహన్‌ రెడ్డి కారణమా? అన్నది రామోజీ చెప్పాలి.

– మరి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా అఘోరించిన మీ పెద్ద మనిషి చంద్రబాబు ఉన్నాడు కదా? ఆయన హయాంలో రాయలేదేం? ఎన్నికలకు ముందు కూడా ఇదేరకమైన విషం చిమ్ముతూ జగన్‌ పై పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. అంటే అవి ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడును గెలిపిస్తారనే కదా?, కానీ 2019లో చంద్రబాబు గతి ఏమైందో చూశాం. 1989 నుంచి ఎన్నిసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆరోజు ఏమైనా ఇటువంటి రాతలు రాశారా రామోజీ?. జగన్ ప్రభుత్వంపై అనేక అబద్ధాలు రాసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడో మూలన పడిన ప్రాజెక్ట్‌లను గురించి ఇప్పుడు రాస్తారా? మరి చంద్రబాబు హయాంలో, ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను ప్రారంభించని ఆయన గురించి మాత్రం రాయరా? ఇవాళ రైతు రాజ్యం చేయాలనే దృక్పధంతో, రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంటే, ఎప్పుడూ ఇవ్వని విధంగా జూన్‌లోనే సాగు నీళ్లు ఇస్తుంటే ఆ మంచి మాత్రం రాయరు ఎందుకు? ఎప్పుడో మూలనపడిన ప్రాజెక్ట్‌లను జగన్‌ నెత్తిన రుద్ది విషం చిమ్మే కార్యక్రమం చేయడం ధర్మమేనా? మీరు రాస్తే అవాస్తవాలను ప్రజలేమీ నమ్మే స్థితిలో లేరు. ఆవిషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

– అలాగే ఫోటో వేసి వైఎస్సార్‌ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట-శ్రీరామ ఎత్తిపోతల పథకం అంటూ రాసిన రాతలు పచ్చి అబద్ధం. ఇది ఎల్లో మీడియా అబద్ధం, ఇది రామోజీరావు అబద్ధం. ఇది రామోజీరావు కక్కుతున్న విషం. సోమశిల నుంచి వాటర్‌ లిఫ్ట్‌ చేసి చెరువుకు పంపించి, ఆ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా తాగునీరు, సాగునీటికి అందించడం జరుగుతుంది. ఆ చెరువు నిండటంతో మోటార్లు ఆపివేశారు. చెరువు ఖాళీ అయితే మళ్లీ మోటర్లు వేసి నింపుతారు. అంతదానికే నిరుపయోగం, పనికిరావడం లేదంటూ పచ్చి అబద్ధాలు రాయడం సరికాదు కాదు.

రామోజీ, ఎల్లో మీడియా ఆరాటమే తప్ప…
చెల్లి ఆరాటమే తప్ప.. బావ బతకడు అన్నట్టుగా…. రామోజీరావు, ఎల్లో మీడియా ఆరాటమే తప్ప బాబు  రాజకీయంగా బతకడు. కారణం దుర్మార్గపు రాజకీయాలు చేసిన పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో, అబద్ధాలు రాసి ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మానుకుని వాస్తవాలు రాస్తే ప్రజలు మెచ్చుకుంటారు. అబద్ధాలు రాసినంత మాత్రాన జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు దూరం కారు. ప్రజలు జగన్‌ పక్షాన ఉన్నారు. చిత్తశుద్ధితో రైతులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పం తో చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం ఇది. రైతులకు త్వరగా నీళ్లు ఇచ్చి మూడు పంటలు పండించే విధంగా చేయాలని తాపత్రయపడుతున్నమా ప్రభుత్వంపై… పత్రిక ఉంది కదా అని ఫ్రంట్‌ పేజీలో రోజుకో స్టోరీ రాస్తూ బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దొంగ వార్తలను ప్రజలను నమ్మవద్దని కోరుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…
– ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నాడు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. చంద్రబాబు ఇప్పటి నుంచే ఎన్నికల మంట పెట్టుకుని చలి కాచుకుందామనుకుంటున్నాడు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమై వచ్చినా… జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి. ఎన్నికలు వస్తున్నాయి, అందరూ రండి, నా చుట్టూ కూర్చోండంటూ చంద్రబాబు పగటికలలు కంటున్నాడు. ఫైట్‌ చేస్తాను రండి అంటున్నాడు కదా? మరి ఫైట్‌ ఏది?

– గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల చెంతకు వెళుతున్నప్పుడు అద్భుతమైన స్పందన ఉంది, అయితే ఎల్లోమీడియాకు మాత్రం అది కనిపించదు. ఎక్కడో కాలువ బాగోపోతే దాన్నే హైలైట్‌ చేస్తున్నారు, ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే, దానికి సరిదిద్దుతాం. జగన్ పరిపాలనలో ప్రతి గడపలో ఆనందం.. ప్రతి ఒక్కరిలో ఆనందం నెలకొంది. ఇది సత్యం.

LEAVE A RESPONSE