Suryaa.co.in

Andhra Pradesh

శవాల మీద చిల్లర రాజకీయాలేంటి పవన్ కల్యాణ్..!?

– నిరూపించమంటే.. బాబు జేబులో దాక్కుని నిందలా?
– ఇప్పటికైనా నా సవాల్ కు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి
– లంచం అడిగానని నిరూపిస్తే.. పదవిని తృణప్రాయంగా వదిలేస్తా
– సత్తెనపల్లిలో 12 మంది రైతులు ఆత్మహత్యలకు సంబంధించి రూ.84 లక్షల పరిహారం అందించాం.
– రైతుల ఆత్మహత్యల పరిహారంలో ఒక్క రూపాయి అవినీతికి తావులేదు
– శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

టీడీపీకి తొత్తు పార్టీగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి రైతుల ఆత్మహత్యల పరిహారంలో, నేను లంచాలు తీసుకుంటున్నానని పిన్ పాయింటెడ్ గా ఆరోపణలు చేస్తే… వాటిని నిరూపించమని నేను సవాల్ విసిరితే, నిరూపించకుండా పారిపోయాడు. పవన్ కల్యాణ్ అనుచరులు మాత్రం నేనేదో అవినీతికి పాల్పడ్డానని సంబంధం లేని వ్యక్తులను తెచ్చి, నాపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరి దగ్గరో నేను డబ్బులు డిమాండ్ చేశానని, నా నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ముసుగులు వేయించి నామీద ఆరోపణలు చేయిస్తూ, ఎల్లో మీడియాలో, వాటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నేను ఇప్పటికీ సవాల్ విసురుతున్నాను. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లుగా, నేను రైతుల ఆత్మహత్యల పరిహారంలో ఒక్క పైసా అయినా అవినీతికి పాల్పడ్డానని, లంచం అడిగానని నిరూపిస్తే, నా పదవులను తృణప్రాయంగా వదిలేయడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను. అలాకాకుండా, సంబంధం లేని తప్పుడు ఆరోపణలతో నాపై నిందలు వేసి, శవాల మీద చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదని జనసేన పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాను.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి కుటుంబాలకు పరిహారంగా ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలు చొప్పున మొత్తం 84 లక్షలు పరిహారంగా ప్రభుత్వం అందించింది. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. కానీ, పవన్ కల్యాణ్ వచ్చి.. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అంబటి రాంబాబు అని నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

రైతుల ఆత్మహత్యల విషయంలో బాధిత కుటుంబాల వద్ద నుంచి, తాను ఒక్క పైసా అయినా తీసుకున్నానని, నిరూపించలేకపోయినా, కనీసం బాధిత కుటుంబాలతో చెప్పించినా రాజీనామా చేస్తానని చెప్పాను. దానికి పవన్ కల్యాన్ నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. ఇంతవరకూ సమాధానం చెప్పే ధైర్యం పవన్ కల్యాణ్ కు లేదు. నేను విసిరిన సవాల్ కు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి.
చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు నిత్యం బాకాలు ఊదే టీవీ చానళ్ళు టీవీ 5, ఏబీఎన్, మహా టీవీ, ఈటీవీ, ఈనాడు లు నిన్నటి నుంచి నాపై పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు.

– ” నేను కక్కుర్తి పడితే.. రాజీనామా చేసి అవతలపడేస్తా. నేను శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని కాదు. ప్రజల డబ్బులను కాజేయాలనే దుర్బుద్ధి నాకు లేదు. నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నా. గతంలో ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబుకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసు.”

పవన్ కల్యాణ్ లా పార్టీని పెట్టి.. దానిని చంద్రబాబు పాదాల వద్ద పెట్టి, ఆయన వద్ద క్యాష్ రూపంలో ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయం నేను చేయను. ఒకే పార్టీని, ఒకే కుటుంబాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాను.మరణించిన రైతు కుటుంబాల నుంచి 2 లక్షలు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితిగానీ, ఖర్మగానీ నాకు పడితే.. నా పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను తప్పితే అవినీతికి పాల్పడను.

వాస్తవాలను వక్రీకరిస్తూ, ఇప్పుడు ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్న వీడియోకు సంబంధించిన వాస్తవం ఏమిటంటే- సత్తెనపల్లిలోని న్యూ వినాయక రెస్టారెంట్ బిల్డింగ్ లో ఆగస్టు 20, 2022న సెప్టిక్ ట్యాంకు సంపు నిండటంతో… దానిని క్లీన్ చేయించడానికి ఆ బిల్డింగ్ యజమాని కందకట్ల కొండలరావు ఇద్దరు కార్మికులను పనికి పిలిచాడు. క్లీనింగ్ సమయంలో గ్యాస్ లీకై, కార్మికులతోపాటు, వారిని కాపాడేందుకు వెళ్ళిన ఇంటి యజమానితో సహా మొత్తం ముగ్గురూ మరణించారు. ఈ ఘటనలో మరణించిన యువకుడు అనిల్ తల్లిదండ్రులు మాట్లాడుతున్న వీడియోలనే ఎల్లో మీడియా ట్రోల్ చేస్తుంది. రైతుల ఆత్మహత్యల పరిహారంతో అసలు సంబంధమే లేని, ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంక్ మృతుల పంచాయితీకి ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఘటన జరిగిన రోజు, సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంలో మరణించిన వారి బంధువులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదే ప్రమాదంలో చనిపోయిన బిల్డింగ్ యజమాని మృతదేహాన్ని కదలనివ్వకుండా ఆందోళన చేస్తుండటంతో, ఆ విషయాన్ని హైదరాబాద్ లో ఉన్న తన దృష్టికి స్థానిక పార్టీ నేతలు తేవడంతో, సావధానంగా దానిని పరిష్కరించమని చెప్పాను. చనిపోయిన కార్మికుల కుటుంబాల దగ్గర మట్టి ఖర్చుకు కూడా డబ్బులు లేని పరిస్ధితుల్లో ఆ బిల్డింగ్ యజమాని కుటుంబం నుంచి, తిరిగి ఇచ్చేవిధంగా ఆ రెండు కుటుంబాల వారికి స్థానిక నేతలు రూ. 5 లక్షలు తక్షణ పరిహారంగా ఇప్పించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు చొప్పున ఇప్పిస్తానని నేను ఆరోజు బాధిత కార్మిక కుటుంబాలకు హామీ కూడా ఇచ్చాను. అది ప్రొసీజర్ లో ఉంది.

ఇది మూడు శవాలకు సంబంధించిన పంచాయితీ. ఒక శవం దగ్గర నుంచి.. మరో రెండు శవాలకు డబ్బులు కట్టించమంటున్నారు. బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా, నా నియోజకవర్గ ప్రజలకు వచ్చిన కష్టాన్ని చూసి, నేను న్యాయంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. రైతుల ఆత్మహత్యలతో సంబంధం లేని ఈ పంచాయితీని తీసుకొచ్చి జనసేన నేతలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టుగా ట్రోలింగ్ లు చేయడం దుర్మార్గం. ఇందులో నేను 2 లక్షలు తీసుకుని శవాల మీద పేలాలు ఏరుకున్నానా.. ?. ఇందులో నేను ఎక్కడైనా కక్కుర్తి పడ్డానా.. చనిపోయిన వారి కుటుంబాల నుంచి డబ్బులు తీసుకునే నీచమైన మనస్తత్వం నాది కాదు. చేతనైతే నిరూపించండి. గత టీడీపీ దుర్మార్గపు పాలన నుంచి.. సత్తెనపల్లి ప్రజలకు మంచి చేస్తున్న నాపైన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తారా..?.

నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీతులు చెబుతున్న పవన్ కల్యాణ్ గురించి ఇక్కడ మరో విషయం చెప్పాలి. గతంలో కుంకులకుంట కు పవన్ కల్యాణ్ వస్తున్నాడని, మా కాపు కులానికే చెందిన, ఆయన అభిమాని మట్టం బుజ్జి కొడుకు మట్టం అశోక్ అనే యువకుడు.. మోటార్ బైక్ పై స్పీడ్ గా వెళుతూ.. రెడ్డిపాలెం వద్ద యాక్సిడెంట్ కు గురై చనిపోయాడు. ఆ యువకుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, పవన్ కల్యాణ్ పరామర్శిస్తారని, చనిపోయిన ఆ యువకుడి పేరు మీద స్కాలర్ షిప్పులు ఇస్తామని హామీలు ఇచ్చారు.

మొన్న పవన్ కల్యాణ్ మా నియోజకవర్గంలోని ధూళిపాళ్ళకు వచ్చి.. అతని కోసం అమరుడైన యువకుడు అశోక్ కుటుంబాన్ని.. కూతవేటు దూరంలో ఉన్నా పలకరించలేకపోయాడు. ఆర్థిక సాయం చేస్తామని నాదెండ్ల మనోహర్ పిలిచాడని, ఆ యువకుడి తండ్రి తన కొడుకు ఫోటో పట్టుకుని వస్తే.. పోలీసులు, తమ అనుచరులతో బయటకు గెంటేశారు.

జనసేన కోసం ప్రాణాలర్పించిన ఓ యువకుడి గాథ ఇది. ఇదీ పవన్ కల్యాణ్ కుసంస్కారం. అటువంటి నీవు, నా గురించి మాట్లాడతావా..? సత్యం పలికే గడ్డ సత్తెనపల్లి.. ఇక్కడకు వచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడిన పవన్ కల్యాణ్ కు పుట్టగతులు ఉండవ్.. అని మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.

LEAVE A RESPONSE