– తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
– నేరుగా త్రివిక్రమ్‌ను హెచ్చరించిన అంబటి
– ఖండించని సినీ పెద్దలు
– బ్రో సినిమాలో తన డాన్సును ఇమిటేట్ చేయడంపై అంబటి ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ సర్కారు తన ప్రత్యర్ధులను వివిధ మార్గాల్లో దారికి తెచ్చుకునే పనిలో పడింది. అందులో భాగంగా
మంత్రి అంబటి రాంబాబు సినీరిశ్రమకు హెచ్చరిక జారీ చేశారు. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో, తన పాత్రను అనుకరిస్తూ ఉన్న పాత్రపై అంబటి మండిపడ్డారు. దానితో పవన్‌ను తూర్పారపడుతూ ప్రెస్‌మీట్ పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది.
కానీ వారిని హెచ్చరిస్తూ అంబటి చేసిన హెచ్చరికలు సంచలనం సృష్టించాయి. ఇకపై ఎవరన్నా దర్శకులు, నిర్మాతలు, త్రివిక్రమ్ లాంటి రచయితలు ఇలాంటి పనులు చేస్తే.. ‘తగిన మూల్యం’
చెల్లించుకోవలసి ఉంటుందని నేరుగా హెచ్చరించడం చర్చనీయాంశమయింది. ‘తగిన మూల్యం’ అంటే ఏమిటో మంత్రి రాంబాబు చెప్పకపోయినా, ఆయన హెచ్చరికలు ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది. సినిమా తీసిన నిర్మాత, దర్శకులపై భౌతిక దాడులకు దిగుతారా? లేక వారి సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా ఆపుతారా? అన్న విషయాన్ని మంత్రిగారు వివరించలేదు.
అయితే మంత్రి రాంబాబు హెచ్చరికలపై.. తెలుగు సినీ పెద్దలెవరూ ఇప్పిదాకా, స్పందించకపోవడమే ఆశ్చర్యం. సహజంగా సినిమా పరిశ్రమపై ఈగ వాలితే సహించని సినీ పెద్దలు.. తమది కళామతల్లి
కుటుంబమని మైకులు పగలకొట్టే నటులు… తమను రాంబాబు నేరుగా మీడియా ముఖంగా హెచ్చరించినా, స్పందించకుండా మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.