కాలగతిలో ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం శాశ్వతం అనుకునే వారు. 250 ఏళ్ళ ఆధిపత్యం తరవాత అది కుప్పకూలి పోయింది. ఈ కాలంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే అన్ని వందల ఏళ్ళు అక్కర్లేదు. చరిత్రలో వందల ఏళ్ళు తీసుకున్న విషయాలు ఇప్పుడు కొద్ది దశాబ్దాల్లోనే ౙరిగిపోతున్నాయి.
అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించుకోబోతున్నది. ఇది ఖాయం. అయితే ఇందుకోసం అమెరికా పతనం కానక్ఖర్లేదు. దాని స్థితిగతులతో సంబంధం లేకుండా దాన్ని మించి చైనా తన మానాన తాను శరవేగంతో దూసుకు పోతోంది. దాని స్పీడ్ అందుకోవడం ఏ దేశం వల్లా కావడం లేదు. ఫలితంగా 2050 తర్వాత అమెరికా కనీసం వార్తల్లో కూడా తఱచూ వినిపించడం మానేస్తుంది.
అమెరికా ఇలాగే ఉంటుందన్న నమ్మకం అమెరికన్లకే లేదు. కానీ మన దేశంలోని అమెరికా భక్తులు మటుకూ అమెరికా శాశ్వతంగా అజేయ శక్తి అని నమ్ముతారు. 25 ఏళ్ళ నాటి సుసంపన్నమైన శక్తిమంతమైన అమెరికా ఇది కాదు. ఇదేదో వేఱే అమెరికాలా ఉంది. మనవాళ్ళు అనుకుంటున్నంత గొప్ప, అదిరిపోయే వనరులు అమెరికాలో ఏమీ లేవు.
అవేవో చైనాలోనూ రష్యాలోనే ఉన్నాయి. బహుశా మన దగ్గరా ఉండే ఉంటాయి. సరిగా తెలియకా, త్రవ్వుకోవడం చేతఁగాకా మనం ఇలా ఉన్నాం. అమెరికా దగ్గర కొంత పెట్రోలియమూ, షేల్ గ్యాసూ ఉన్న మాట నిౙమే కాని, అవి తగినంత ఉపయోగపడే మాటైతే వాళ్ళ పరిశ్రమలన్నీ చైనాకి ఎందుకు పాఱిపోతాయి? అవి తగినంత లేవని తెలుసు కాఁబట్టే ట్రంపుగారు కెనడా, గ్రీన్ లాండ్ భూభాగాల కోసం అఱ్ఱులు చాస్తున్నారు. అక్కడ వనరులు దండిగా ఉన్నాయి.
నిజానికి అమెరికా తన ఆర్థిక పతనపు అంచుకు కేవలం 10 – 15 అడుగుల దూరంలోనే ఉంది.
(1) అమెరికా యొక్క బృహత్ పరిశ్రమలన్నీ క్రీ.శ. 2000 తరవాత చైనాకి తరలిపోవడంతోనే అమెరికా పతనం మొదలైంది.
(2) ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా లాంటి అనవసర యుద్ధాల ఖర్చులతో అమెరికా బొక్కసం వట్టిపోయింది.
తాజా వార్త
(3) అమెరికాలో నిరుద్యోగ సమస్య గత 17 సంవత్సరాల నుంచి ముమ్మరంగా చెలరేఁగిపోతోంది. దాన్ని ఎలా విడఁదెంచాలో ఏ పార్టీకీ ఏ అధ్యక్షుడికీ అర్థం కావడం లేదు. ఎక్కడైనా క్రొత్తగా ఒక లక్ష ఉద్యోగాలు ఏర్పడితే దేశమంతా పండగ చేసుకునే వాతావరణం ఉందక్కడ. అమెరికా ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాని మూలాన దేశీయ రెవెన్యూకి సైతం గండిపడే ప్రమాదం ఏర్పడింది. అందుకని రాఁబడి పన్ను (income tax) రద్దుచేసి విదేశీ వస్తు దిగుమతుల మీఁద వచ్చే సుంకాల డబ్బుతో ప్రభుత్వాన్ని నడిపించాలనే బ్రిలియంట్ ఐడియాలో ఉన్నారు శ్రీమాన్ ట్రంపుగారూ, ఆయన పార్టీవారూ.
(4) $ 37 లక్షల కోట్ల అప్పు గల అమెరికా ప్రపంచంలోకెల్లా కడుపెద్ద ఋణగ్రస్త దేశం. ఆ అప్పుల నుంచి బయట పడాలన్నా, వాటి మీఁద వడ్డీ చెల్లించాలన్నా డాలర్లు అచ్చేసి ఇవ్వడం తప్ప అమెరికా ప్రభుత్వానికి వేఱే దారి లేదు. కాని చూస్తూ చూస్తూ అలా చెయ్యలేరు. చేస్తే – 1929 నాటి Great Depression పరిస్థితులు పునరావృత్తమయ్యే ప్రమాదం ఉంది. సర్వనాశనం. ఆత్మహత్యా సదృశం.
(5) ప్రస్తుతం అమెరికన్ సమాజం ఒక గొప్ప సంక్షోభం (crisis) లో ఉంది. పైకి కనపడని అదృశ్య సంక్షోభం. నిశ్శబ్ద సంక్షోభం. అదేమంటే – ఆ దేశంలో రమారమి సగం మంది మహిళలు ఫెమినిస్టులైపోయారు. మగవాళ్ళు కూడా దాదాపు సగం మంది స్త్రీద్వేషులైపోయారు. ఫలితంగా ఆడా-మగా పెళ్ళిళ్ళు తగినన్ని ౙరగడం లేదు. కాని పెళ్ళి లోపలో బయటో – పిల్లలైతే కొందఱు పుడుతున్నారు. కాని వాళ్ళలో సగం మందిని ప్రభుత్వమే పోషించాల్సి వస్తోంది. మొత్తమ్మీఁద అక్కడ తెల్ల జనాభా పెరుగుదల ఆశాజనకంగా లేదు.
అమెరికా జనాభా పెరుగుదలకు – వచ్చే వలసారులే ప్రధాన దోహదం. ఎవఱూ రాకపోతే దీర్ఘకాలికంగా ఇబ్బందే. జనం లేనప్పుడు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్య. 10 ఎకరాల స్థలంలో ఇద్దఱు మొగుడూ పెళ్ళాలు కాపరం ఉండడాన్ని ఊహించుకోండి. కడు తక్కువ జనాభాతో కడుపెద్ద దేశాల్ని మెయిన్ టెయిన్ చేయడం కష్టసాధ్యం. అలాంటి దేశాలకు వర్తమానం ఉంటుందేమో గాని భవిష్యత్తు ఉండదు.
(6) అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు వడివడిగా ఖాళీ అయిపోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో పలు గ్రామాలూ, పట్టణాలూ భూత పురాలుగా, అడవులుగా మారుతున్నాయి.
(7) జనాభా పెద్దగా లేని సువిశాల అమెరికాలో ఇళ్ళ సమస్య అత్యంత తీవ్రంగా పరిణమించింది. ఇదో విరోధాలంకారం. ఒకప్పుడు నడిమి తరఁగది వారు సైతం 1000 చ.అ. – 2,000 చ.అ. పెద్ద పేద్ద ఇళ్ళలో కాపరముండే దేశంగా పేరెన్నిక గన్న అమెరికాలో – ఈ రోజున జనసామాన్యం $ 10 – 20 వేల లోపలి వెలకు దొరికే Tiny homes (300 – 450 చ.అ.) కోసం ఎంతో తపన పడుతున్నారు. ఇది వినడానికే చాలా బాధ కలిగిస్తుంది.
నేను ఈ మాట ఇంత బాహాటంగా వ్రాయడానికి సంకోచిస్తున్నాను. ఇబ్బంది పడుతున్నాను. సగటు అమెరికన్ల కొనుగోలు శక్తి అలా దారుణాతి దారుణంగా పడిపోయింది. 300 – 450 చ.అ. అంటే – మన దేశస్థుల దృష్టిలో – కటిక పేదవాళ్ళు ఉండే ఇళ్ళ క్రింద జమ.
ఆ Tiny homes ని సైతం కొనలేక పేవుమెంట్ల మీఁదే బ్రతుకులు వెళ్ళదీస్తున్న అభాగ్యులు అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 7,70,000 మంది ఉన్నారు. వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఉండొచ్చునని మేధావుల అంచనా.
కానీ వాళ్ళెవఱికీ బాసట ఇచ్చే పరిస్థితిలో సూపర్ పవర్ అని పిలవఁబడే యునైటెడ్ స్టేట్స్’ ప్రభుత్వం లేదు. ఎందుకంటే కార్యాలయాలకు అద్దెలు కట్టలేకా, జీతాలు ఇవ్వలేకా కొన్ని ప్రభుత్వ శాఖల్ని ఏకమొత్తంగా ఎత్తేయడమో, ప్రైవేటీకరింౘడమో, రాష్ట్రాలకు అప్పగింౘడమో చేయాలని ట్రంపు గారు ప్రతిపాదిస్తున్నారు. అందులో భాగంగా – ఇప్పటికే సంయుక్త రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తన విద్యాశాఖను పూర్తిగా ఎత్తేసింది.
(8) లోఁగడ అమెరికా ఏ మేధాశక్తితో పైకి వచ్చిందో ఆ మేధాశక్తి వాస్తవంగా అమెరికాది కాదు. అది వలసారుల మేధాశక్తి. అయితే ట్రంపుగారు “మాకు వాళ్ళూ వద్దు, వాళ్ళ మేధాశక్తీ వద్దు” అంటున్నారు గనుక భవిష్యత్తులో మేధావులెవఱూ అమెరికా వెళ్ళి ఆ దేశాన్ని సుసంపన్నమూ శక్తిమంతమూ చేయరు. వాళ్ళంతా ఇండియా-చైనాలకే వెళతారు.
(9) ఏ అగ్రరాజ్యానికైనా బంధుమిత్రులే వెయ్యేనుగుల బలం. అణ్వాయుధాలతోనూ, లక్షలాది సైనికులతోనూ ఒరిగేది అత్యల్పం. ట్రంపు గారి అమెరికా ఉద్దేశ పూర్వకంగా సప్రయత్నంగా అలాంటి దేశాలన్నిటినీ దూరం చేసుకుంటోంది గనుక – వాళ్ళంతా ప్రస్తుతం ఇండియా, చైనాల చుట్టూ మూగుతున్నారు.
(10) BRICS విస్తరించి, BRICS కరెన్సీ అమల్లోకి వస్తే అమెరికా ప్రాధాన్యానికి తెఱ పడుతుంది. ఎందుకంటే అమెరికన్ డాలరుకు BRICS కరెన్సీ తో పోటీపడే సత్తా ఉండదు. దాని అంతర్జాతీయ విలువ క్షీణించడం చేత ఇప్పటిలా ప్రపంచమంతా తన ఉత్పాదనల్ని అమెరికాకి చవగ్గా ఎగుమతి చేయను ఉత్సహింౘదు. ఫలితంగా అమెరికాలో ఆహారమూ, వస్తువులూ, సేవలూ విపరీతంగా ఖరీదైపోయి ఆ దేశంలో గణనీయ జనాభా పేఁదఱికంలోకి జాఱుకుంటుంది.
– మర్రిపూడి సుబ్రమణం