– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : అమెరికా నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో.. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల అమెరికా పెంచిన సుంకాలు, హెచ్ 1 బీ వీసాలపై విధించిన కఠిన నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చేయటంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. తెలంగాణకు వచ్చిన అమెరికా ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఇండస్ట్రిస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రతినిధులు 16 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ సారధ్యంలో ఈ ప్రతినిధి బృందం భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలు స్వీకరిస్తోంది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా అందరినీ ఆకర్షిస్తోందని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీ పడుతోందని, మన మౌలిక సదుపాయాలు, తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ప్రపంచ ప్రమాణాలకు సవాలుగా ఉందని ఆయన అన్నారు.
జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని, 2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ లో గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చర్ జోన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి పొరుగున ఉన్న ఏపీలో మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ కనెక్టివిటీ ఉండేలా రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి అటు చైన్నై వరకు, ఇటు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని అన్నారు. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అభివృద్ధి చేస్తామని, సిటీలో ఇప్పుడున్న మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
30 వేల ఎకరాల్లో హైదరాబాద్ లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని, మొత్తం 500 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని, ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
హైదరాబాద్‌లో ఏఐ సిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే స్కిల్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఇప్పటికే పేరొందిన కంపెనీలు హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు చేశాయని, వీటిని గ్లోబల్ వాల్యూ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు.
హైదరాబాద్ నుండి వచ్చే కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లలో ప్రధాన వాటాను సరఫరా చేశాయని, స్వదేశీ కంపెనీలను మరింతగా పెంపొందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నొక్కి చెప్పారు.
హడ్సన్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి, వాల్ స్ట్రీట్ జర్నల్ కాలమిస్ట్ ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్, రేషనల్వేవ్ క్యాపిటల్ పార్టనర్స్ సీఈవో మార్క్ రోసెన్‌బ్లాట్, క్రౌ హోల్డింగ్స్ చైర్మన్ హర్లాన్ క్రో, ఈగిల్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు రావెనెల్ కర్రీ, బిల్లింగ్స్లీ కంపెనీ భాగస్వామి హెన్రీ బిల్లింగ్సీతో పాటు మొత్తం 16 మంది అమెరికా ప్రతినిధి బృందంలో ఉన్నారు