హార్మూజ్ జలసంధిని తెరిపించటానికి అమెరికాకు సహాయం చేయకపోతే, “నాటో కూటమి దేశాల భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది” అంటూ నాటో దేశాలను బెదిరిస్తున్నాడు ట్రంప్. అమెరికా కల్పించిన రక్షణను ఉపయోగించుకుంటూ అవసరమైనప్పుడు వెనకడుగు వేయటం ఇకపై సాగదు అని సాగదీస్తున్నాడు. నాటో అనేది కేవలం “వన్ వే స్ట్రీట్”లా మారిపోయింది అని కూడా వాపోయాడు.
యుద్ధం మొదలుపెట్టేటప్పుడు ఎవరినీ సలహా అడగని, సంప్రదింపులు జరపని ట్రంప్, ఇప్పుడు అందరూ తలా ఒక చెయ్యి వేయాలి అని “హెచ్చరిస్తున్నాడు”. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం ముదిరి పాకాన పడి, హార్మూజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసివేశాక, ఇప్పుడు ప్రపంచదేశాల బాధ్యత అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు.2019లోనే హార్మూజ్ జలసంధి మార్గంలో పయనించే వాణిజ్య నౌకలకు రక్షణ పేరుతో ‘ఆపరేషన్ సెంటినెల్’ అంటూ అమెరికా ప్రతిపాదించి, బహ్రెయిన్ కేంద్రంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ప్రారంభంలో బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్బేనియా ఇందులో చేరాయి. ప్రారంభంలో బ్రిటన్ అమెరికా వ్యూహంతో చేయి కలిపినప్పటికీ, తరువాత తన వాణిజ్య నౌకలకు రాయల్ నేవీ ద్వారా రక్షణ కల్పించుకుంటూ వస్తున్నది. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు అమెరికా నేతృత్వంలోని కూటమిలో చేరటానికి ఇష్టపడలేదు. దానికి ప్రధాన కారణం ఇరాన్‌తో అణు ఒప్పందం నుండి ట్రంప్ తప్పుకోవటం. మొదటి పర్యాయం ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదలైన ఈ ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరటంతో ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి.
యుద్ధం మొదలవటానికి ముందు సైనికచర్య తీసుకుంటాం అని ట్రంప్ బెదిరించారు. హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్ కూడా ఊహించలేదు. జలసంధిని మూసివేయటం వలన ప్రపంచదేశాలకు ఎంత నష్టమో, ఇరాన్‌కు కూడా అంతే నష్టం కాబట్టి జలసంధిని మూసివేయదు అనేది ట్రంప్ భావన. ఇరాన్ తెగించగానే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ద్వారా ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ట్రంప్ ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదు. సహాయం చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని చెప్పింది కానీ, నేరుగా యుద్ధంలో పాల్గొనటానికి సుముఖంగా లేదు బ్రిటన్.
మధ్యధరా సముద్రంలోనూ, ఎర్ర సముద్రంలోనూ తన యుద్ధనౌకలను మోహరించింది కానీ హార్మూజ్ జలసంధి విషయంలో తటస్థంగా ఉండిపోయింది ఫ్రాన్స్. వారి రాజ్యాంగం ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి అంటూ జపాన్, ఆస్ట్రేలియా తమ యుద్ధనౌకలను పంపించటానికి తిరస్కరించాయి. ట్రంప్ తన నమ్మిన బంటు ఇజ్రాయెల్ కోసం మొదలుపెట్టిన ఈ యుద్ధం వలన ప్రపంచదేశాల పరిస్థితి ఇలా ఉంటే, నాలుగు సంవత్సరాలుగా నడుస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు సంభవించాయి.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి నాటో దేశాల మద్దతు రాకపోవటం వలన ట్రంప్‌లోని చిల్లర మనిషి బయటకు వచ్చాడు. ఉక్రెయిన్‌కు తాను చేసిన సహాయాన్ని అడ్డం పెట్టటం మొదలుపెట్టాడు. రష్యా నుండి భారతదేశం చమురు కొనటం వలనే రష్యాకు నిధుల వెసులుబాటు ఉంటున్నదని, భారతదేశాన్ని సుంకాలతో బెదిరించి, రష్యా నుండి చమురు కొనకుండా చేసిన అమెరికా, ఇప్పుడు రష్యా నుండి కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఉక్రెయిన్‌కు తాను చేస్తున్నానని చెప్పుకుంటున్న సహాయం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ట్రంప్ తన స్నేహితుడు అని చెప్పుకోవటానికి ఎవరైనా సిగ్గుపడతారు.
మార్చి 15 నాడు ట్రంప్ తన ఇంటర్వ్యూలో “ఉక్రెయిన్ మాకు వేల మైళ్ళ దూరంలో ఉన్నది. అయినా వారికి మేము సహాయం చేశాము. ఇప్పుడు మాకు మరియు ప్రపంచానికి అవసరమైన హార్మూజ్ జలసంధి విషయంలో నాటో దేశాలు వెనకడుగు వేయటం సరికాదు” అని నాటో దేశాలను విమర్శిస్తున్నాడు. ఇలా గుర్తు చేస్తూ నాటో దేశాలు యుద్ధనౌకలను పంపాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగటానికి, శాంతి చర్చలు ఆగిపోవటానికి జెలెన్స్కీ వ్యవహారశైలి కూడా కారణమంటూ, యుద్ధం ముగింపుకు ఉక్రెయిన్ సరిగా కృషి చేయకపోతే అమెరికా ఉదారంగా అందిస్తున్న సహాయం ఆపేస్తాం అంటూ హెచ్చరించాడు. ఏది నోటికి వస్తే అది మాట్లాడే తెంపరితనం అంటే ఇదే.
ట్రంప్ ఉక్రెయిన్ అంశాన్ని హార్మూజ్ జలసంధితో ముడిపెట్టటంతో ఐరోపా దేశాలు కొంత ఆందోళనకు గురి అవుతున్నట్లే ఉన్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం కొంత ఘాటుగానే స్పందించాడు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లో వస్తున్న అస్థిర పరిస్థితుల వలన తనపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం దృష్టిలో పెట్టుకుని ట్రంప్, రష్యా పైన ఉన్న ఆంక్షలను ఎత్తివేయటాన్ని జెలెన్స్కీ తీవ్రంగా ఖండించాడు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వలన రష్యాకు పది బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని, తమపై యుద్ధానికి రష్యాకు అలా నిధులు సమకూరుస్తున్నారు అంటూ జెలెన్స్కీ విరుచుకుపడ్డాడు. హార్మూజ్ జలసంధి విషయంలో నాటో దేశాలను ట్రంప్ బెదిరించటాన్ని ‘బ్లాక్ మెయిల్’ గా అభివర్ణించారు జెలెన్స్కీ. ఐరోపా దేశాలు ఇంధనం కోసం రష్యా లేదా ఇరాన్ మార్గాలపై ఆధారపడేలా చేయటం కంటే, ఉక్రెయిన్ ద్వారా జరిగే ఇంధన రవాణాను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం సరికాదు అంటూ జెలెన్స్కీ ట్రంప్ అవకాశవాదాన్ని ఎండగట్టారు.
మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తుంటే, ఉక్రెయిన్ను రక్షణపరంగా ఇరకాటంలో పడేసింది. రష్యాతో యుద్ధం ముగింపుకు జెలెన్స్కీ ముందుకు రావాలని ట్రంప్ చేస్తున్న ఒత్తిడికి సమాధానంగా, తమ భూభాగాన్ని కోల్పోయే ఎటువంటి శాంతి చర్చలను ఉక్రెయిన్ పౌరులు ఒప్పుకోరు అని స్పష్టం చేశారు జెలెన్స్కీ. అనూహ్యమైన రీతిలో చైనా మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతి అత్యధికంగా చేసుకునే దేశాలలో చైనాది ప్రథమ స్థానం.
అధికారికంగా అమెరికాతో చేతులు కలపకపోయినా, తన వ్యాపార నౌకల రక్షణ కోసం తన నౌకాదళ ఉనికిని పెంచింది. ఏది ఎలా ఉన్నా అమెరికా పెత్తందారీ విధానానికి ప్రపంచంలోనే పెద్ద తలకాయలుగా పేరుగాంచిన దేశాలు తమ స్వప్రయోజనాల కోసం తలొగ్గుతున్నాయి కానీ, తన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న అమెరికాపై ఇరాన్ మాత్రం వీరోచిత పోరాటం చేస్తున్నది.
ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్ దుష్టద్వయాన్ని ప్రపంచంలో ఏకాకిని చేయటం ద్వారా తొలి విజయాన్ని అందుకున్నది ఇరాన్. ఇరాన్ ఎవరి సహాయాన్నీ అర్థించటం లేదు. కారణాలు ఏవైనప్పటికీ అమెరికా ప్రపంచదేశాలు అన్నింటినీ సహాయం కోసం వేడుకుంటున్నది. ఇది ఇరాన్ సాధించిన మలి విజయంగా భావించాలి. యుద్ధంలో గెలుపు ఓటములను ఎవరూ నిర్ణయించలేరు. బలమున్న వాడి ప్రదర్శన కంటే చివరి వరకు వీరోచితంగా పోరాడేవాడే వీరుడు.!
– ఇంద్రాణి