Suryaa.co.in

Editorial

‘కోర్‌కమిటీ’ కుప్పిగంతులకు అమిత్‌షా చెక్

– ఆంధ్రా బీజేపీలో ఫలిస్తున్న అమిత్‌షా మంత్రం
– దారికొచ్చిన ఏపీ బీజేపీ నాయకత్వం
– తొలిసారి ఢిల్లీ నుంచే కోర్ కమిటీ ప్రకటన
– సునీల్ దియోథర్, సోము దూకుడుకు చెక్
– ఫలించిన సుజనా-రమేష్ ఫిర్యాదు
– సత్యకుమార్ చొరవతో పూర్తి స్థాయి కోర్ కమిటీ
– అయినా కనిపించని రావెల, దాసరి శ్రీనివాసులు పేర్లు
– విష్ణువర్దన్‌రెడ్డికి పూర్తిగా తగ్గిన ప్రాధాన్యత
– ‘కోర్ కమిటీ’ పై ‘సూర్య’ అఫెక్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత కొంతకాలం నుంచీ అడిగేవాడు లేక… అస్తవ్యస్థంగా మారిన ఏపీ బీజేపీ నాయకత్వం, ఎట్టకేలకు అమిత్‌షా మంత్రంతో దారికొస్తోంది. ఇటీవలి అమిత్‌షా తిరుపతి పర్యటనలో నాయకత్వానికి వేసిన అక్షింతలు ఫలించాయి. కోర్‌కమిటీ, మినీ కోర్ కమిటీ పేర్లతో నచ్చిన నేతలకే చోటిచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించిన సునీల్‌దియోథర్-సోము వీర్రాజుకు, పార్టీ జాతీయ నాయకత్వం షాక్ ఇచ్చింది. ఇకపై తాము ప్రకటించిన కోర్ కమిటీనే ఉండాలంటూ.. ఒక జాబితాను విడుదల చేసి, ఆ ఇద్దరికీ ఝలక్ ఇచ్చింది. ఇది ఒకరకంగా ఆ ఇద్దరి దూకుడుకు బ్రేకులు వేయడమేనన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, కోర్ కమిటీ-మినీ కోర్ కమిటీ పేర్లతో రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతల అసంతృప్తిపై, ‘సూర్య’లో పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.ఇది కూడా చదవండి:ఆంధ్రా నేతలపై అమిత్‌షా అక్షింతలు
తాజాగా జాతీయ నాయకత్వం చేసిన ఏపీ కోర్ కమిటీ ప్రకటన.. రానున్న కాలంలో జరిగే మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏపీ బీజేపీని పెద్దగా పరిగణనలోకి తీసుకోని జాతీయ నాయకత్వం, అమిత్‌షా రాకతో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఏపీలో జగన్ ప్రభుత్వానికి బీజేపీ శత్రువా? మిత్రుడా అన్న విషయంపై అమిత్‌షా రాక వరకూ అస్పష్టత ఉండేది. రాష్ట్ర పార్టీలో సునీల్ దియోథర్ మాట శిలాశాసనం అన్న భావన కూడా బలంగా ఉండేది. కోర్ కమిటీ కి ఎవరిని పిలవాలన్నది కూడా, సునీల్-సోము వీర్రాజు దయాధర్మాలపైనే ఆధారపడి ఉండేది. చివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ఎంపీలు లేని, మినీ కోర్ కమిటీని ఏర్పాటుచేసినా అడిగే నాధుడు లేని ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల అమిత్‌షా తిరుపతి పర్యటనలో ఏపీ పార్టీపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంపీలతో సహా రాష్ట్ర పార్టీ సీనియర్ల అభిప్రాయాలు విన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఎంపీలు సుజనా చౌదరి-సీఎం రమేష్…. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కో ఇన్చార్జి సునీల్ దియోథర్ ఏకపక్ష నిర్ణయాలు, కోర్ కమిటీ సమావేశాలకు తమను ఆహ్వానించని వైనాన్ని ఫిర్యాదు చేశారు. వారిద్దరూ కలసి కోర్ కమిటీ- మినీ కోర్ కమిటీ పేరిట తమకు నచ్చిన వారినే ఆహ్వానిస్తున్నారని అమిత్‌షాకు వివరించారు. మీడియాపై నిషేధం, సీనియర్లను మీడియా ముందు వెళ్లకుండా నిషేధించిన వైనాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు.
నిజానికి, ఎంపీలు ఫిర్యాదు చేయకముందే.. జాతీయ కార్యదర్శి సత్యకుమార్, చాలారోజుల క్రితమే కోర్ కమిటీ కూర్పు వ్యవహారంపై సీనియర్ల అసంతృప్తి గురించి, అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలోనే జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉండే సత్యకుమార్ నుంచి, పార్టీ జాతీయ నాయకత్వం పూర్తి సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి అమిత్‌షా భేటీలో సైతం, ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసే సమయంలో ‘మీతో నేను తర్వాత మాట్లాడతా’నని అమిత్‌షా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. కాగా రాష్ట్ర పార్టీకి సంబంధించి, సత్యకుమార్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని అమిత్‌షా స్పష్టం చేసినట్లు సమాచారం.ఇది కూడా చదవండి:రాజుగారికి ఉన్న రోషము …పువ్వు పార్టీకి ఏది?
ఈ క్రమంలో బీజేపీ సెంట్రల్ ఆఫీసు నుంచి, కోర్ కమిటీ సభ్యుల జాబితా నే రుగా విడుదల కావటం బట్టి.. సత్యకుమార్ చొరవతో, కోర్ కమిటీలో రాష్ట్ర నాయకత్వ ఇష్టారాజ్యానికి తెరపడినట్లయింది. ఆ ప్రకారంగా… సోము వీర్రాజు, పురంధీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, టిజి వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్, జీవీఎల్ నరసింహారావు, మధుకర్, పివిఎన్ మాధవ్, నిమ్మక జయరాజ్, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిని కోర్ కమిటీ సభ్యులుగా; జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ఇన్చార్జి-కేంద్రమంత్రి వి.మురళీధరన్, కో ఇన్చార్జి సునీల్ దియోధర్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ సెంట్రల్ కమిటీ జాబితా ప్రకటించింది.ఇది కూడా చదవండి: సుజనా ఎత్తుకు సోము చిత్తు
అసలు కోర్ కమిటీని ఈవిధంగా సెంట్రల్ ఆఫీసు ప్రకటించిన దాఖలాలు గతంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘సహజంగా రాష్ట్ర అధ్యక్షుడే కోర్ కమిటీ సభ్యుల పేర్లను సెంట్రల్ ఆఫీసుకు సమాచారం కోసం పంపిస్తుంటారు. ఇద్దరు రాష్ట్ర ప్రభారీలు కూడా సమన్వయం చేస్తున్నందున, సెంట్రల్ ఆఫీసు కూడా కోర్ కమిటీ వ్యవ హారాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు. కానీ ఇక్కడ మా అధ్యక్షుడు- కో ఇన్చార్జి దయాధర్మం కింద కోర్ కమిటీ ఉందన్న విషయం మా పార్టీ ఆలస్యంగా గుర్తించి, పేర్లను సెంట్రల్ కమిటీ నుంచి పంపించింది.
ఇలా జరగడం ఇన్నేళ్ల నా అనుభవంలో ఎక్కడా చూడలేద’ని విజయనగరం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తాజా జాతీయ పార్టీ కార్యాలయ నిర్ణయం సునీల్ దియోథర్ పెత్తనానికి చెక్ పెట్టడమేనంటున్నారు. అదే సమయంలో సీనియర్లందరితో కలసి సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప.. ఇకపై గతంలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలు కుదరదన్న సంకేతాలు, అటు సోము వీర్రాజుకు ఇచ్చిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
కాగా, కన్నా లక్ష్మీనారాయణ హయాంలో 27 మంది కోర్ కమిటీలో ఉండేవారు. ఎస్టీ, ఓబీసీ, ఎస్సీమోర్చా, మేధావుల కమిటీ, ప్రధాన కార్యదర్శులకు కమిటీలో ప్రాతినిధ్యం ఉండేది. ఈసారి ఆ సంఖ్యను 13కు కుదించినట్లు కనిపిస్తోంది. అయితే తాజా కమిటీలో ప్రధాన కార్యదర్శి, విష్థువర్దన్‌రెడ్డి పేరు కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. రాష్ట్ర ప్రభారీ మధుకర్ ఒక్కరిపేరే కనిపించింది. ఇక మాధవ్ ఫ్లోర్ లీడర్ హోదాలో స్థానం సంపాదించుకున్నారు. దానితోపాటు కొద్దినెలల క్రితమే విష్ణును, మీడియా-సోషల్ మీడియా ఇన్చార్జిగా కూడా తొలగించారు. దానితో సునీల్ దియోథర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే విష్ణు ప్రాధాన్యం, పూర్తిగా తగ్గించారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సోము వీర్రాజు ప్రధాన అనుచరుడైన సూర్యనారాయణరాజు పేరు కూడా కనిపించలేదు. తాజాగా కోర్‌కమిటీలో సునీల్ దియోధర్ సిఫార్సుతో చంద్రమౌళి, సోము వీర్రాజు సిఫార్సుతో ఆయన జిల్లాకు చెందిన శ్రీదేవి పేరు చేర్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా దళిత వర్గానికి చెందిన మాజీ మంత్రి, రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులును పక్కకుపెట్టి.. సోము తన అనుచరురాలైన శ్రీదేవికి, కోర్ కమిటీలో స్థానం కల్పించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE