– అవినీతిపై మీరెందుకు ఉద్యమించరు?
– ప్రభుత్వాల మధ్య వ్యవహారాలు మీకు అనవసరం
– రెండురోజులు తెలంగాణలో పర్యటిస్తా
– కొత్త వారిని తీసుకోవలసిందే
– తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్‌షా
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
ఇకపై తాను తరచూ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని, కేసీఆర్ సర్కారుపై యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ రాష్ట్ర నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలుగా మీరేం చేయాలో దాన్ని మీరు చేయండి. ప్రభుత్వంపై ఏం చేయాలో అది మేం చూసుకుంటాం’అని
ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ బీజేపీ సీనియర్లతో అమిత్‌షా భేటీ అయ్యారు.ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య ఏం జరుగుతుందో మీకు అనవసరం. పార్టీగా కేసీఆర్ ప్రభుత్వంపై మీరు ఎలా యుద్ధం చేయాలన్న దానిపై అజెండా రూపొందించుకోండి. నేను త్వరలో అక్కడికి వచ్చి రెండురోజులు ఉంటా’నని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరికలపై పార్టీ నేతలు సీరియస్‌గా దృష్టి సారించాలని, పార్టీలో చేరిన తర్వాత అంతా మన పార్టీ వారేనని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ‘‘ఇతర పార్టీల నుంచి మనపార్టీలో చేర్చుకోవడం ఎంత ప్రధానమో, చేరిన వారికి గౌరవం ఇవ్వడం కూడా అంతే ప్రధాన’’మని ఆయన స్పష్టం చేశారు. బియ్యం రీసైక్లింగ్ కుంభకోణంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
‘ మీ రాష్ట్రంలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. దానిపై మీరెందుకు ఉద్యమించటం లేదు? వాటిపై విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు. సమస్యలున్నప్పుడు మీరెందుకు ఉద్యమించడం లేదు. నేను త్వరలో అక్కడికి వచ్చి రెండు రోజులు ఉంటా. మీరేం చేస్తారే చేయండి. చూస్తాను’ అని
అన్నారు.‘మీరు తగిన ప్రణాళిక రూపొందించుకుని కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించండి. కేంద్రం నుంచి కావలసిన సమాచారమేమిటో తీసుకోండి. హుజూరాబాద్ తరహా విజయం కోసం పనిచేయండి’ అని సూచించారు. బండి సంకల్పయాత్రకు మంచి స్పందన లభించిందని కితాబు ఇచ్చారు.
ఈటల రాజేందర్‌ను అభినందించిన అమిత్‌షా.. పార్టీలో కొత్త వారిని చేర్చుకునే కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోవాలని, అంతా ఈటల తరహా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయనను అభినందించారు. అమిత్‌షాను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి, ఎంపి అర్వింద్, జాతీయ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డికె అరుణ, విజయశాంతి,గరికపాటి మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డి, పి.సుధాకర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.