ఆర్కే ఏ మొఖం పెట్టుకొని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారు?!
మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి సిగ్గనిపించడం లేదా?
మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని లోకేష్ హామీ
మంగళగిరి: గత ఎన్నికల్లో గెలిచినోళ్లు నియోజకవర్గాన్ని గాలికొదిలేసి వెళ్లిపోయారు, గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి నా సొంతమని భావించి ఇక్కడే ఉండి సేవ చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో నన్ను మీ బిడ్డలా నన్ను ఆదరించండి, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి గండాలయ్యపేట, తాడేపల్లి ప్రకాష్ నగర్, ఉండవల్లి ఎస్సీ కాలనీల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు యువనేత హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ఓడినా 5ఏళ్లుగా ప్రజలమధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలుచేస్తూ అండగా నిలుస్తున్నా. యువగళానికి ముందు నేను మంగళగిరిలో పాదయాత్ర చేసి సమస్యలన్నింటినీ తెలుసుకున్నా. మంగళగిరికి పరిశ్రమలు రావని చెప్పడానికి ఎమ్మెల్యే ఆర్కేకి సిగ్గుగా లేదా?
గత ప్రభుత్వ హయాంలో నేను తెచ్చిన ఐటి కంపెనీలు కనపడటం లేదా? పదేళ్లలో ఒక్కరికి కూడా పట్టా ఇవ్వలేదు. కోర్టుకెళ్లి పట్టాలిప్పిస్తానని చెప్పి, కనీసం కేసు కూడా దాఖలు చేయలేదు. 25ఏళ్లుగా రెండు కుటుంబాలను మంగళగిరిలో గెలిపించినా ఇళ్లపట్టాలు ఇవ్వలేదు, తాగునీటి సౌకర్యం కల్పించలేదు. ఎన్నికల్లో ఓట్లకోసం కుల,మతాల పేరుతో చిచ్చుపెడతారు, మోసపుమాటలను నమ్మొద్దు.
మంగళగిరికి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. గత ఎన్నికలకు ముందు టిడిపి గెలిస్తే ఇళ్లు కూల్చేస్తానంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆత్మకూరు, ఇప్పటం, ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఇళ్లు కూల్చింది ఎవరు? ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ప్రజలవద్దకు ఓట్లు అడుగుతారు? ఆరునెలల క్రితం ఎమ్మెల్యే ఆర్కే నియోజకవర్గానికి సిఎం నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు కూడా ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలు రావడంతో మళ్లీ నాటకాలు మొదలెట్టారు.
వాళ్లిద్దరూ సినిమా స్టార్లను మించిన మహానటులు
ముఖ్యమంత్రి జగన్ అమితాబచ్చన్ ను మించిన మహానటుడు, ఎమ్మెల్యే ఆర్కే ఎదుట కమలహాసన్ కూడా సరిపోడు. రాజకీయ ప్రయోజనం కోసం బాబాయిని గొడ్డలివేటుతో లేపేసి, నింద మాపైనెట్టి నాటకాలు ఆడారు. అయిదేళ్ల తర్వాత వివేకా కూతురు మీడియా ముందుకు వచ్చి అసలు నిజం చెప్పింది. 2019 లో ఒక్కచాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ ప్రజల బతుకులను ఛిద్రం చేశారు. సంక్షేమం పేరుతో పదిరూపాయలు ఇచ్చి, పన్నుమీద పన్నులతో వంద లాగేస్తూ జనం నడ్డివిరిచారు.
గత ప్రభుత్వం అమలు చేసిన 100 సంక్షేమ పథకాలను రద్దుచేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేశారు. కుర్చీల్లేని కార్పొరేషన్లు పెట్టి వారి సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. యువగళంలో 3132 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నా దృష్టికి వచ్చిన సమస్యలను అధినేతకు చెప్పా. వాటన్నింటినీ పరిశీలించాక పేదలకు అండగా నిలిచేందుకు సూపర్ -6 పథకాలను ప్రకటించారు. చంద్రబాబునాయుడు, పవనన్న ఓట్లు ఇక్కడే ఉన్నాయి.
వారి ద్వారా నిధులు తెచ్చి నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తా. గండాలయ్యపేటలో 3 ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయి. దశాబ్ధాల తరబడి ఇక్కడ ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు లేవు. కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించి, అధికారంలోకి వచ్చిన 24నెలల్లో పట్టాలు అందజేస్తాం. కొండ పోరంబోకు, ఫారెస్టు భూముల్లో నివసించే వారికి కూడా పట్టాలిచ్చే బాధ్యత నాది. ఇక్కడ ప్రజలు బిందెలతో దూరప్రాంతానికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందజేస్తాం.
రచ్చబండ సభల్లో లోకేష్ దృష్టికి సమస్యల వెల్లువ
మంగళగిరి గండాలయ్యపేట వాసులు లోకేష్ కు సమస్యలు చెబుతూ… దశాబ్ధాలుగా నివాసం ఉంటున్నా మాకు పట్టాలు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే ఆర్కే పట్టాలిప్పిస్తామని చెప్పి మళ్లీ కన్పించలేదు. మా ప్రాంతంలో చాలామందికి రేషన్ కార్డులు, పక్కా ఇళ్లులేవు. పూరిగుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నాం. వర్షంవస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో చదువుకున్న యువతకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించాలి. సిసి కెమెరాలు ఏర్పాటుచేసి అల్లరిమూకల బెడద నివారించాలని కోరారు.
ప్రకాష్ నగర్ వాసులు సమస్యలను చెబుతూ రోడ్డువిస్తరణలో తమకు జీవనాధారంగా ఉన్న బడ్డీకొట్లు తొలగించారు, ఇళ్లపట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. రెండురోజులకు ఠఒకసారి తాగునీరు అరకొరగా వస్తోంది. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలి. యువత గంజాయికి బానిసలవుతున్నారు, గంజాయిని అరికట్టాలని కోరారు.
యువనేత లోకేష్ స్పందిస్తూ… సింహాచలం భూముల మాదిరిగా ఎండోమెంట్స్ భూములు నివసించే వారి సమస్యను పరిష్కరిస్తాం. తాత ఎన్టీఆర్ స్పూర్తితో దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి పట్టాలిప్పిస్తా. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయిని అరికడతామని హామీ ఇచ్చారు.