Suryaa.co.in

Features

అమ్మ భాష..గుండె ఘోష!

మాతృభాషంటే
గుండె ఘోష..
అమ్మ నీకు నేర్పిన
మొదటి మాట
పదిలంగా దాచుకో నాన్నా
అంటూ నీకిచ్చిన వరాలమూట
కాస్తకాస్తగా..ఎప్పటికప్పుడు
కొత్తకొత్తగా రుచిచూస్తూ..
ఆస్వాదించరా అని మురిపెంగా
కట్టి ఇచ్చిన చద్దిమూట..

అంతేనా..
అడ్డాలనాడు వచ్చీరాని మాటలతో నువ్వు నుడివిన
మొదటి సాహిత్యం..
నీ తొలి తేనె పలుకులు విని
అమ్మ మురిసిపోయిన
నీ పసితనపు పాండిత్యం
ఆజన్మాంతం నీ ఉన్నతిలో
ముందుండి నిను నడిపించే
సాన్నిహిత్యం..
కలకాలం నీ నోటి నుంచి వెలువడే ఆణిముత్యం..
స్వాతిముత్యం..

అమ్మ నేర్పిన భాష
అది మరచిన నీ వాలకం
మరీ కృతకం..
ఎలా ఉన్నావు..ఇది మాని
హౌ డూ యు డూ..
అలాగే ఇంగ్లీషోడికి
నువ్వైపోయావు డూ డూ..
తమిళ తంబికి..
కన్నడ కంఠీరవుడికి…
బెంగాలీ బాబుకు..
బీహారీ భయ్యాకి..
ఎవరికీ లేని అనుకరణ..
మర్చిపోయి నీ వ్యాకరణ..
అమ్మ భాషంటే
తెలియని తిరస్కరణ..
ఓయీ తెలుగోడా
నీకే ఎందుకీ తెగులు
నీ భాషకు మంగళం
పరభాషతో లేనిపొని
గందరగోళం..
ఎందుకొచ్చిన తంటా..
వినేవాడికి ఒళ్లుమంట..!?

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు..
నీ భాషలోనే
నువ్వు సంభాషించు..
తమిళనాడు వెళ్తే నువ్వైనా
తమిళంలోనే మాటాడాలంటాడు
అక్కడి తంబి..
నువ్వు మటాడే ప్రయత్నం చేసేస్తావు తబ్బిబ్బై..
నీ సాటి తెలుగోడు ఎదురైతే
వాడితోనూ ఇంగిలిపీసు..
ఎందుకొచ్చిన తిరకాసు..
పరభాషపై పనికిరాని ఆకర్షా
ఇంగిలీషులో
నీ పాండితీప్రకర్షా..
అదంతా అఫీషియలా
ఆర్టిఫీషియలా..
నా ఇంగిలీషును
కాస్త క్షమించాలా!!

ఇవన్నీ ఎందుగ్గాని..
నీ భాష తెలుగు
సానా గొప్పది
దేశభాషలందు లెస్సయినది
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్..
నాకు తెలిసి బెస్ట్..
తెలుగంటే..రామాయణం
ఇంటింటి రామాయణం..
కోపం వచ్చినపుడు
నీ నోటి నుంచి
వెలువడే రామబాణం..
నీ మొదటి ప్రేమలేఖాయణం
నీ గ్రామీణం..
ఆంధ్రదేశానికి అందంగా అమరిన వడ్డాణం..

తెలుగంటే నీ భారతం..
చిన్ననాడు అమ్మ
ఆ భాషలోనే
పట్టలేదా నీ భరతం..
నువ్వు మర్చిపోలేని మధురమైన
నీ గతం..
నీ అవగతం..జీవితం!
ఇంకా..
తెలుగంటే నీ భాగవతం..
ఇంటింటి బాగోతం..
కృష్ణదేవరాయుని చరితం
అల్లసాని పెద్దన..
నంది తిమ్మన
కృష్ణశాస్త్రి..గురజాడ..గిడుగు
అందరూ కట్టగట్టి రాసిన
అందమైన కావ్యం..!

తెలుగంటే..
చందమామ..బాలమిత్ర..
బొమ్మరిల్లు..బామ్మసొల్లు..
భాషలందు గజకర్ణ..గోకర్ణ..
ఎన్టీవోడు తీసిన దానవీరశరకర్ణ
అందమైన శ్వేతస్వర్ణ..!

చివరగా..
తెలుగంటే..
పెద్దబాలశిక్ష..
వ్యాకరణం రాకపోతే బడిలో అయ్యోరు బెత్తంతో విధించిన మధురమైన శిక్ష..
నీ జీవితానికి రక్ష..
సాక్షాత్ వాగ్దేవి ప్రసాదించిన
అపురూప భిక్ష..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE