Suryaa.co.in

Editorial

షర్మిలకు ‘అమ్మఒడి’

– వైసీపీ అమ్మ’ రాజీనామా
– వైసీపీలో ముగిసిన విజయమ్మ 13 ఏళ్ల ప్రస్థానం
– వైసీపీలో వైఎస్ కుటుంబం నుంచి జగన్ ఒక్కరే
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమాత వైఎస్ విజయమ్మ ఆ పార్టీ ప్లీనరీ తొలిరోజున తన పదవి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానితో వైసీపీలో విజయమ్మ 13 ఏళ్ల ప్రస్థానం ముగిసినట్లయింది. ఇకపై తాను కూతురు షర్మిల తెలంగాణలో స్థాపించిన వైస్సా టీపీ కోసం పనిచేస్తానని విజయమ్మ నిండుసభలో వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో జగన్ చంచల్ గూడ జైలుకు వెళ్లినప్పటి నుంచీ, పార్టీని జనంలోకి తీసుకువెళ్లిన విజయమ్మ, ఆమె కూతురు షర్మిల సుదీర్ఘ విరామానంతరం తాము ప్రేమించిన వైసీపీకి దూరంగా ఉండటమే విశేషం. కుటుంబ కలహాల కారణంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేయనున్నారంటూ, రెండు రోజుల నుంచీ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఆమె.. ఆ పార్టీ నిర్వహించిన ప్లీనరీ వేదికగా రాజీనామా చేస్తున్నట్లుYS-Vijyayamma ప్రకటించారు. అయితే, ఆ సందర్భంలో కుమారుడైన సీఎం జగన్ ను ఆశీర్వదించారు. ఎల్లో మీడియా తన రాజీనామా పై దుష్ప్రచారం చేసిందంటూ విరుచుకుపడ్డారు.

రాయని లేఖను రాసినట్లు ప్రచారం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం కొనసాగించడం ఇష్టం లేక, తాను షర్మిలకు సాయంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. “ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు. ఇకపై జరగబోయేది మరొక ఎత్తు. ఆంధ్రా-తెలంగాణలో జగన్-షర్మిలకు వేర్వేరు విధానాలుంటాయి. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తల్లిగా జగన్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంద’ని విజయమ్మ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అయితే ‘నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే తానీ నిర్ణయం తీసుకున్నానం’టూ విజయమ్మ చేసిన వ్యాఖ్యపై, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఉనికి ఎవరికి వివాదాస్పదమవుతోందన్న దిశగా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి టీవీ చానెళ్లు చర్చలు కూడా నిర్వహించాయి. అయితే ఈ ప్రచారాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, ఇప్పటివరకూ వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ పార్టీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో, ఇక వైఎస్ కుటుంబం నుంచి జగన్ ఒక్కరికే, పార్టీలో ప్రాతినిధ్యం ఉన్నట్టయింది. సమీప బంధువులున్నప్పటికీ, వైఎస్ కుటుంబం నుంచి ఇక పార్టీలో ఎవరికీ ప్రాతినిధ్యం లేనట్లే లెక్క. నిజానికి విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలయినప్పటికీ, మొదటి నుంచీ పార్టీలో ఆమె పాత్ర శూన్యం. పార్టీ నేతలు ఆమెను రాజమాతగానే భావించేవారు.

తండ్రి వైఎస్ ఫొటో, తల్లి విజయమ్మ రూపంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ కు, ఆ సెంటిమెంట్ బాగానే వర్కవుటయింది. జగన్ కోసం విజయమ్మ తన ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా, కూతురు షర్మిలతో కలసి కష్టపడ్డారు. తల్లీకూతుళ్ల శ్రమ ఫలించి జగన్ సీఎం అయ్యారు. జగన్ ఉన్నతిలో తల్లీ-చెల్లి కీలకపాత్ర12ysr2-1 పోషించారన్నది మనం మనుషులం అన్నంత నిజం. నిజానికి చాలాకాలం నుంచి పార్టీ ప్రభుత్వంలో వైఎస్ నామస్మరణ బాగా తగ్గిపోయింది. కొన్ని పథకాలకు మాత్రం ఆయన పేరు పెట్టారు. ఎన్నికల ముందు వరకూ కీలకంగా కనిపించిన వైఎస్ నామస్మరణ, ఫొటోలు ఇప్పుడు తగ్గిపోయాయి. ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత టీడీపీలో కూడా అచ్చం ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇప్పుడు పార్టీలో ఉన్న తల్లిsharmila-reddy విజయమ్మ కూడా నిష్క్రమించటం, సోదరి షర్మిల ఏపీని విడిచిపెట్టి, తెలంగాణలో పార్టీ స్థాపించడంతో .. ఇక సర్వత్రా జగన్ ఒక్కరే కనిపించనున్నారు. ఇది వైసీపీలో సరికొత్త పరిణామం. ఒకరకంగా ఆయనకు.. కుటుంబానికి సంబంధించిన అనుబంధం, మొహమాటాలు పార్టీ పరంగా తెగిపోయినట్లేనని కడప జిల్లా నేతలు విశ్లేషిస్తున్నారు.

తాజాగా విజయమ్మ వ్యాఖ్యలతో.. ఆమె ఇకపై షర్మిలతోనే ఉండబోతున్నట్లు స్పష్టమయింది. అంటే షర్మిలకే ‘అమ్మఒడి’ దక్కినట్లు భావించాల్సి ఉంటుంది. కుమారుడు జగన్‌కు తన ఆశీర్వాదం ఎప్పుడూYS-Sharmila-Vijayammaఉంటుందని చెప్పిన విజయమ్మ, కూతురు షర్మిలకే నైతిక, భౌతిక మద్దతు ఉందని చెప్పకనే చెప్పారు. నిజానికి షర్మిల పార్టీలో కూడా, విజయమ్మ పాత్ర పెద్దగా ఉండబోదు. కాంగ్రెస్, వైసీపీలో కూడా ఆమె ఎప్పుడూ జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో , అప్పుడెప్పుడో టికెట్ల విషయంలో జోక్యం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే, తెలంగాణలో ఒంటరిపోరాటం చేస్తున్న కూతురు షర్మిలకు, బాసటగా నిలిచేందుకే ఒక తల్లిగా వైసీపీని వీడుతున్నట్లు కనిపిస్తోంది. పైగా.. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి రెండు పార్టీలలో సభ్యత్వం ఉండకూడదు. దానికితోడు, కుటుంబకలహాలంటూ మీడియాలో విస్తృత
ప్రచారం కూడా జరుగుతున్నందున.. వీటికి తెరదించేందుకే విజయమ్మ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, షర్మిలకు ‘అమ్మఒడి’ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE