-అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల నిర్వహణ పై ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు, 24 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ బోనాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. అదేవిధంగా 18 వ తేదీన జరిగే మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న జరిగే ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఖర్చును గతంలో ఆయా ఆలయాలు భరించేవని, ప్రస్తుతం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. అదేవిధంగా పాతబస్తీ లోని 25 దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు రోజున చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో వివిధ కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో గతంలో కన్నా అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వివిధ ప్రాంతాల నుండి అదనపు పోలీసు బలగాలను తరలించడం జరుగుతుందని చెప్పారు.
గత నెల 30 వ తేదీన గోల్కొండ బోనాలకు, 5 వ తేదీన జరిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం కు కూడా ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల తో భక్తులు ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు బల్కంపేట ఎల్లమ్మ ఆమ్మవారి కళ్యాణానికి వేల సంఖ్యలో భక్తులు రాగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో లక్షలాదిగా వస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని చెప్పారు. బోనాల ఉత్సవాలను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారంటే ఈ పండుగ కు ఎంత విశిష్ట ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షులు రాకేష్ తివారీ, మధుసూదన్ యాదవ్, మధుసూదన్ గౌడ్, గాజుల అంజయ్య, శంకర్ యాదవ్, దత్తాత్రేయ, హన్స్ రాజ్, ఆదర్శ మహేష్, దేవాదాయశాఖ RJC రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ లు బాలాజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు