-
మంత్రి గారి అల్లుడితో మహా ఇబ్బందట
-
మామ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో మైనింగ్ అధికారులతో భేటీలు
-
పెండింగ్ లైసెన్సు వివరాలపై అల్లుడిగారి ఆరా
-
వైజాగ్ భూముల వివరాలపై వాకబు
-
కడప జిల్లాలో రెచ్చిపోతున్న యువరాజా
-
అల్లుడి గారి దెబ్బకు రోడ్డు పనుల సబ్ కాంట్రాక్టర్లు పరార్
-
లారీలు వదలి అనంతపురానికి జంప్
-
ఇప్పుడు ఆ పనులు చేస్తున్న అల్లుడుగారు
-
కప్పం కట్టనందుకు ఉడ్ కంపెనీకి నీళ్లు కట్
-
బెంగుళూరు, ఒంగోలుకు పెన్నా, సోమశిల నది ఇసుక తరలింపు
-
వైసీపీ నేతలతో చెట్టపట్టాల్
-
కూటమి ప్రభంజనంలోనూ అక్కడ గెలవని టీడీపీ
-
బాబు హెచ్చరించినా మారని తీరు
-
బెజవాడ స్టార్ హోటల్‌లో సెటిల్‌మెంట్లు
-
ఇప్పటికే అల్లుడిగారిపై బాబుకు బోలెడు ఫిర్యాదులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన ఓ సీనియర్ మంత్రిగారి అల్లుడు. మామూలుగా అల్లుడంటే ఆ ఇంటి వరకూ అంతా గౌరవిస్తారు. మర్యాదల్లో తేడా వస్తుందేమోనని భయపడతారు. కానీ ఈ అల్లుడిగారికి ఒక నియోజకవర్గం, మామ గారు ఇన్చార్జిగా ఉన్న జిల్లా అధికారులే హడలిపోతున్నారట. అల్లుడిగారి సొంత నియోజకర్గంలో పార్టీకి సంబంధించినంత వరకూ ఆ కుటుంబం చెప్పిందే శాసన ం. ఆ కుటుంబం చెప్పిన వారికే సీటిస్తారు. కానీ అక్కడ మాత్రం పార్టీ గెలవదు. కారణం బహిరంగ రహస్యమే. ఇటీవలి కూటమి ప్రభంజనంలో సీమలో వైసీపీ తుడిచిపెట్టుకుని పోతే, అల్లుడిగారి కుటుంబం కర్రపెత్తనం చేసే నియోజకవర్గంలో మాత్రం ఓడిపోయింది. ఎమ్మెల్యే కన్నా ఎంపీకే ఎక్కువ ఓట్లు వచ్చిన వైచిత్రి. ఇప్పుడా అల్లుడు గారి దెబ్బకు రెండు జిల్లాల అధికారులు హడలిపోతున్నారట. ఈ సంగతి బాబుకు తెలిసి అల్లుడిగారిని మందలించినా, ఏమాత్రం మార్పులేదట. ఇంతకూ ఎవరా అల్లుడు గారు? ఏమా కథ?
అనగనగా ఓ సీనియర్ మంత్రి. ఆయనకు ఓ అల్లుడు. ఇద్దరిదీ పక్కపక్క జిల్లాలే. అల్లుడు గారి కుటుంబం చాలాకాలం నుంచి టీడీపీలో కొనసాగుతోంది. సీమ జిల్లాలో పౌరుషం పేరు చెబితే గుర్తుకొచ్చే ఆ జిల్లాలో, ఆ కుటుంబానికి అప్పట్లో చాలా మంచి కీర్తి ప్రతిష్ఠలుండేవి. పెద్దాయనను అంతా గుండెల్లో పెట్టుకుని గౌరవించేవారు. ఆయన తర్వాత ఆ కుటుంబం.. ‘సగటు రాజకీయనాయకుల’ దారిలోనే పయనించింది. ఇదీ సూక్ష్మంగా అల్లుడిగారి కథ.
ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. అల్లుడు గారు మామ పేరును అడ్డం పెట్టుకుని చేస్తున్న వ్యవహారాలు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు, యువనేత-మంత్రి లోకేష్ వరకూ వెళ్లాయట. మామగారు ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో విస్తృతంగా ఉన్న మైనింగ్ కంపెనీలపై అల్లుడుగారు కన్నేశారట. ఆ జిల్లాలో లైసెన్సులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఫిర్యాదులున్న కంపెనీలు ఎన్ని? నెలవారీ ఆదాయం ఎంత? ఎంతమంది బిల్లులు లేకుండా వాహనాలు పంపిస్తున్నారు? పెనాల్టీలు వేసిన కంపెనీల జాబితా కావాలని మైనింగ్ శాఖ అధికారులను ఆదేశిస్తున్నారట. తనను వచ్చి కలవాలని మైనింగ్ కంపెనీల వారికి కబురు పంపిస్తున్నారట.
అయితే ‘మేం ఈ జిల్లా నాయకుల చుట్టూ తిరగలేక మా కాళ్లు అరిగిపోతున్నాయి. మళ్లీ మీ చుట్టూ ఎక్కడ తిరగాల’ని సమాధానమిస్తున్నట్లు సమాచారం. దీనితో పలువురు నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక విశాఖ జిల్లాలో మామగారి శాఖలో పెండింగ్-వివాదంలో ఉన్న భూముల వివరాలు కావాలని, ఆ శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖలో విలువైన లీజు భూముల కోసం ఆ శాఖలో చాలా డిమాండ్ ఉంటుంది. కాగా అటు మంత్రిగారు సైతం ఇటీవల సమీక్ష నిర్వహించి.. ఖాళీ భూములు, వివాదాస్పద భూములు, లీజు పొందిన భూముల సమాచారం కావాలని అధికారులను ఆదేశించారట.
ఈ పరిణామాలు తెలుసుకుని ఆగ్రహించిన సీఎం.. సదరు మంత్రి అల్లుడిగారిని మందలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలే సీమ జిల్లాలోని అల్లుడి గారి నియోజకవర్గంలో, పార్టీని చేతులారా ఓడించారన్న ఆగ్రహం బాబుగారిలో లేకపోలేదట. ప్రతి ఎన్నికలకు బలహీన అభర్ధులను సిఫార్సు చేయడం, వారు ఓడిపోవడం, తర్వాత నియోజకవర్గం అల్లుడిగారి కుటుంబం అధీనంలోనే కొనసాగుతున్న వైనంపై, బాబు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి అసెంబ్లీకి వచ్చిన ఓట్ల కంటే, వైసీపీ ఎంపి అభ్యర్ధి అవినాష్‌రెడ్డికి వచ్చిన ఓట్లే ఎక్కువ కావడం కూడా, బాబు ఆగ్రహానికి మరో కారణమట. కూటమి ప్రభంజనంలో సీమలో వైసీపీ రాలిపోతే, అల్లుడి గారి నియోజకవర్గంలో మాత్రం గెలవడంపై, నాయకత్వం సీరియస్‌గా ఉందని జిల్లా పార్టీ నేతలు చెబుతున్నారు. అల్లుడి గారి నియోజకవర్గంలో పెద్ద తలలకు, వైసీపీ నేతలతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్న ఫిర్యాదులు ఇప్పటికే పార్టీ నాయకత్వానికి చేరాయంటున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వారు నాయకత్వానికి తమ ఆరోపణలకు ఆధారంగా చూపించారట.
ఇదిలాఉండగా.. అల్లుడు గారి నియోజకవర్గం మీదుగా విజయవాడ-బెంగళూరు వరకూ ఎక్స్‌ప్రెస్‌వే మంజూరయింది. ఆ పనిని 8వ ప్యాకేజీల కింద టెండరు దక్కించుకున్న మెగా కంపెనీ, దానిని 9మంది సబ్ కాంట్రాక్టర్లకు పనుల కింద ఇచ్చింది. ప్యాకేజీ -8లో 646.20 కోట్లతో మల్లేపల్లి నుంచి కవులకుంట్ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే పనులు జరుగుతున్నాయి. మెగా కంపెనీ నుంచి అనంతపురం జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గ కాంట్రాక్టర్లకు సబ్ వర్క్‌లు దక్కాయి.
అది తె లిసిన అల్లుడిగారి వర్గీయులు, అనంతపురం కమ్మసామాజికవర్గానికి చెందిన సబ్‌కాంట్రాక్టర్లను పిలిచి పంచాయితీ పెట్టారట. మాకు తెలియకుండా ఎలా పనులు చేస్తారని కన్నెర్ర చేశారట. సరే వారితో గొడవెందుకు? పైగా పార్టీ ఇన్చార్జితో పంచాయితీ ఎందుకని, తాము తీసుకున్న 10 కిలోమీటర్లలో ఒక కిలోమీటరు పనులిచ్చేశారట.
తర్వాత మళ్లీ ఆ సబ్ కాంట్రాక్టర్లను పిలిచి, క్యూబిక్ మీటర్‌కు ఇంతని చెల్లించాలంటూ షరతు విధించారట. దానికి సబ్ కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. అలా ఇస్తే తమకేమీ మిగలదని బ్రతిమిలాడారట.
నిజానికి సబ్ కాంట్రాక్టర్లు సబ్‌లీజు తీసుకున్న ప్రాంతంలో మట్టి లభించదు. అల్లుడి గారి ఇలాకాలోనే మట్టి లభిస్తుంది. దానితో అల్లుడిగారు మనషులు అక్కడ మట్టి తోలుతున్న లారీలను ఆపి, వాటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారట. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన యంత్రాలు నిలిపివేశారు. ఫలితంగా ఎంతో కొంత సంపాదించుకుందామని ఆశతో వచ్చిన, అనంతపురం సబ్ కాంట్రాక్టర్లకు రోజుకు 50 లక్షల నష్టం తిరుక్షవరం అయిందంటున్నారు. 150 వాహనాలను అడ్డుకోవడంతో పనులునిలిచిపోయాయి. క్యాంపుల్లో ఉండే కార్మికులకు పనిలేక అల్లాడుతున్న పరిస్థితి.
క్యూబిక్ మీటర్ చొప్పున తమకు డబ్బులు ఇస్తేనే పనులు చేయిస్తామని, అల్లుడి గారి ఇద్దరు అనుచరులు స్పష్టం చేశారట. దానికి వారు అంగీకరించకపోవడంతో, చెన్నారెడ్డిపేట-మల్లేపల్లి మధ్య17.5 కిలోమీటర్లమేర జరుగుతున్న నిర్మాణ పనులు నిలిచిపోయాయి. స్థానిక సంస్థలకు సీనరేజీ చార్జీలు చెల్లించి మట్టి తోలుకుంటామని, నిబంధనల ప్రకారమే పనులు చేస్తున్నామన్నా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. చివరకు ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా, అల్లుడి గారి కుటుంబాన్ని కాదని తామేమీ చేయలేదని చేతులెత్తేశారట. దానితో దిక్కుతోచని ఆ సబ్ కాంట్రాక్టర్లు అనంతపురం వెళ్లిపోయారట. ప్రస్తుతం ఆ సబ్ కాంట్రాక్టు పనులు అల్లుడిగారి మనుషులే చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అల్లుడిగారికి కప్పం కట్టలేదన్న కారణంతో, ఆయన నియోజకవర్గంలోని ఒక ఉడ్ కంపెనీకి, బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు రాకుండా కొద్దిరోజులు ఆపేశారు. దానితో ఆ కంపెనీ యజమాని విధిలేక లోకేష్ కు ఫిర్యాదు చేసిన తర్వాతగానీ, ఆ కంపెనీకి నీటి సరఫరా కాలేదట.
ఇక అల్లుడిగారి నియోజకవర్గంలోని ఎన్జీఓ ప్లాట్లపైనా తమ్ముళ్లు కన్నేశారట. ఉద్యోగులు కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, రెవిన్యూ అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారట. తర్వాత దానిని పార్టీ నాయుకులే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ విధంగా నియోజకవర్గంలో ఏ చిన్న అనుమతి కావాలన్నా, అల్లుడిగారికి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉందన్న విమర్శలున్నాయి.
‘‘ఎలాగూ నియోజకవర్గంలో టీడీపీ గెలవదు. అసలు మా వాళ్లే పార్టీని గెలవనీయరు. పార్టీ అధికారంలో ఉండాలి. కానీ ఇక్కడ పార్టీ గెలవకూడదు. అదే వారి సిద్ధాంతం. కాబట్టి మా పార్టీపై చెడ్డపేరు వచ్చినా కొత్తగా వచ్చే నష్టమేమీలేదు. మా పార్టీ నాయకత్వానికి ఇక్కడి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు పోతూనే ఉన్నా, ఆ కుటుంబానికి భయపడి చర్యలు తీసుకోవడం లేదు. వాళ్లు సిఫార్సు చేసిన వారికే ఎమ్మెల్యే టికెట్లు, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మామగారే మంత్రి అయ్యారు కాబట్టి వారు ఎవరిని లెక్కచేస్తారు? నామినేటెడ్ పదవులను వారు సిఫార్సు చేసిన వారికి కాకుండా.. సొంత సర్వే చేయించుకుని, పనిచేసిన వారికి పదవులిస్తేనే నియోజకవర్గంలో పార్టీకి ఉనికి ఉంటుద’ని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.
అల్లుడి గారి సైన్యం.. పెన్నా, సోమశిల నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను బెంగళూరు, ఒంగోలుకు తరలిస్తున్నా.. అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారన్నది, టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మరో ఆరోపణ. ఇసుక పాలసీ ఖరారు కాకముందు.. యార్డుల్లో ఉన్న మూడున్నర కోట్లరూపాయల విలువైన ఇసుకను, విజయవంతంగా తరలించారన్న ఆరోపణలు అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమయిన విషయం తెలిసిందే.
ఇక అల్లుడిగారి మంత్రి మామ గారేమో.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వెలిగిపోయి, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుడు సిఫార్సు చేసిన పోలీసు, రెవిన్యూ అధికారులను తన నియోజకవర్గంలో నియమించుకున్న వైనంపై.. ఇప్పటికే పార్టీ వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా జిల్లాను శాసించిన అప్పటి మంత్రి, ఓ టీడీపీ సీనియర్ నాయకుడిని, పార్టీ కార్యకర్తలను వేధించారు. అలాంటిది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తమను వేధింపులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారని కార్యకర్తలు ఆశించారు. అయితే.. ఇప్పటిమంత్రి గారు మాత్రం, వారికి తన నియోజకవర్గంలో పోస్టింగులు ఇప్పించుకోవడంపై, ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ మంత్రి గారికి ఉన్న ఒకప్పటి వైసీపీ బంధం వల్లే ఇదంతా జరుగుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
నిజానికి సదరు సీనియర్ మంత్రికి, గతంలో మంచి పేరు ప్రతిష్ఠలే ఉన్నాయి. అవినీతికి దూరంగా ఉంటారన్న పేరుండేది. కానీ ఈసారి మంత్రి అయిన తర్వాత అందుకు భిన్నమైన ఆయన వ్యవహారశైలి చూసి, మంత్రిగారిని వ్యక్తిగతంగా అభిమానించే వారు సైతం నోరెళ్లబెడుతున్నారు. గత ంలో ఆయనపై ఎవరూ అవినీతి ఆరోపణలు చేసిన వారు లేరు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదని, అల్లుడి దూకుడును ఎందుకు అరికట్టలేకపోతున్నారో అర్ధం కావటం లేదని, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘బహుశా ఇక రాజకీయ జీవితంలో ఇది చివరి అవకాశమని నిశ్చయింకుని, గేట్లు తెరిచినట్లున్నార’ని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అన్నట్లు.. ఈ కుటుంబం చేసే సెటిల్‌మెంట్లకు.. విజయవాడ బందరురోడ్డులోని ఓ స్టార్ హోటల్, వేదిక అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మంత్రి-అల్లుడికి సదరు హోటల్‌తో సత్సబంధాలున్నాయని, అందుకే మాట-ముచ్చట అంతా అక్కడే జరుగుతుంటాయంటున్నారు. సెటిల్‌మెంట్‌కు సంబంధించిన ముడుపులు కూడా, సదరు హోటల్ వారికే సమర్పించుకోవాలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజం నారాయణుడికెరుక?