– సంస్థపై చర్యలు తీసుకోవాలి
• రైతులు, కుమ్మర్ల పట్ల వేధింపులు తగవు
* పాఠశాల భవనాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
* జిల్లా సమీక్షా సమావేశంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు
అనకాపల్లి : నిబంధనలకు విరుద్ధంగా సీనరేజీ వసూలు చేస్తూ, రైతులు మరియు కుమ్మర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏఎంఆర్ (AMR) కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు.
సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ లో జిల్లా ఇంచార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు , జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఏఎంఆర్ సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మర్లు ఇటుకల బట్టీలకు తీసుకువచ్చే మట్టికి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సదరు సంస్థ అమలు చేయడం లేదని, రైతులు, కుమ్మర్లను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, శాసనమండలి సభ్యులు వరుదు కళ్యాణి, గాదె శ్రీనివాసులు నాయుడు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మళ్ల సురేంద్ర, గండి బాబ్జి, పీలా గోవింద సత్యనారాయణ, కోన తాతారావు, కోట్ని బాలాజీ, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, సుందరపు విజయకుమార్, కె.ఎస్.వి.ఎన్. రాజు, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.