– మూడు నాలుగేళ్లలో ప్రగతి తథ్యం… ఆస్తుల విలువలు పెరుగుతాయి
– 5.30 లక్షల బిల్లులు చెల్లించలేని దుస్థితి కి రాష్ట్ర ప్రభుత్వం
– ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా?
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, అమరావతి ప్రాంతంలో అందరి ఆస్తుల విలువలు పెరుగుతాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. జై అమరావతి ఉద్యమంలో భాగంగా గత తొమ్మిది వందల రోజులుగా ఉద్యమిస్తున్న రైతు సోదర, సోదరిమణులకు ఆయన అభినందనలు తెలియజేశారు. జై అమరావతి ఉద్యమంలో భాగంగా బెంగతో అసువులు బాసిన అమరవీరులకు తన హృదయాంజలి ఘటిస్తున్నానని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హస్తినలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఇప్పటికే హైకోర్టు, మార్చి 3వ తేదీన చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళుతుందని తాను భావించడం లేదన్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి కూడా నిన్నటితో గడువు ముగిసిందని వెల్లడించారు. ఇప్పటికే సుదీర్ఘకాలంగా రైతులు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఉద్యమానికి న్యాయం జరిగిందన్న ఆయన, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన అక్కడ మొట్టికాయలు తప్పవన్నారు.
అమరావతి లో ప్లాట్ ల కోసం గతంలో కొనుగోలుదారులు పోటీ పడితే, ఇప్పుడు రోడ్డు దగ్గర ఉన్న ప్లాట్లను కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. అమరావతి లో ప్రస్తుతం ప్లాట్లు కొని నాథుడే లేడని, మా ప్రభుత్వం అమరావతిని అంతగా దిగజార్చిందని విరుచుకుపడ్డారు. తమ పార్టీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని సర్వనాశనం చేసిందనడంలో, అతిశయోక్తి లేదన్న ఆయన 3, 4 ఏళ్ల క్రితం ఉన్న విలువ పెరిగిలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. తమ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆవిరైన ప్రజల ఆస్తి రెండు లక్షల కోట్లు ఉంటుందని రఘురామ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన అనంతరం మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా, హైదరాబాద్ లో నివసించే వారు కూడా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇక్కడకు వచ్చారని గుర్తు చేశారు. పాల బిందెలో విషం పోసినట్లుగా, తమ పార్టీ ప్రభుత్వం మూడు రాజధనులంటూ, దరిద్రపు నిర్ణయం తీసుకున్నదని విరుచుకుపడ్డారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు తమ మైండ్ లో ఏమున్నదో తెలియక ఇష్టారీతి లో మాట్లాడుతుంటే, రైతులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
5.30 లక్షల బిల్లులు చెల్లించలేని దుస్థితి కి రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న మంత్రిత్వ శాఖ ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ ప్రక్రియను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత రెండేళ్లుగా తాను ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నాననీ గుర్తు చేశారు. గుర్రపు డెక్క ఆకు తొలగించడానికి 5.30 లక్షల రూపాయల టెండరు నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ ద్వారా ఆహ్వానించిందని చెప్పారు. అయితే ఈ టెండర్ ఈ ప్రక్రియలో పాల్గొనేవారు, ప్రభుత్వం బిల్లు చెల్లించినప్పుడే తీసుకోవాలని… బిల్లు సకాలంలో చెల్లించకపోతే, కోర్టును ఆశ్రయించిన డానికి వీలు లేదన్న నిబంధనలు విధించడం చూస్తే, బుద్ధున్న వాడేవడు టెండర్లలో పాల్గొనే అవకాశమే లేదన్నారు.
ఈ తరహా నిబంధనలతో గుర్రపు డెక్క ఆకు తొలగించాలంటే ఎన్ ఆర్ జిఎస్ పథకం కింద తొలగించాల్సిందే తప్పితే, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఈ నిబంధనలు విధించిన కూడా తమ ప్రభుత్వ పనులను చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారని చెప్పుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రైవేటుగా బిల్లులు చెల్లించాల్సిందే నని అన్నారు. ఐదు లక్షల రూపాయల బిల్లులు చెల్లించడానికి హలో… లక్ష్మణ అంటూ బీద అరుపులు అరుస్తూ, ఇంకా మూడు రాజధానులు నిర్మిస్తాం అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. విశాఖ రుషికొండ పై 200 కోట్ల రూపాయలతో టూరిజం ప్రాజెక్టు ముసుగులో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దాన్ని అడ్డుకుంటున్నారని రక్త కన్నీరు సినిమా లో నాగభూషణం నటనకు మించి కోర్టులో నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా?
విశాఖలోని దసపల్లా రాజుల భూములను అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం 22 ఏ నోటిఫికేషన్ ఇచ్చి స్వాధీనం చేసుకున్నదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములను ప్రభుత్వ పెద్దలు కాజేయాలని చూస్తున్నారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్, మంత్రి అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి లు ఆరోపించారని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేసిన వెంటనే దసపల్లా భూములను 60 మంది అగ్రిమెంట్ హోల్డర్స్ తో, ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఆకాశహర్మ్యాలను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు.
గతంలో ఏవైతే భూముల పరిరక్షణకు గళం విప్పారో, ఇప్పుడవే భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్, మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్, రెండవ సారి రాజ్యసభ సభ్యుడైన విజయ సాయిలు ఎందుకని మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సేవ్ విశాఖ అని ఉద్యమం నిర్వహించిన విజయసాయి, మన ప్రభుత్వ హయాంలోనే ఈ భూములను క్లియర్ చేసే విశాఖ ప్రజలు ఏమనుకుంటారో చెప్పాలన్నారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ కు ఈ విషయం తెలుసో.. లేదో తనకు తెలియదని, ఈ అ ప్రతిష్టను డబ్బులతో మూట కట్టుకుంటారో, లేక ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చూస్తారో వేచి చూడాలన్నారు.
నోటీస్ ఇవ్వకుండానే సుబ్బారాయుడు సస్పెన్షనా?
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కు తమ పార్టీ నాయకత్వం ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే , సస్పెన్షన్ చేయడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వ సహకారంతో ఎంతోమంది కాపులను ఆయన ఆదుకున్నారని అన్నారు. ఐదు, ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా, మూడు నాలుగు కీలక శాఖలు నిర్వహించిన మాజీ మంత్రి గా మచ్చ లేని వ్యక్తి కొత్తపల్లి సుబ్బారాయుడు అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
తనతో పాటు, నరసాపురం ఎమ్మెల్యే విజయం లోనూ ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. భీమవరం కాకుండా, నరసాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఉద్యమించిన పాపానికి ఆయన్ని సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. నరసాపురం నుంచి పలుమార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా, నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరితే తప్పేముందన్నారు. ఒక్క సుబ్బారాయుడే కాదు, పలువురు జిల్లా కేంద్రాల కోసం ఉద్యమించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రస్తావించారు. వాళ్ళ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, సుబ్బారాయుడు పైనే సస్పెన్షన్ వేటు వేయడం పరిశీలిస్తే, నిజాయితీపరులకు తమ పార్టీలో అవకాశం లేదని స్పష్టం అవుతుందని చెప్పారు.
వస్తున్నా… నియోజకవర్గానికి వస్తున్నా
జులై 4వ తేదీన ఆజాది కా అమృత్ కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో క్షత్రియ పరిషత్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారని, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అల్లూరి స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీ గా పాల్గొనడానికి, రెండున్నర ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నియోజకవర్గానికి వస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్, నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న.పెద్ది మిథున్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ లకు తాను రెండవ తేదీననే నియోజకవర్గానికి విచేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇదే విషయమై లేఖ రాసినట్టు, అదనపు భద్రత కల్పించాలని కోరినట్లు వివరించారు. నియోజకవర్గంలో కార్యకర్తల పేరిట నిరసనను తెలియజేయడం, ఫ్లెక్సీలు దహనం చేయడం వంటి వెర్రి వేషాలు వేస్తే ప్రజలకు తెలిసిపోతుందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అవును… పవన్ అక్షరాల నిజమే మాట్లాడారు
కోనసీమ అల్లర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్షరాల నిజమే మాట్లాడారని రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను ఇదే విషయాన్ని గత వారం రోజుల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. కోనసీమ అల్లర్లలో రెట్టింపు మా పార్టీ వారే పోలీసుల అదుపులో ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. విశ్వరూప్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఆయన కుమారుడు కృష్ణారెడ్డి, తమ పార్టీ ఎంపీటీసీ పై ఆగ్రహించడం పరిశీలిస్తే ఈ కుట్ర కోణం లో ఎవరి ప్రమేయం ఉందో తిట్టే అర్థమవుతుందన్నారు. కోనసీమ అల్లర్లపై నిజానిజాలు నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ప్రత్యేక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీబీఐకి ఒకవేళ కేసు అప్పగించిన తమ పై నే రాష్ట్ర పోలీసులు కేసులు పెడుతున్నారని, వారు విచారణకు ముందుకు వచ్చే అవకాశాలు లే వే మోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇక స్వయం ప్రకటిత సింహాలు సింహం సింగిల్ గా వస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, తమ గొడవ మీకు ఎందుకని పవన్ క ళ్యాణ్ ప్రశ్నించడం సమంజసమేనని పేర్కొన్నారు. ప్రస్తుత మా పార్టీ కావాలా వద్దా అన్నది ప్రశ్నార్థకంగా మారిందని, ఓటర్లు డబ్బు ప్రలోభాలకు లొంగకుండా రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.
మరణం లేని జననం కొంతమందికే సాధ్యం
మరణం లేని జననం కొద్దిమందికే సాధ్యమని మహానుభావుడు ఎన్టీ రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని లతా మంగేష్కర్ తో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి వారికి అది సాధ్యమని రఘురామకృష్ణంరాజు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నివాళులు ఘటిస్తూ వ్యాఖ్యానించారు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన పాటలతో ఎప్పటికీ జీవించే ఉంటారన్నారు. అలాగే ప్రముఖ కవి ఆరుద్ర అ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.