Suryaa.co.in

Devotional

అమృత బిందువులు

నేడు మానవుని అశాంతికి కారణం మితి మీరిన కోరికలు, ఆశలే. మానవుని కోరికలకు అంతులేదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. కనుక కోరికలలో కెల్లా ఉత్తమమైన కోరికను అంటే కోరికలు లేని స్థితిని కోరుకోవాలి. అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది.

భగవంతుడే కావాలి అని మనము కోరుకుంటే మరి దేనినీ కోరుకోవలసిన అవసరము లేదు. దైవాన్ని కోరుకున్నప్పుడు ఇంక కోరేందుకు ఏమీ ఉండదు. ఆ పరమాత్మ మనతో ఉంటే ప్రపంచమంతా మనతో ఉంటుంది. లేకపోతే యావత్ప్రపంచాన్ని మనం జయించగలిగినా జీవితం శూన్యంగా, నిరర్థకంగానే ఉంటుంది. శాంతి ఉండదు. ఆనందం ఉండదు. సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్ళ జీవితాలను గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది.

ధన, కనక, వస్తు, వాహనాదులకు లోటులేని వారెందరో మన చుట్టూ ఉన్నారు. కానీ నిరంతరం ఏదో ఒక వెలితితో బాధ పడుతూనే ఉన్నారు. కారణం మనశ్శాంతి లేకయే. భగవంతుని విడచి బాహ్య ప్రపంచానికి ఆకర్షితులయ్యే వారికి మనశ్శాంతి ఎలా దొరుకుతుంది ?నిత్యమైన సత్యము (ఆత్మ-పరమాత్మ) లను వదిలేసి అనిత్యములు, అసత్యముల వెంట పడితే ఆనంద, సంతోషములు వచ్చునా ?

ప్రపంచానికి మనం ప్రేమతో ఏది ఇచ్చినా…దానిని కొన్ని రెట్లు పెంచి తిరిగి ఇస్తుంది.
ఉదా: మనం ఒక విత్తనాన్ని నాటితే అనేక ఫలాలను పొందడం.
భగవంతునికి మనం ప్రేమతో ఏది ఇచ్చినా తిరిగి అనేక రెట్లు పొందుతాము.
ఏదైనా కావాలి అనుకుంటే ముందు ఇవ్వాలి.
విశ్వంలో అనంతమైన సంపద ఉంది.
పొందిన దానికి కృతజ్ఞత, పంచిన దానికి ప్రేమ ఇవ్వగలిగితే, నిత్యం సమృద్ధి అనే ప్రవాహం పారుతూనే ఉంటుంది.
కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ, మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం.

– ఏ.వీ.రాజు

LEAVE A RESPONSE