Suryaa.co.in

Features

ఒక‌ విస్మయాన్విత తాత్త్విక వర్ణం ఓషో

విచ్ఛిన్నకర, విధ్వంసకర,‌ సగటుమనిషి బతుకును నాశనంచేసే, సమాజాన్ని చంపేసే కమ్యూనిజమ్ వంటి భావజాలాలకు అతీతంగా, మరణాలకూ, మారణకాండలకు, వినాశనానికి అతీతంగా ప్రపంచాన్ని కదిలించారు ఓషో.

(‘కమ్యూనిజమ్ సహజత్వానికి వ్యతిరేకమైనది; అది పిండంలోనే చెదిరిపోయిన సిద్ధాంతం; నేను కార్ల్ మార్క్స్ ను వ్యతిరేకిస్తున్నాను. అతడు ఏమీ చెయ్యలేదు. కమ్యూనిజమ్ సామాన్యుల ఆలోచనల నుంచి పుట్టింది కాదు అంటూ సత్యాన్ని చాలా గట్టిగా చెప్పారు ఓషో)

ఒక‌ విస్మయాన్విత తాత్త్విక వర్ణం ఓషో!
ఓషో (రజనీష్‌, చంద్రమోహన్ జైన్) భారతదేశం నుంచి దూసుకు వెళ్లి పెద్ద‌ఎత్తున‌ ప్రపంచాన్ని ఆకర్షించారు; ప్రపంచంపై ప్రగాఢంగా తన ప్రభావాన్ని చూపారు. గత 150‌‌యేళ్లల్లో ఓషో, జిడ్డు కృష్ణమూర్తి ఈ ఇద్దరిలా ప్రపంచాన్ని కదిలించిన వాళ్లు మఱెవరూలేరేమో?

ఓషో పుస్తకాలు 40కు పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. ఓషో పలుకులు వందలాది పుస్తకాల రూపంలో ప్రపంచంలో పరిఢవిల్లుతున్నాయి. తత్త్వచింతన, చర్చల ఆధారంగా ఓషో ఎన్నో వేల కోట్ల ఆస్తి‌ని సంపాదించారు. తత్త్వశాస్త్రంపై ఒక దృక్పథాన్ని విరజిమ్మి వేలకోట్ల డబ్బును సంపాదించచ్చు అని ప్రపంచానికి తెలియజేశారు ఓషో.

అమేరికాలో 6000 చదరపు కిలోమీటర్స్ విస్తరణలో‌‌ రజనీష్ పుర ఆయనకు ఉండేది. ఆయనకు దాదాపుగా 90‌కి పైగా Rolls Royce కార్స్ ఉండేవి. ఓషో వైభోగాన్ని భరించలేక అప్పటి అమేరిక అధ్యక్షుడు రీగన్‌ ఒక‌ సందర్భంలో ఈ దేశానికి అధ్యక్షుణ్ణి నేనా ఓషోనా అని ఉడుక్కున్నారు.

ఒకరు‌ తన కొడుకును ఓషో దగ్గఱికి తీసుకెళ్లి “వీడు ఇప్పటీకి చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడు, వీడికి బతికేట్టు బుద్ధిచెప్పండి” అని కోరారు. ఓషో ఆ కొడుకుని చూసి “చాలా సార్లు నువ్వు ఆత్మహత్య ప్రయత్నాలు చేశావంటే నీకు‌ చావడం కూడా చేతకాలేదన్న మాట. నువ్వు ఇంక బతకడం అనవసరం” అని అన్నారట. (చావడం కూడా చేతకాని వాళ్లూ, పదేపదే తప్పులు చేసేవాళ్లూ, తప్పుల్ని దిద్దుకోని వాళ్లూ వృథా మాత్రమే కాదు అన్నిటికీ వాళ్లు హానికరమే‌) ఇలా‌ ఉండేది ఆయన తీరు.‌ గాంధీ ప్రవర్తన్ని విమర్శిస్తూ ఆయన మహాత్ముడు అవడేమిటి?‌ అని ప్రశ్నించారు ఓషో.

ఓషో ఎంతో వివాదాస్పదమైనారు.‌ దేశాలు కొన్ని ఆయన్ను తిరస్కరించాయి, కొన్ని నిరోధించాయి, కొన్ని బహిష్కరించాయి. ఓషో ఏ పదను (పదును)తో నడిచారో, ఎదిగారో, బతికారో ఆ పదనుకే తెగిపొయారు. ఆయన్ను అమేరికలో‌ ఖైదు చేశారు.‌ ఆ దేశాన్ని వదిలి వెళ్లాలన్న నిర్బంధంతో విడుదలయ్యారు. అ తరువాత మనదేశం వచ్చి ఇక్కడ మరణించారు. అమేరిక కారాగారంలో ఆయనపై విషప్రయోగం జరిగిందన్న మాట ఉంది.

ఓషోకు జిడ్డు కృష్ణమూర్తి అంటే ఎంతో‌ అభిమానం. రమణ మహర్షి అన్నా ఓషో కు అభిమానం. ‘మాటలులేనిపాట’, ‘మాతృత్వం భక్తికి మఱోపేరు’ వంటి కవితాత్మక అభివ్యక్తులు ఓషో వచనాల్లో మనల్ని అలరిస్తూ ఉంటాయి.

ఓషోపై గోతమ బుద్ధ ప్రభావం ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. “Pathless path” అంటే‌ దారిలేని దారిని తీసుకోమని ఓషో, చైనా కవి-తాత్త్వికులు లావ్ ట్సూ (Lao tzu) చింతనల ఆనుగుణ్యంగా చెబుతారు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన pathless place కు pathless path కు సామరస్యం ఉంది. ఈ రెండిటికీ ఆది‌ శంకరాచార్యలో ఆది కనిపిస్తుంది.

Awareness, consciousness లు వేర్వేఱు అంటూ ఒక పదనైన, విలక్షణమైన, నిశితమైన ఆలోచన, ప్రవర్తన‌లతో ఓషో పయనించారు‌..
ఓషో కూడా కొన్ని సనాతన వైదిక ప్రతిపాదనల లేదా భావాలకు మూర్తిమత్వమే అవడం విశేషం.
భారతదేశం ప్రపంచానికి అందించిన‌ ఒక చింతనావైశేష్యం ఓషో.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE