కె శ్యామ్ ప్రసాద్
తొలి నుండి భారత జాతీయ ఉద్యమాలకు, సాంస్కృతిక విలువలకు దూరంగా, విదేశీ భావజాలంతో వ్యవహరిస్తూ వస్తున్న మార్క్సిస్టులు జాతీయ ఉద్యమంలో ప్రగతిశీల భావాలు వ్యక్తం చేసినవారందరికి మార్క్సిస్టు రంగు పూయడం అలవాటు చేసుకున్నారు.
అదే విధంగా ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు అయిన ఉన్నవ లక్ష్మినారాయణ 1922 లో తెలుగులో రచించిన ‘మాలపల్లి’ నవల వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నవల మార్క్సిస్టు భావజాలంతో వ్రాసిన్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు.
జాతీయోద్యమంలో భాగంగా పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని జైలు పాలైన ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు. ఈ మాలపల్లి నవల ప్రగతి శీలక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మేలిమలుపుగా, సామాజిక దృక్పథంలో ఒక ముఖ్య ఘట్టంగా, సంఘ సంస్కరణ సాహిత్యంలో ప్రామాణికంగా నిలిచింది.
గాంధీజీ రాజకీయరంగ ప్రవేశం నాటి తెలుగు వారి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టిన ఈ నవల ఆయా చారిత్రక సామాజిక, ఆర్థిక ఉద్యమాల సందర్భాలలో వచ్చిన పరిణామాలను వాస్తవిక ధోరణితో సృజనాత్మకంగా తెలియచేసింది.. తెలుగు సాహిత్యంలో ఆధునిక ఇతిహాస కావ్యంగా పేరుపొందిన ఈ మహత్తర నవలను 1958 లో ఆచార్య ఎన్ జి రంగా టాల్‌స్టాయ్ “వార్ అండ్ పీస్” నవలతో పోల్చతగినదిగా అభివర్ణించారు.
వాస్తవానికి ఉన్నవ లక్ష్మీనారాయణలో తండ్రిగారి నుండి కులాలను పట్టించుకోని “సమతా సద్గునం” చిన్న నాటనే లభించింది.వారిలో రాజకీయ స్వాతంత్ర ఇచ్చ ఐర్లాండ్లో బారిష్టర్ చదువుతున్న కాలంలో బలంగా రూపు దిద్దుకుంది.ఒక ప్రక్క హిందూ సమాజ సంస్కర్తగా పనిచేస్తున్నా వారు బలమైన హిందూ వాది.
ఉన్నవ వారిలో రాజకీయ స్వాతంత్య్ర భావాలు,హిందూ సమాజ సంస్కరణా భావాలు,హిందూ విలువుల పట్ల నిష్ఠ ఈ మూడు ప్రవాహాలు సమపాళ్ళలో ఉన్నాయి.దీనికి తోడు రచనా వ్యాసంగం వారికి గల ప్రత్యేక కళ.వారు తాను నమ్మిన అన్ని అంశాలను కార్యాచరణ లో చూపారు. ఇతర కవుల వలె తమ సాహిత్య సందేశంతో వారు ఆగిపోలేదు
జైలు అధికారుల కళ్ళు కప్పి ఆ పుస్తకం బయటకు వచ్చింది.4 భాగాలుగా అచ్చయింది.ఆ నాటి సామాజిక పరిస్థితులు వివరంగా ఈ నవలలో వివరంగా చిత్రీకరించారు. అస్పృశ్యత ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు ఈ నవలకు ప్రధాన ఇతి వృత్తం.,క్రైస్తవ మత ప్రచారం,మార్పిడి కార్యక్రమాలకు గుంటూరు అనాడు ప్రధాన కేంద్రం.ఎస్సీలే కాదు,ఇతర కులాల వారు కూడా ఆనాడే మతం మారేరు.
ఈ నవలలో యేయే కులాల వారు యే గ్రామంలో మతం మారిందీ వారు గ్రామాల పేర్లతో పేర్కొన్నారు.దీనికి తోడు క్రైస్తవ మతం స్వీకరించడం ద్వారానే అంటరానితనం పోతుందని క్రైస్తవ మత ప్రచారకులు ప్రచారం చేస్తున్న కాలం అది. రష్యా విప్లవం ప్రభావం యువకులపై, విద్యావంతులపై తీవ్రంగా ఉన్న కాలం అది.
పేద వర్గాల,నిమ్న వర్గాల,కార్మికుల హక్కులను “ఉన్నవ” వారు సమర్థించారు కనుక వారిపై రష్యా విప్లవ ప్రభావం ఉందని సూత్రీకరించడం సరికాదు. రష్యా విప్లవం సాయుధ విప్లవం, రక్తపాత సహిత విప్లవం.రష్యా చరిత్రలో అనేకమంది అమాయకులు కూడా చంపబడ్డారు.ఉన్నవ వారు తమ నవలలో ఎక్కడా రక్తపాత విప్లవాన్ని సమర్ధించ లేదు.
గాంధీజీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమం,అస్పృశ్యత నిర్మూలన…వంటి నిర్మాణాత్మక ఉద్యమాలు.. ఇవన్నీ వివిధ పాత్రల ద్వారా “ఉన్నవ” వారు ఆ నవలలో చిత్రీకరించారు.కుల అసమానతలు,అస్పృశ్యత లేని సమ సమాజం ఏర్పడాలని ఉన్నవ వారి అంతిమ ఆశయం. మాలపల్లెలు ముని పల్లెలు కావాలని వారు ఆకాంక్షించారు.
ఇది గాంధేయ మార్గంలోనే ఏర్పడుతుందని వారి పరిపూర్ణ విశ్వాసం.ఎస్సీ వర్గాల ఉన్నతే మా ఉద్దేశం అన్న ఆంగ్లేయ క్రైస్తవ ప్రభుత్వం ఎందుకు రెండు సార్లు ఈ నవలను ఎందుకు నిషేధించింది? ఇది సాహితీ వేత్తలు ఆలోచిచాలి.ఈ నవల సందేశం రాజకీయ సందేశం కాదు,సామాజిక సందేశం ప్రధాన మైనది.
రాజగోపాలాచారి గారి చోరవతో 1936లో ఈ నవలపై గల నిషేధం తొలగించారు. అయ్యదేవర కాళేశ్వర రావు గారు ఈ నవలకు ముందు మాట వ్రాస్తూ,”ఈ నవల మహా భారతం వంటిది” అని పేర్కొన్నారు”.ఈ నవలలో వివిధ ఆలోచనలు గల వారితో అనేక పాత్రలు దర్శనం ఇస్తాయి.
కుల అసమానతలు, అస్పృశ్యత లేని హిందూ సమ సమాజం ఏర్పడాలని కోరుకునే వారందరూ ఈ నవలను ఎంతో ఓపికగా చదవాలి.ఒక సారి కాదు, పలు దఫాలు చదవాలి.
(రచయిత జాతీయ సమన్వయ కర్త, సామజిక సమరసత )