Suryaa.co.in

Andhra Pradesh

అవినీతిని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులా?

– ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అవినీతి ప్రశ్నించిన ధారు నాయక్‌ పై అక్రమ కేసు నమోదు
ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు
– రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం. ధారు నాయక్

ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అవినీతిని ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.ధారు నాయక్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రశ్నించిన ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, వేధించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గేట్ చేస్తూ కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు.

గిరిజనుడిగా ఉన్న ఉపముఖ్యమంత్రి రాజన్నదొర… తనతోటి గిరిజన బిడ్డలను దోచుకోవడమే కాకుండా… అతని అవినీతిని ప్రశ్నించిన నాపై సైతం అక్రమంగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట, మక్కువ, సాలూరు రూరల్, సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు బనాయించారని ధారు నాయక్ వెల్లడించారు. గిరిజన హక్కులు కాలరాస్తున్న అధికార పార్టీ నేతల అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని… ఎన్ని కేసులు పెట్టినా వాటికి భయపడే ప్రసక్తే లేదని ధారు నాయక్ స్పష్టం చేశారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల బాధ్యతల్ని గుర్తు చేయటం, తప్పుల్ని ప్రశ్నించటం, అవినీతిని ఎండగట్టడం ప్రతిపక్షంగా అది మా బాధ్యత అని అన్నారు. అవినీతిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటికి దీటుగా సమాధనం చెప్పుకోలేక నాపై అక్రమ కేసులు పెట్టారని, రాజన్నదొర అవినీతిని నిరూపించడానికి ఎక్కడైనా నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని ధారు నాయక్ స్పష్టం చేశారు.

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తాం

గిరిజన సంక్షేమ శాఖ, గురుకులం సొసైటీలో అవినీతి మూడుపువ్వులు ఆరుకాయలు అన్న చందంగా సాగుతోందని, 2022 ఏడాదిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన జాతీయ గిరిజన స్పోర్ట్స్ మీట్‌లో అక్రమ బిల్లులు మార్చిన విషయం వాస్తవం కాదా? అని ధారు నాయక్ ప్రశ్నించారు.

ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో కమిషన్లకు కక్కుర్తిపడి విద్యార్దులకు నాసిరకం సామాగ్రి అందించి అందినకాడికి దోచుకున్నారని అన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.16 కోట్లు నిధులు ఏకలవ్య గురుకుల విద్యాలయాలకు జాతీయ క్రీడల నిర్వహణకు మంజూరు చేసిందని, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు, సిబ్బందికి సరైన వసతి సౌకర్యం, రవాణా సౌకర్యం, శుభ్రమైన భోజనం ఏర్పాటు చేయకుండా నిధులు దోచుకున్నారని అన్నారు.

జాతీయ క్రీడల నిర్వహణ డొల్లతనంతో ఏపీ పరువు దేశవ్యాప్తంగా పోయిందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అవినీతి లెక్కలేకుండా పోయిందని, అవినీతిపై ప్రశ్నించిన తమపై కేసులు పెట్టడం సరికాదని… నిజంగా రాజన్నదొరకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశాలు జారీచేయాలని ధారు నాయక్ సవాల్ చేశారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, రాజన్నదొర అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని, ఎన్ని కేసులు పెట్టినా అవినీతిపై తన పోరాటం ఆగదని ధారు నాయక్ మరోసారి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE