మున్సిపల్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తాం
నాయీ బ్రాహ్మణులకు యువనేత నారా లోకేష్ భరోసా
అమరావతి: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల పాలకవర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని యువనేత నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నాయి బ్రాహ్మణులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మున్సిపల్ కాంప్లెక్స్ లలో నాయిబ్రాహ్మణులకు కొన్నిషాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో క్షురకులుగా నాయిబ్రాహ్మణులను మాత్రమే నియమించే విషయమై గత జిఓలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం. బీసీలకు నాడు-నేడు పెద్దపీట వేసింది తెలుగుదేశం మాత్రమే.
నాయి బ్రాహ్మణులు అహర్నిశలు కష్టపడుతుంటారు. వారి కష్టాన్ని చూసి మంగళగిరి నియోజకవర్గంలోని నాయీ బ్రాహ్మణులకు 122 సెలూన్ షాపులకు కుర్చీలను అందించాం. మంగళగిరిలో సొంతనిధులతో 29 సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పేదరికం లేని మంగళగిరే నా లక్ష్యం. తెలుగుదేశం పార్టీకి కులం, మతం, ప్రాంతీయ భేదం లేదు. తెలుగువారు ఎక్కడున్నా నెం.1 ఉండాలన్నదే మా ఆశయం. జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి ఏడాదికి వెయ్యికోట్లుఖర్చుచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వృత్తిపనివారికి పనిముట్లు అందజేసి ఆదుకుంటాం. బీసీ కార్పోరేషన్లను బలోపేతం చేసి వారికి ఆర్థికచేయూత అందిస్తామని లోకేష్ తెలిపారు.
యువనేత దృష్టికి నాయీబ్రాహ్మణుల సమస్యలు
ఈ సందర్భంగా నాయీహ్మణులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. నాయిబ్రాహ్మణులకు దేవాలయాల్లోని కేశఖండన శాలల్లో ఉపాధి కల్పించాలి. దేవాలయ కమిటీల్లో నాయిబ్రాహ్మణులను సభ్యులుగా నియమించాలి. కార్పోరేట్ సెలూన్లు వచ్చి తమ ఉపాధిని దెబ్బతింటోంది. తక్కువ అద్దెతో మున్సిపల్ కాంప్లెక్స్ లో షాపులు కేటాయించాలి. అమరావతిలో నాయిబ్రాహ్మణుల ఆరాధ్యదైవం ధ్వనంతరి వైద్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించాలి. మంగళగిరి, కాజాలో కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి.
బీసీ సంక్షేమ కమిటీలను పునరుద్ధరించాలి. బీసీ కార్పోరేషన్ ద్వారా రుణాలు అందించాలి. దేవాలయాల్లోని కేశఖండన శాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సెలూన్ షాపులకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. నాయీబ్రాహ్మణులకు సాధికార కమిటీల్లో స్థానం కల్పించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ.. దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం. వీవర్స్ శాల మాదిరిగా నాయీ బ్రాహ్మణులు కార్పోరేట్ పోటీని తట్టుకునే విధంగా అధునాతన శిక్షణకు తగిన చర్యలు తీసుకుంటాం. విదేశీ విద్య పథకాన్ని గతంలో మాదిరిగా అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.