Home » మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా!

మంగళగిరి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికే వచ్చా!

-ఇళ్లులేని వారందరికీ పక్కా ఇళ్లు కట్టి తాళాలు అందిస్తా
-వందరోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తాం
-మంగళగిరి రచ్చబండసభల్లో యువనేత నారా లోకేష్

మంగళగిరి: 2019లో ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది, ఓడిపోయాక ఇక్కడి ప్రజల మనసు గెలిచేందుకు అహర్నిశలు కృషిచేశా, మంగళగిరి సొంతమని భావించి ప్రజల జీవితాల్లో మార్పుతేవడానికే వచ్చానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పార్కురోడ్డు, టిప్పర్లబజార్, నవులూరులో నిర్వహించిన రచ్చబండసభల్లో యువనేత పాల్గొన్నారు. అధికారంలో లేకపోయినా మంగళగిరి ప్రజలకోసం సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాను. 25ఏళ్లపాటు మంగళగిరికి ప్రాతినిధ్యం వహించిన మురుగుడు హనుమంతరావు కుటుంబం గానీ, కరకట్ట కమలాసన్ గా పేరొందిన ఆర్కే గానీ నేను చేసిన సేవా కార్యక్రమాల్లో పదోవంతైనా చేశారా?

గత ప్రభుత్వ హయాంలో ఆటోనగర్ లో పలు ఐటి కంపెనీలు తెచ్చాం. అధికారంలోకి వచ్చాక మంగళగిరికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఇక్కడే ఉద్యోగాలిస్తాం. ఓటమి తర్వాత మంగళగిరి నియోజకవర్గం ప్రతి గల్లిలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నా. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో డ్రైనేజి సమస్య అధికంగా ఉంది, పన్నుల బాదుడు కోసమే కార్పొరేషన్ గా మార్చారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కృష్ణానది పక్కనే ఉన్నా స్థానికులకు తాగునీరు లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే ఒక్కరికి కూడా ఇంటిపట్టా ఇవ్వలేదు. మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆర్కే మాదిరి కన్పించకుండా పారిపోను. భూగర్భ డ్రైనేజితో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా. కృష్ణాజలాలను శుద్ధిచేసి పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తా. ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి తాళాలు అందిస్తా. అయిదేళ్లలో మంగళగిరి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే గంజాయి విచ్చలవిడిగా లభించడం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చాక వందరోజుల్లో గంజాయిని కూకటివేళ్లతో పెకలిస్తామని లోకేష్ చెప్పారు.

ముస్లిం సోదరులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
ముస్లిం మైనారిటీల విషయంలో వైసిపినేతలు ఇంటింటికీ వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 2019లో జగన్ అధికారంలోకి వచ్చాకే మైనారిటీలపై దాడులు పెరిగాయి. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం, పలమనేరులో మిస్బా వైసిపినేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నడిరోడ్డుపై నరికిచంపారు. రాష్ట్రప్రయోజనాల కోసం పొత్తుపెట్టుకున్నాం. మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది.

జగన్ అధికారంలోకి పన్నుల బాదుడే ప్రజల నడ్డివిరుస్తున్నారు. 9సార్లు కరెంటు ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. మద్యనిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్న వైసిపినేతలను ప్రజలు నిలదీయండి. జగన్ కు శవరాజకీయాలు చేయడం అలవాటుగా మారింది. 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవంతో వచ్చారు. కావాలని పెన్షన్ ఇవ్వకుండా జాప్యంచేసి 32మంది వృద్ధులను పొట్టనబెట్టుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చా 3వేల పెన్షన్ 4వేలకు పెంచుతాం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారి ద్వారా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలుచేస్తాం. 3132 కి.మీ.లు పాదయాత్రచేసి తాను గుర్తించిన సమస్యలు తెలిపాక బాబు సూపర్-6 హామీలను ప్రకటించాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాలను అమలుచేసి జగన్ పాలనలో దెబ్బతిన్న ప్రజలకు అండగా నిలబడతాం.

పెద్దకొడుకులా సేవచేస్తారు… లోకేష్ ను ఆశీర్వదించండి
మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయినా సొంతడబ్బుతో సేవలందిస్తున్న యువనేత లోకేష్ ను గెలిపిస్తే ఇంటికి పెద్దకొడుకులా సేవలందిస్తారు, ఆశీర్వదించాలని జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తిచేశారు. పేదలను ఉన్నతస్థానంలో చూడాలని చంద్రబాబు ఆలోచిస్తారు. చంధ్రబాబుకు తోడుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవనన్న పొత్తుపెట్టుకున్నారు. ఎన్నికలవరకే రాజకీయాలు ఉండాలి. జగన్ అయిదేళ్లు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపునకే సమయాన్ని వృధాచేశారు. మరోమారు జగన్ ఉచ్చులో పడకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థిగా బరిలో నిలచిన లోకేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మంగళగిరిలో పైప్ లైన్ కోసం గోతులు తవ్వి వదిలేశారు. స్థానిక సమస్యలు తెలుసుకునేందుకే రచ్చబండ నిర్వహిస్తున్నారు. లోకేష్ ఉక్కు సంకల్పంతో మంగళగిరిని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది. ప్రజలంతా ఈ ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించాలని కోరారు.

యువనేత దృష్టికి పార్కురోడ్డు, తిప్పర్లవీధి సమస్యలు
మంగళగిరి పార్కు రోడ్డులో నిర్వహించిన రచ్చబండ సభల్లో 30,31,32 వార్డుల ప్రజలు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. పాతికేళ్లుగా పార్కు రోడ్డులో నివసిస్తున్నాం, సొంత ఇళ్లు లేవు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఎవరైనా కుటుంబసభ్యులు చనిపోతే ఇళ్లలోకి రానీయడం లేదు. సత్రాలు నిర్మించి ఇబ్బందులు తొలగించాలి. కాల్వల్లో పూడిక తీయడం లేదు. పార్కురోడ్డులో గంజాయి బ్యాచ్ లు చెలరేగిపోతున్నాయి, పిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటే భయమేస్తోంది. రాజధానిలో చిన్న, సన్నకారు రైతులకు గతంలో ప్రకటించిన 4,5,6 ప్యాకేజిలను సవరించాలి, షాపులు కేటాయించాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయకపోవడంతో హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయిదేళ్లుగా డిఎస్సీ ప్రకటించలేదు.

31వవార్డులో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఐటి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించాలి. సెంటు స్థలంలో నిర్మించిన ఇంటికి 40వేల ఇంటిపన్ను వేసి, అది చెల్లిస్తేనే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఇస్తామంటున్నారు. తిప్పర్లబజార్ వాసులు తమ సమస్యలను తెలియజేస్తూ… అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. వాటర్ పైప్ లైన్లలో నీరు అర్థరాత్రి సమయాల్లో వేళాపాళా లేకుండా ఇస్తున్నారు. డిఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీచేయాలి, పరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానికంగా ఉద్యోగాలివ్వాలి. రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం చేపట్టాలి. పెళ్లికానుక, డ్వాక్రా రుణమాఫీ అందలేదన్నారు. నారా లోకేష్ స్పందిస్తూ… రాజధాని రైతులకు ప్యాకేజి సవరించే అంశాన్ని పరిశీలిస్తాం.

అధికారంలోకి వచ్చాక డిఎస్సీ ప్రకటించి టీచర్ పోస్టులు భర్తీచేస్తాం. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ ను తిరిగి ప్రవేశపెడతాం. సత్రాలు నిర్మించే అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజి తర్వాత రోడ్ల నిర్మాణం చేపడతామని లోకేష్ చెప్పారు. ఎంపి అభ్యర్థి చంద్రశేఖర్, నేను డబుల్ ఇంజన్ లా పనిచేసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం. అత్యధిక మెజారిటీతో తమను చట్టసభలకు పంపాలని లోకేష్ విజ్ఞప్తిచేశారు.

Leave a Reply