Suryaa.co.in

Andhra Pradesh

అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత?

-కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోంది
• సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్ధితి నెలకొంది
• ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్

ఎప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోంది. వ్యవసాయానికి నీరే ప్రాణాధారం, అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకు? కృష్ణా నదీ జలాల నిర్వహరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సాగునీటి కాలువల నిర్వహణ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు బలవుతున్నారు.

సకాలంలో కాలువల పూడిక, తూటుకాడ తీయకపోవటం కృష్ణా డెల్టాలో కాలువలు, మురికి కాలువల మరమ్మత్తులకు నిధులు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదు. కట్టలు బలహీనమవటంతో విడుదల చేసిన కొద్దిపాటి నీటికే కట్టలు తెగిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. దీంతో వేల ఎకరాల ఆయకట్టు పరిస్ధితి ప్రశ్నార్దంగా మారింది. చివరకు పట్టిసీమ నీరు కూడా అందజేశారు.

ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పొట్ట దశలో ఉన్న పంటకు నీరు అత్యంత అవసరమన్న కనీస సృహ కూడా ప్రభుత్వానికి లేకపోవటం సిగ్గుచేటు.

కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరో వైపు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోతోంది. అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత? కౌలు రైతుల పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వ చర్యలతో రైతుల నోటికి చేతికి దూరం పెరిగిపోయింది. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు వెన్నెముకను జగన్ ప్రభుత్వం విరగ్గొట్టింది. రైతుల్ని కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలి. రైతులు కోసం ఏ త్యాగానికైనా నేను సిద్దం. అవసరమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడను. ఎమ్మెల్యే పదవి నాకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన బిక్ష. వారి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తా.

LEAVE A RESPONSE