* పార్టీలో చేరనున్న ఆనం కుమార్తె కైవల్య
* ఒంగోలు మహానాడులో లోకేష్‌తో భేటీ
* మరి తెలుగుదేశం తన పాలిసీ మార్చుకుంటుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒంగోలు వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు తొలి బోణీ లభించింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం టీడీపీ వైపు అడుగులు వేసేందుకు, ఒంగోలు మహానాడు వేదికగా మారింది. నెల్లూరు ఉదయగిరి నుంచి వచ్చిన వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం కుమార్తె కైవల్య, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి, త్వరలో జరగనున్న ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీని కోరడం వైసీపీలో కలకలం రేపుతోంది.
చాలాకాలం నుంచి వైసీపీ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై బహిరంగంగానే అసమ్మతి గళం విప్పుతున్న ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, పార్టీ నాయకత్వం దాదాపు పక్కనపెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు టికెట్ ఇవ్వదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలి మంత్రివర్గంలో కూడా ఆయనకు స్థానం కల్పించలేదు. గతంలో నెల్లూరు జిల్లాలో మాఫియా, ఫ్యాక్షన్ రాజ్యమేలుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్య, అసలు నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనా? అధికార పార్టీ ఎమ్మెల్యేనా? కాదా? అంటూ వేసిన ప్రశ్నలు వైసీపీలో కలవరం సృష్టించాయి.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న అందరు ఎమ్మెల్యేల కంటే ఆనం సీనియరయినప్పటికీ, పార్టీ అధినేత-సీఎం జగన్ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోగా.. తనకంటే జూనియర్లను తెచ్చి తమపై రుద్దడాన్ని ఆనం రామనారాయణరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆనం అసంతృప్తికి అది కూడా ఒక ప్రధాన కారణమంటున్నారు. దానితో ఆయన ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఆనం అనుచరులు చెబుతున్నారు.
నిజానికి ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో, అధికారులెవరూ ఆయన ఆదేశాలు పట్టించుకోవడం లేదు. ఆయన సిఫార్సు చేసిన అధికారులను నియమించడం లేదు. జిల్లా స్ధాయి అధికారులు కూడా ఆయనను ఖాతరు చేయడం మానేశారు. చివరకు ప్రధానమయిన ఇరిగేషన్ డిపార్జుమెంటు అధికారులు కూడా ఆయన పిలిస్తే వెళ్లడం లేదు. తన నియోకవర్గానికి సంబంధించి నీటి సరఫరా విషయంలో గతంలో ఆనం చేసిన ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు పంద్రాగస్టు కార్యక్రమానికీ ఆహ్వానం లేకపోవడంతో, అధికారులపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఒకప్పుడు మంత్రిగా జిల్లాను శాసించిన ఆయన, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఆనం అవమానంగా భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆనం, తన అసంతృప్తిని ఎక్కడా దాచుకునే ప్రయత్నం చేయడ లేదు. జిల్లా స్థాయి సాగునీటి సలహాబోర్డు భేటీలో ‘మేం సిగ్గు పడుతున్నాం. అధికారులుగా మీకు ఉందో లేదో నాకు తెలియదు. నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభిస్తామని తప్పుడు నివేదికలిస్తున్నారు. సీఎంను తప్పుదోవపట్టిస్తున్నారు. బ్యారేజీల శిలాఫలకాలు మా పేర్లు కోసం కాదు. మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేపోతున్నారు. మా పరువుపోతోంది. మంత్రి గోవర్దన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి’ అని విరుచుకుపడి సొంత పార్టీని ఇరుకున పెట్టారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపైనా ఆనం తన నిరసన స్వరం వినిపించి, వైసీపీని ఆత్మరక్షణలో నెట్టారు. రావూరు, కలువాయిన ప్రాంతాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, మండల ప్రజాప్రతినిధులు నిర్వహించిన దీక్షలో పాల్గొని మరీ మద్దతు ప్రకటించటం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ‘ఆనం కుటుంబాన్ని రాజకీయాల్లో లేకుండా చేసేందుకు గతంలో ఓ నేత చేసిన నియోజకవర్గ విభజనతో ఆ నేతకు ఆగతి పట్టింది. ఇప్పుడు కూడా అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేస్తే అధికార పార్టీకి పుట్టగతులుండవ’ని హెచ్చరించి సంచలనం నృష్టించారు.
కాగా నెల్లూరు జిల్లాలో కొంతమంది వైసీపీ అగ్రనేతలు అడ్డదారుల్లో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై ఆనం చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఆయుధంలా మారాయి. ‘నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోంది. పోలీసులు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నెల్లూరులో పరిస్థితులేమీ బాగోలేవు. మాఫియాలు, బెట్టింగ్ రాయుళ్లు, కబ్జాకోరులు ఎక్కువయ్యారు. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్ ఏ మాఫియా కావాలన్నా నెల్లూరుకొస్తే దొరుకుతుంది. ఇదంతా నెల్లూరు నగర ప్రజలు చెప్పుకోలేకకపోతున్నారు. కొంతమంది మాఫియా గ్యాంగులు, నెల్లూరును గ్యాంగ్‌స్టర్లకు అప్పగించారు. గుండెనిబ్బరంతో పనిచేసే పోలీసు అధికారులకు ఉద్యోగభద్రత ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఇలా ముగ్గురు ఎస్పీలను మార్చేశారు. దీనికి కారణం మా ఎమ్మెల్యేలు, పలుకుబడి’ అంటూ చేసిన వ్యాఖ్యలు.. వైసీపీని ప్రజల్లో రాజకీయంగా ముద్దాయిగా నిలబెట్టాయి. ఆనం వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, కొన్నిరోజులు విపక్షాలు వైసీపీ సర్కారుపై విమర్శల వర్షం కురిపించాయి.
ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్య టీడీపీ యువనేత లోకేష్‌ను కలవటం రాజకీయంగా చర్చనీయాంశమయింది. దివంగత మంత్రి మేకపాటి ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికలో, ఆమె టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కైవల్య బద్వేలు టీడీపీ ఇన్చార్జి విజయమ్మ కోడలయిన కైవల్యను బిజివేముల కుటుంబమే పోటీకి ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు. బద్వేలు రిజర్వుడు నియోజవర్గం కావడంతో, బిజివేముల కుటుంబానికి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే.. మృతి చెందిన వారి నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో, ్ల పోటీ చేయకూడదన్న పార్టీ విధాన నిర్ణయాన్ని టీడీపీ నాయకత్వం కొనసాగిస్తుందా? లేక ఆనం కుమార్తె, బిజివేముల కోడలు కైవల్య కోసం సడలిస్తుందా అన్నది చూడాలి.