ఇవాళ తెలుగు హిట్ సినిమాల్లో నెంబర్ 1 ఏది?
సత్యసాయి మహిమలపై వచ్చిన ‘అనంత’ సినిమా , ఇవాళ తెలుగు హిట్ సినిమాల్లో నెంబర్ 1.
నిజానికి ‘అనంత’ సినిమా కమర్షిఅల్ సినిమాగానో, హిట్ అవడం కోసమో తియ్యలేదు. పుట్టపర్తి సత్యసాయిపై భక్తితో సత్యసాయి స్మరణార్థం తీసిన సినిమా.
పుట్టపర్తి సత్యసాయి శతవర్ష జన్మోత్సవంలో భాగంగా వచ్చిన సినిమా ‘అనంత’. ‘అనంత’ తెలుగు, తమిళ్ష్, హిందీ భాషల సినిమా.
“అనంత సినిమాను కమర్షియల్ సినిమాగా తియ్యలేదు. కానీ ధైర్యం చేసి కమర్షియల్ సినిమాగా విడుదల చేస్తే రోజు రోజుకూ పుంజుకుని ఒక హిట్ సినిమా ఔతుంది” అని నేను నవంబర్ 24న సోషల్ మీడిఅలో చెప్పాను. ఇవాళ సినిమా సూపర్ హిట్ అయింది. సంతోషం.
Taking valuesతో ‘అనంత’ సినిమా ‘a pleasent present’ అని నేను నవంబర్ 24న అంటే ఇవాళ suprising super hit అయింది. దర్శకుడు సురేష్ కృష్ణ ఘనత ఇది. అనంత సినిమా తమిళ్ష్ వెర్షన్ బాగా హిట్ అయినా తెలుగు వెర్షన్ అంత కన్నా హిట్. తెలుగు రచయిత రాజేంద్ర కుమార్ ప్రతిభాత్మక కృషి కూడా అందుకు కారణం.
‘అనంత’ సత్యసాయి బయోపిక్ కాదు; సత్యసాయి మహిమలపై ఒక ప్రశంసనీయమైన ఫ్లిక్ (flick)!
1999లో నటి అంజలీదేవి సత్యసాయి బయోపిక్ తీశారు! ‘శిరడీ సాయి పర్తి సాయి దివ్య కథ’ పేరుతో అంజలీదేవి టెలీ ఫిలిమ్స్ పతాకంపై వచ్చిన 8గంటల డాక్యుమెంటరీ సినిమా అది. ఈ చారిత్రిక సమాచారాన్ని టీ. సంతానకృష్ణన్ తెలియజేశారు. (టీ. సంతానకృష్ణన్ మన వీ.ఎ.కె. రంగారావుకన్నా దక్షిణ భారతదేశంలో విలువైన, ప్రామాణికమైన, సరైన, గొప్ప సినిమా డాక్యుమెంటేషన్ కలిగిన వారు)
బహుశా సత్యసాయి పరంగా వచ్చిన తొలి సినిమా ‘ శిరిడి సాయి పర్తి సాయి దివ్య కథ’
అయుండవచ్చు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వచ్చింది. సత్యసాయి సాధన ట్రస్ట్ పబ్లికేషన్స్ డివిషన్- ఆంధ్రప్రదేశ్ వారి సమర్పణ ఇది.
‘ శిరిడి సాయి పర్తి సాయి దివ్య కథ’ సత్యసాయి జననం నుంచి సిద్ధి పొందిన స్థితి వరకూ చిత్రీకరించబడింది. సత్యసాయి ఆమోదంతోనూ, నేతృత్వంలోనూ ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు అంజలీదేవి నిర్మాత అయితే సహ నిర్మాత షావుకారు జానకి.
అంజలీదేవి చెన్నైలోని తన సొంత స్థలాన్ని ‘సుందరం’ పేరుతో సత్యసాయి టెంపుల్ నిమిత్తం ఇచ్చేశారు.
‘అనంత’ బయోపిక్ కాకపోతే మరేమిటి? ‘అనంత’ ప్రత్యేకత ఏమిటి? 5గురు వేర్వేఱు దేశ, విదేశ వ్యక్తుల జీవితాలలో లేదా 5 వేర్వేఱు కుటుంబాలలో సత్యసాయి మహిమల లేదా లీలల విలాసాలను ఒక గొప్ప కావ్యంగా అల్లడం లేదా నేయడం ‘అనంత’ విశేషం.
కావ్యంగానా? ఔను కావ్యంగానే సినిమాను రూపొందించారు దర్శకుడు సురేష్ కృష్ణ. నిజానికి కథ, కథనం పరంగా, ట్రీట్మంట్ పరంగా పెద్దగా, గొప్పగా చెయ్యడానికి, చెప్పడానికి ఎంత మాత్రమూ అవకాశం ఉండని ఇలాంటి సందర్భంలో సురేష్ కృష్ణ చాల విశేషంగా ఈ సినిమాను రూపొందించారు. బాషా వంటి సినిమాతో తానేమిటో ఈ పాటికే నిరూపించుకున్న సురేష్ కృష్ణ ఈ ‘అనంత’తో తాను అంతకు భిన్నమైన, అంతకు మించిన ‘సినిమా రూపశిల్పిని’ అని ప్రశాంతంగా చాటుకున్నారు. ఒక్క ఊపులో రెండు గంటలలో మొత్తం సినిమాను రాసుకున్నారు సురేష్ కృష్ణ.
‘అనంత’ పూర్తిగా దర్శకుడి సినిమా. ముఖ్యంగా షాట్ మేకింగ్, ఫ్రేమింగ్ చాల గొప్పగా చేశారు సురేష్ కృష్ణ. కేరళ వ్యక్తి ఉదంతంలో ఈ కేరళ వ్యక్తి భార్య బాధ పడే సన్నివేశాలను షాట్స్లోకి అనువదించిన విధానం విశేషం. ఆ భార్య పాత్రధారి శ్రీరంజని చాల గొప్పగా నటించారు.
శ్రీరంజని తమిళ్ష్ టీ.వీ. సీరియల్స్ నటిగా నాకు తెలుసు. కానీ ఆమె ఎంత గొప్ప నటో ఇదిగో ఈ అనంత సినిమా వల్ల తెలిసింది. అనంత సినిమాలో జగపతి బాబు, సుహాసిని, వంటి ప్రముఖ నటీ నటులు ప్రధాన పాత్ర ధారులు. సుహాసిని మంచి నటి అని మనకు తెలుసు. కానీ ఈ ‘అనంత’లో సుహాసిని కన్నా ఇతర నటీనటుల కన్నా శ్రీరంజని గొప్ప నటి.
‘అనంత’లో దర్శకత్వం తరువాత విశేషమైన అంశం సంగీతం. సంగీత దర్శకుడు దేవా చాల మంచి సంగీతం చేశారు. ప్రధానంగా రి రికడింగ్ (రీ రికార్డింగ్) చాల గొప్పగా ఉంది. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ మేలుగా ఉంది. Tone… చిత్రీకరణకు లేదా చిత్రీకరణలో ఎన్నుకున్న లేదా నిర్దేశించుకున్న tone ప్రశంసనీయం. ఇది దర్శకుడు, కెమెరా మెన్ సమష్టి సృష్టి.
తెలుగు ‘అనంత’లో సంభాషణలు, పొట్టి పాటలు రచయిత రాజేంద్రకుమార్ రాశారు. మెచ్చతగ్గటుగా, మేలుగా రాశారు. సినిమాలో ప్రధానమైన పాట “నీ నామమే చాలు.. హే సాయి దేవా…” పాట. రామజోగయ్య శాస్త్రి బాగా రాశారు.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చెయిర్మన్ రత్నాకర్ పూర్తి సహకారంతో, ప్రోత్సాహంతో సత్యసాయి భక్తుడు గిరీష్ కృష్ణమూర్తి (పారిశ్రామిక వేత్త) అంకితం (నిర్మాణం) చేసిన సినిమా ఈ అనంత.
సత్యసాయి అభిమానులకు, అనుయాయులకు, భక్తులకు అనంత ఒక ‘ప్రత్యగ్రమైన కానుక’. ఇంకా అందుకోని వాళ్లు ఇక జాప్యం చేయక అందుకోండి ఆ ‘అనంత’ను.
– రోచిష్మాన్
9444012279